బాబ్లీపై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే | ABK Prasad Article On Babli Project | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 2:36 AM | Last Updated on Tue, Sep 18 2018 2:36 AM

ABK Prasad Article On Babli Project - Sakshi

బాబ్లీ ప్రాజెక్టు (ఫైల్‌ ఫొటో)

బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్‌ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు. ఫలితంగా ఇప్పటికి మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్‌ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలుడని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడటం!

2010లో నేను బాబ్లీ (మహారాష్ట్ర) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఆ రోజున బాబ్లీ కట్టడాన్ని మహారాష్ట్రకు అను కూలంగా నాటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమర్థించారు.
   – ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ‘జలసిరి’ బహిరంగసభలో (కర్నూలు జిల్లా)14–9–2018

చదవేస్తే ఉన్న మతి పోయిందన్న సామెత బహుశా చంద్రబాబు లాంటి పాలకుల్ని చూసి పుట్టి ఉంటుంది. అసలు 2010 నాటికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సజీవుడిగా ఉన్నట్టు ఏ దాఖలాలను బట్టి బాబు చెప్పడా నికి సాహసించారు? అప్పటికి ప్రతిపక్ష నాయకుని పాత్రలోనే ఉన్న బాబుకి 2009లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉండగా హెలికాప్టర్‌ ప్రమా దంలో వైఎస్‌ దివంగతులైన విషయం తెలియదా? లేక ‘మతి తప్పిన మొదటి వేల్పుల’ జాబితాలోకి జారుకున్న బాబు అంతటి అబద్ధానికి పాల్పడ్డారా? ఇంతకీ అసలు పచ్చి అబద్ధం–బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్‌ సమర్ధించారన్నది. అందుకు తోడుదొంగగా ఒక తైనాతీ దిన పత్రికను ఆయన ఉదహరించడం! ఆదరా బాదరాగా చంద్రబాబు ఇన్ని అవాకులు, చవాకులు పేలడానికి అసలు కారణం తెలంగాణలో తక్షణం, ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని మాసాల్లో జరగనున్న ఎన్నికలు. రెండు చోట్లా కునారిల్లిపోతున్న టీడీపీని బతికించుకునే దింపుడు కళ్లం ఆశకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర కోర్టు నుంచి నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ వచ్చిపడింది.

మూడేళ్ల క్రితమే చంద్రబాబుకు, ఆయన పరివారానికి ఈ కేసులో వారంట్‌ వచ్చింది. అసలా సీరియస్‌ నోటీస్‌ ఎందుకు రావలసి వచ్చింది? తెలంగాణ, కోస్తా జిల్లాల జ లాధారాలకు, ప్రాజెక్టులకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తల పెట్టడానికి నిరసనగా ఆనాటి టీడీపీ సహా కొన్ని ప్రతిపక్షాలు ఆందోళన తలపెట్టడంలో తప్పులేదు. కాని, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రాజె క్టులకు, ప్రజాహిత పథకాలకు అంకురార్పణ చేసి, వాటిని విజయవం తంగా అమలు చేసిన రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు అభాండం వేయడం మాత్రం క్షమించరాని నేరం. బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టింది మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం కాగా, దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమం త్రిగా వైఎస్‌ అఖిలపక్షానికి నాయకత్వం వహించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయించేందుకు కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లారన్న విషయం మరచి పోకూడదు. వైఎస్‌ నాయకత్వాన ఢిల్లీ వెళ్లిన బృందంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబూ ఉన్నారు.

1975లో ఒప్పందం
1969లో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ ఏర్పడిన తర్వాత 1975లో గోదావరి జల వినియోగంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు శ్రీరాంసాగర్‌ (పోచంపాడు) నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఏపీ అంగీకరించింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉండగానే బాబ్లీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2003 వరకు ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నా, బాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక, పోచంపాడు పరిధిలో బాబ్లీ బరాజ్‌ నిర్మాణం జరుగుతోందని 2005 మేలో తొలిసారిగా గుర్తించారు. ఈ విషయం తెలి సిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగానే కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లేదని (మహారాష్ట్ర 1975 ఒప్పందాన్ని తిరగదోడదలచినప్పుడు) ఇంజనీర్ల బృందం ధ్రువీక రించింది. బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్రం ఆదేశించింది.

కాగా, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర గైర్హాజరయింది. దీంతో మహారాష్ట్రకు బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం 2006 జనవరి 7న స్పష్టం చేసింది. ఈ కుట్రనంతా బయటపెడుతూ తొలిసారిగా ఇక ‘‘బాబ్లీ కథ ముగిసింది’’ అనే పతాక శీర్షికతో ఓ దినపత్రికలో హెచ్‌. బాబ్జీ అనే విలేకరి ప్రత్యేక కథనంగా ప్రచురించడం జరిగింది. గతంలో ఆ పత్రికకు నేను ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాను. ఈ ప్రత్యేక కథనంలో బాబ్లీ నిర్మాణం రహస్యంగా మహారాష్ట్ర పూర్తి చేసుకున్న వైనాన్ని వివ రించడంతోపాటు ఏపీ ప్రజలను, రాజకీయపార్టీలను హెచ్చరించడం జరిగింది. అప్పటికే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ దశలో ఏ ఒక్క ఇతర రాష్ట్రం పిట్టనూ ప్రాజెక్టు వైపునకు రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ కథనం రాసిన విలేకరి మహారాష్ట్రలోని తన స్నేహితుని అండదండలతో ప్రాజెక్టు ఫోటోలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా బయటపడ్డాడు. నిఘా సంస్థల కళ్లపడకుండా ఇంత సాహసం చేశాడు.

గత నాలుగు దశాబ్దాలుగా సాగిన కుట్ర, కేంద్రం ఆదేశాలను తోసిపు చ్చిన మహారాష్ట్ర బరితెగింపు చర్యల ఫలితం ఇది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలను ధిక్కరించి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న వైనంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఏపీ అభ్యం తరాన్ని వైఎస్‌ తెలపడమే గాక, మహారాష్ట్ర సీఎంకూ(2006 ఏప్రిల్‌ 4) నిరసన తెలిపారు. బాబ్లీ నిర్మాణం నిలిపివేయాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళుతూ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు(2006 ఏప్రిల్‌ 10) చేశారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించి నిర్మిస్తున్న బాబ్లీని నిలిపివేయాలన్న ఏపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు (2006 జులై 7) విచారణ చేపట్టింది. 8 వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. అయినా, మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా 2.70 టీఎంసీల సామర్ధ్యంగల బాబ్లీ నిర్మాణాన్ని పూర్తిచేసింది.

వైఎస్‌పై అపనింద వేసి తప్పుకోజూసిన బాబు!
బాబ్లీ కథ తెరకెక్కిన తొలి రోజుల్లో ఈ సమస్యపై చంద్రబాబునాయుడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక నిరసన ప్రదర్శన పెట్టి చాలించుకున్నారు. కానీ, రెండోసారి బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అను మతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్‌ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్‌ చేసి, కొట్టి సుమారు 15 రోజుల పాటు ఓ స్కూలు ఆవరణలో ఉంచారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు.

ఫలితంగా ఇప్పటికి సమన్లు అందుకోనందుకు గాను మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. 2013లో చంద్రబాబుపై ప్రారంభమైన విచారణ ఇలా సాగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్‌ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలు  డని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడడం! తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలను సాకుగా చేసుకుని, తనపై బీజేపీ చేస్తున్న ‘కపట రాజకీయ దాడి’ని తిప్పికొట్టడానికి చంద్రబాబు మధ్యలో దివం గత నేత వైఎస్‌ పేరును అడ్డగోలుగా బాబ్లీ వివాదంలోకి లాగారు. 2010లో జీవించి లేని రాజశేఖరరెడ్డిపై నిందమోపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

నిజానికి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఒక్కటే కాదు, గోదావరిపై మరో నాలుగు ప్రాజెక్టులను నిర్మించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోనే బాబ్లీ నిర్మాణం పూర్తి చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల దిగువన ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, కోస్తా ఆంధ్ర జిల్లాల భూములు బీడు పడిపోతాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ‘మాకు ఫికరులేదని’ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యులు కొందరు దిలాసాగా ప్రక టించారు. తమ భూభాగంలోకి గోదావరిలోకి నీళ్లు చేరితే తమ లక్ష్యం పూర్తయినట్టేనని చెప్పారు. బాబ్లీతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎడారి కాగలదన్న భీతి ప్రజలలో ఇంకా పోలేదు. సింగూరు బ్యాలెన్సింగ్‌ రిజ ర్వాయరు, హైదరాబాద్‌ మంచి నీటి సరఫరాకు ఆటంకాలు ఇంకా తొలగలేదు.

వైఎస్‌ తెలంగాణ సౌభాగ్యంలో భాగంగా తలపెట్టిన చేవెళ్ల–ప్రాణహిత, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీరు అవసరం. ‘జలయజ్ఞాని’కి తలమానికంగా చెప్పుకున్న ఈ ఎత్తిపోతల పథకాలను బాబ్జీ ప్రాజెక్టు కబళించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బాబ్లీ నిర్మా ణాన్ని ఆపవలసిందిగా మొదట్లో ఆదేశించిన సుప్రీంకోర్టు కూడా చివరికి మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణానికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ రోజుల్లో ఏ లాబీ, ఎక్కడ, ఏ సంస్థలో పనిచేస్తోందో ప్రజలకు మాత్రం పాలుపోని స్థితి. ముఖ్యంగా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉంచి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టాన్ని అడ్డగోలుగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపిణీలో కుటుంబాలు ఎలా తన్నులాటలకు దిగుతాయో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమ స్యలు తెలుగు వారిని వెన్నంటుతూనే ఉన్నాయి. 1969 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో బాబ్లీ కథ మొదలయింది. 2010లో దాని నిర్మాణం ఇంకాస్త రహస్యంగా ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల ముందు రాజకీయ ప్రయోజనాలు పనికి రావనే ఆరోగ్యకర భావన కొర వడితే రాజకీయ పార్టీలు (అది ఏ పక్షమైనా సరే) ప్రజల నమ్మకం కోల్పోక తప్పదని, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే అది ఆత్మహత్యా సదృశమేనని దేశాల చరిత్ర చెబుతోంది.

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@ahoo.co.in



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement