వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించిన మాదిగ దండోరా ఉద్యమం ఉద్భవించి నేటికి పాతికేళ్లు పూర్తయింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వాన ఇరవైమంది యువకులతో పురుడుపోసుకున్న ఈ ఉద్యమం ఆనాటినుంచీ సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ, సమాజాన్ని సంస్కరించడం కోసం అలుపెరగని కృషి చేస్తోంది. అణగారిన కులాల ఆత్మగౌరవ పతాకగా, ప్రతీకగా పాలకులను ప్రశ్నిస్తూ ప్రజలమధ్యే నిలిచి ఉంది. సామాజిక న్యాయమంటే ‘సమాన పంపిణీ’యేనని నినదించింది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ల కోటాను కోరుతూ అంబేడ్కర్ వారసత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. ఈ ఉద్యమం తరతరాలుగా అవమానాలకూ, అన్యాయాలకూ, అణచివేతలకూ, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న జాతిని ఏకం చేసింది. జాతి మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి దాన్నొక శక్తిగా మలిచింది. నిషిద్ధాక్షరిగా మారిన ‘మాదిగ’ పదాన్ని శక్తిమంతమైన నినాదం చేసి జాతిలోని ప్రతి ఒక్కరూ తమ పేరు చివర చేర్చుకోవడమే నిజమైన, నిండైన ఆత్మగౌరవమని ప్రకటించింది. దౌర్జన్యానికి గురయ్యే జాతికి సమాజంలో గుర్తింపునూ, గౌరవాన్నీ, సామాజిక భద్రతనూ సాధించిపెట్టింది. వివిధ పార్టీల్లో మాదిగల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచింది. మాదిగ దండోరా ఉద్యమం ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, అవమానాలు, అవరోధాలు, నిందలు, నిర్బంధాలు, కష్టాలు, కన్నీళ్లు, కుట్రలు, కుతంత్రాలు అధిగమించింది.
ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల సామాజిక వర్గీకరణ సమస్త అణగారిన కులాల్లో సామాజిక స్పృహను రగిల్చింది. తుడుందెబ్బ, నంగారభేరి, మోకు దెబ్బ, పూసలకేక, కుర్రు, చాకిరేవు, మాలమహానాడు, ముదిరాజ్ మహాసభ తదితర కులహక్కుల సంఘాల ఆవిర్భావంలో దండోరా ఉద్యమ ప్రభావ స్ఫూర్తే ఉంది. వివిధ మాదిగ ఉపకులాల సంఘాలను బలోపేతం చేసి వాటిల్లో సైతం నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది. ఉపకులాలవారికి ఆర్డీఓల ద్వారా కాక ఎమ్మార్వో ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా పోరాడి సాధించింది. ఏబీసీడీ వర్గీకరణ ఫలాల్లో ప్రథమ ఫలాన్ని మాదిగలకు కాకుండా వారికన్నా వెనకబడి ఉన్న రెల్లి ఉపకులాలకు అందించి కింది కులాలపట్ల తన బాధ్యతను ఆచరణాత్మకంగా నిర్వర్తించింది. అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టింది. అంతేకాదు...సందర్భం వచ్చినప్పుడల్లా మాలల పక్షపాతిగా మాదిగ దండోరా నిలబడింది. ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు, సుద్దాల దేవయ్యను చంద్రబాబు అకారణంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు వారికి అండగా నిలబడింది. ఢిల్లీలో చందర్‌రావు అనే మాల అధికారిపై తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్‌రావు దాడిచేసినప్పుడు, గీతారెడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోరాడింది. ఉమ్మడి అభివృద్ధికి, పురోగతికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చాలని చూసినప్పుడు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించి ఆ కుట్రలను వమ్ము చేసింది.
తెలుగు నేలపై ఇంతటి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉన్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదనే ఆవేదన మాదిగ జాతిని వెన్నాడుతోంది. పాలకపక్షాలు మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనం వహించడం, ఈ ఉద్యమ ప్రభావంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాదిగ జాతి నేతలు రాజకీయ బానిసత్వం చేస్తూ ద్రోహం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మాదిగల అస్థిత్వ ఉద్యమానికి పునాదులు వేసిన ఈదుమూడి వేదికగానే ఎంఆర్‌పీఎస్ ‘మాదిగల ఆత్మగౌరవ జాతర’ పేరుతో జరిగే 25 వసంతాల ఉద్యమ ప్రస్థాన వేడుకలో సమరశంఖం పూరించబోతోంది.
రాగల్ల ఉపేందర్ మాదిగ ‘ మొబైల్: 95736 35356
సామాజిక ఉద్యమ స్ఫూర్తి ‘దండోరా’
Published Sun, Jul 7 2019 4:58 AM | Last Updated on Sun, Jul 7 2019 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment