‘సుప్రీం’ చైతన్యం కోల్పోతోందా?! | ABK Prasad Guest Column Supreme Court Of India | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ చైతన్యం కోల్పోతోందా?!

Published Tue, Mar 3 2020 12:32 AM | Last Updated on Tue, Mar 3 2020 12:32 AM

ABK Prasad Guest Column Supreme Court Of India - Sakshi

దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) పౌరహక్కుల్ని రక్షించే కర్తవ్యాన్ని విస్మరించింది. తాజా పౌరసత్వ సవరణ చట్టం ప్రక టిత మతాతీత లౌకిక వ్యవస్థను, దేశ రాజ్యాంగ మౌలిక వ్యవస్థనూ ఉల్లంఘిస్తోంద నడంలో ఎలాంటి సందేహమూ లేదు. పౌరుల ప్రాథమిక పౌరహక్కుల్ని, ముఖ్యంగా హెబి యస్‌ పిటిషన్‌కి సంబంధించిన ముఖ్యమైన కేసులకు ప్రాధాన్యమివ్వడంలో ధర్మాసనం సాచివేత వైఖరి ఆశాభంగం కలిగిస్తోంది. భారత రాజ్యాంగ చట్టాన్ని ధిక్కరిస్తున్న నేటి పౌరసత్వ సవరణ చట్టం, పౌరులందరూ రాజ్యాంగ చట్టం నిర్దేశించిన సమన్యాయానికి అర్హులని నిర్దేశిస్తూ హామీ పడిన 14వ అధికరణను అయిదు స్థాయిలలో ఉల్లంఘిస్తోంది. తాజా సవరణ చట్టా నికి 2014 డిసెంబర్‌ 31 అని ఆలోగా పౌరులు నమోదు చేసుకోవాలనే నిబంధనను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దీనర్థం ఏతావాతా, ఆ తేదీ తర్వాత దేశంలోని మైనారిటీలను వేధించడం ఆగిపోతుందని అర్థమా లేదా ఆ తర్వాత భారత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకో బోదనా? భారత రాజ్యాంగ నిర్మాతలలో నూటికి 80 మంది హిందువు లేనని వీరంతా పౌరసత్వ సవరణ చట్టాన్ని చూసి కుపితులవుతారని, ఈ తాజా చట్టం తమను మోసగించిందని భావించడం ‘అనివార్యం’  – సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.పి. షా ఇంటర్వ్యూ (31–1–2020)

బీజేపీ–ఆరెస్సెస్‌ ఎన్డీయే పాలకులు కొత్తగా పౌరసత్వ చట్టాన్ని (సీఏఏ) జాతీయ జనాభా లెక్కల చిఠా–ఆవర్జా రిజిస్ట్రేషన్‌ చట్టం (ఎన్‌.పి.ఆర్,), జాతీయ స్థాయిలో పౌరుల నమోదు చట్టం పేరుతో మూడురకాల గందరగోళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత పాలకులు ఎందుకీ చట్టాలను పౌరులపై రుద్దుతున్నారన్న అనుమా నాలు చర్చలు మొదలయ్యాయి. మొదలవటమే కాదు ఇటీవలి కాలంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన గత అయిదేళ్ల కాలం లోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం అనుసరిస్తున్న విధానాలలోనూ, తీర్పులలోనూ కూడా దేశ ప్రజలు కొన్ని మార్పుల్ని పసిగట్టగలుగుతు న్నారు. అనేక తీర్పుల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైన లేదా కొందరు న్యాయమూర్తుల పైన పాలకవర్గం ఒత్తిళ్లు ఒకమేరకు ఉన్నట్లుగా దేశప్రజలలో అనుమానాలు మొలకెత్తుతున్నాయి. పైన తెల్పిన మూడు రకాలుగా పౌరులను వేధిస్తున్న సవరణ చట్టాల విష యంలోనే గాక అంతకుముందు బాబ్రీమసీదు కూల్చివేతకు సంబం ధించిన పరిణామాల పూర్వరంగంలో ఇటీవల ధర్మాసనంలోని కొందరు న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులు కూడా పౌరులలో అనుమానాలకు దారితీసింది. దానికి తగినట్లుగానే ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు పైన తెలిపిన మూడురకాల వేధింపు చట్టాలకు సమర్థనగా చేస్తున్న ప్రకటనలు ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉంది. సుప్రీంకోర్టు తాలూకు కొన్ని ధర్మాసన తీర్పులపై ‘నమ్మకం’ (ఎలా కలిగిందన్న ప్రశ్న మనం వేయకూడదు) పాలకులకు ఎలా కలిగి ఉంటుందన్న ప్రశ్నకు ప్రధాని మోదీ వివరించిన తీరే సాక్ష్యం. ఫిబ్రవరి 23, 2020న దేశ రాజధానిలో ప్రారంభమైన అంత ర్జాతీయ న్యాయసదస్సులో మోదీ ప్రసంగిస్తూ, మారుతున్న ప్రపం చంలో న్యాయవ్యవస్థ కూడా ఎలా ఒదిగిపోతోందో చెప్పకనే చెప్పారు. 

తీర్పుల్ని జనం స్వాగతిస్తున్నారా?
మోదీ మాటల్లోనే చెప్పాలంటే, దేశంలో క్లిష్టమైన అంశాలపైన ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమైనా, వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల పైగా ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతి స్తున్నారని మోదీ చెప్పారు. ఇందుకు ఉదాహరణలుగా ఆయన అయోధ్య వివాదంపై భట్టిప్రోలు పంచాయితీలాగా కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ఎందుకు, ఏ పరిస్థితుల్లో తలకెత్తుకోవలసి వచ్చిందో దేశ ప్రజలకు అర్థమైపోయింది. భయాలున్నా ప్రజలు కోర్టు తీర్పుల్ని స్వాగతించారని మోదీ చెప్పే మాటల వెనుక అంతర్లీనంగా దాచుకో లేని బెదిరింపు ధోరణి కూడా ఉంది. అదే విధంగా పౌర జీవితాలను చట్టసభలలోని ‘బ్రూట్‌ మెజారిటీ’ ద్వారా శాసించ గోరుతున్న అమిత్‌షా ఇటీవల పౌర జీవితాల్ని శాసించే మూడు ప్రజా వ్యతిరేక నిబంధనలను (సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్‌) సమర్థించుకుంటూ దేశవ్యాపితంగా ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పెక్కు రాష్ట్రాలలో, ప్రాంతాలలో న్యాయ బద్ధంగా చెలరేగిన నిరసనల సందర్భంగా చేసిన ప్రకటనలు కూడా ‘పుండుమీద కారం’ చల్లినట్టుగానే ఉన్నాయి. ఎంతసేపూ పౌరులంటే–రాజ్యాంగం గుర్తించిన సర్వమత, సర్వ విశ్వాసాల సమాహారంగా నెలకొని కొనసాగుతున్న సెక్యులర్‌ వ్యవస్థ అన్న స్పృహను పక్కనపెట్టి, శతాబ్దాల తరబడిగా కలసిమెలసి ఉంటున్న సకల మతస్తుల లౌకిక జీవనానికి ఎసరుపెట్టి దేశ సమైక్యతా వ్యవస్థ నవనాడుల్ని కూల్చివేసే ధోరణిని పాలకులు అనుసరి స్తున్నారు.

వేరుగా చూడటం జన్యు లక్షణంగా మారిందా?
మధ్యాసియా నుంచి, వోల్గా నుంచి గంగా తీరం దాకా, సింధు నాగ రికత వరకూ అసలు తొడిగి కొసలు సాగిన సకల విశ్వాసాల సమా హారంగా సాగిన ఖండాల, ఉపఖండాల మానవయాత్రలు– కలివిడిగా సాగి స్థిరపడినవేనన్న మౌలిక సత్యాన్ని మరవరాదు. అయినా ఈ మానవ వలస యాత్రలలో భాగంగా అష్టకష్టాల మధ్య భారత ఉప ఖండంలో స్థిరపడినవారు–అమిత్‌షా భావిస్తున్నట్టు ఒక్క హిందు వులు, సిక్కులు, బౌద్ధులు, జైనులే కాదు, ముస్లిములూ ఉన్నారు. అసలు ‘హిందూ’ పదమే ‘సింధు’ పదం నుంచి పుట్టింది. భారత దేశంలో ప్రవేశించిన పర్షియన్లు (మధ్యాసియా వారు) ‘స’ అక్షరం పలకలేరు, కనుకనే ‘స’ను ‘హ’గా వారు ఉచ్చరించడంవల్ల క్రమంగా ‘సింధు’ నాగరికత కాస్తా ‘హిందూ’ నాగరికత అని పేరు పడిందని మహా పండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ నిగ్గుతేల్చారు.

అయినాసరే, హిందూ మహాసభ నాయకుడు డాక్టర్‌ మూంజీ ప్రభృతులు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫాసిస్టులయిన ముస్సోలినీ, హిట్లర్‌లను కలుసుకొచ్చింది లగాయతూ గోల్వాల్కర్‌ దాకా, మత ప్రాతిపదికపై దేశవిభజనకు ‘ముహూర్తం’ పెట్టేదాకా, ఆ దరిమిలా ఈ క్షణం దాకా భారతదేశంలో ఇంతకాలం అంతర్భాగమైన ముస్లింలను హిందు వులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల నుంచి వేరుగా చూడటం జరుగుతోంది, అదొక జన్యు లక్షణంగా మారింది. అందుకనే అమి త్‌షా పౌరసత్వ సవరణ చట్టాన్ని ‘మెలిపెట్టి’ కొత్త ట్విస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘దేశ విభజన తరువాత కాందిశీకులయినవారు డాక్యుమెంట్లు సాక్ష్యంగా చూపాల్సి ఉంటుందని కొందరు భయపెడు తున్నారు. అలాంటిదేమీ లేదంటూనే’ అమిత్‌షా ‘హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఎలాంటి పౌరసత్వ నిరూపణ పత్రాలు చూపనక్కరలేద’ని చెప్పారేగానీ, అదే సూత్రాన్ని బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ నుంచి వచ్చే కాందిశీకులకు వర్తింపజేయ నిరా కరిస్తున్నారు. 

సుదీర్ఘ చరిత్ర విస్తరించి ఉన్న మానవేతిహాసంలో ముస్లిములని, హిందువులనీ, సిక్కులనీ, బౌద్ధులు, జైనులనీ విడగొట్టి సామరస్య చరిత్రను మంటగలుపుతూ, సెక్యులర్‌ వ్యవస్థను కూల్చజూసే దేశ విభజన ‘సిద్ధాంతాల్ని’ ప్రజలు బహిష్కరించవలసిన సమయం వచ్చింది. ఈ ప్రతీపశక్తులవల్ల అన్ని రకాల వలస సామ్రాజ్య పాల కులు దేశ స్వాతంత్య్ర యోధులపైన, ప్రతిఘటనా శక్తులపైన డిటెన్షన్‌ చట్టాలను, ‘దేశద్రోహ’ నేర చట్టాలను నిరంకుశంగా ప్రయోగిస్తూ వచ్చారు. ఆ ‘ఎంగిలి’ చట్టాలనే ఇంతకుముందు కాంగ్రెస్‌ (ఎమర్జెన్సీ కాలం), ఇప్పుడు బీజేపీ పాలకులూ దేశ పౌరుల నోళ్లు నొక్కడానికి, సెక్యులర్‌ వ్యవస్థ సంరక్షణ కోసం వాడవాడలా ఉద్యమిస్తున్న యువ తను, ప్రజాతంత్ర శక్తుల ప్రతిఘటనను అణచడం కోసం విని యోగిస్తున్నారు. ఎటువంటి విచారణ లేకుండా విద్యాలయాలు, విశ్వ విద్యాలయాల జాగృత యువత వెన్ను విరవడానికి వలస చట్టాలనే వినియోగిస్తున్నారు. 

సామాన్యుల యుద్ధభేరీలు వీధుల్లోంచే మోగుతాయి
ఫ్రెంచి విప్లవ కాలంలో బాస్డిల్లీ దుర్గం విప్లవ ప్రజాగ్రహంతో కుప్పకూలిన సందర్భంగా ఫ్రెంచి మహామేధావిని వోల్తేర్‌ విచారణ లేకుండా నిర్బంధించినప్పుడు తన వాదనను వినిపించే అవకాశాన్ని ఆయనకు ప్రభు వర్గాలు నిరాకరించాయి. ఆ అనుభవంతో ఆయన మొత్తం ఫ్రెంచి న్యాయ వ్యవస్థనే మూలముట్టుగా సంస్కరించడానికి నడుంకట్టాడని మరవరాదు. ఎందుకంటే, దేశ పరిస్థితులు కష్టకాలం లోనే ప్రజల్ని, యువతను చైతన్యంలోకి నడిపించి ధర్మ పోరాటానికి సిద్ధపరుస్తాయి. వీధుల నుంచే సామాన్యులు యుద్ధభేరీలు మోగి స్తారు, అన్యాయాన్ని దౌర్భాగ్యపు ప్రజా వ్యతిరేక చట్టాలను బలంగా నిరసిస్తారు. ఈ మార్పు మిణుకుమిణుకుమంటూ అజ్ఞాతంలోకి జారు కుంటున్న న్యాయ వ్యవస్థను కూడా నిద్ర లేపుతుంది. ఎందుకంటే సోలన్‌ అన్నట్టు ఈ ‘చట్టాలనేవి సాలెగూడు లాంటివి. ఆ గూడులోకి ఓ బలహీనమైన ప్రాణి దూరిందంటే, అది కాస్తా ఇరుక్కుపోయి బయ టపడలేదు. కానీ అదే సాలెగూటిలోకి ఓ పెద్ద ప్రాణి దూరినా, తప్పిం చుకు రాగలదు. అలాంటిదే చట్టాల వల’! అలాగే ప్రజా వ్యతిరేక ఇనుప చట్టాల కింద నలిగిపోతున్న పేదవాళ్ల ఆగ్రహం పరిస్థితుల్ని ఇలాగే కొనసాగనిస్తే ఎలా ఉంటుందో ఓ మహాకవి కవితాపరంగా చెబుతున్నాడు: ‘ఒక మనిషిని పది పిల్లలుగా చీల్చే ఆగ్రహం/ పది పిల్లల్ని నూరు పువ్వులుగా కూర్చే ఆగ్రహం/ నూరు పువ్వుల్ని వెయ్యి కత్తులుగా మార్చే ఆగ్రహం/పేదవాళ్ల ఆగ్రహం/ రెండు అగ్ని పర్వతాల ఎదుట/ ఒక భూకంపాన్ని నిలబెడుతుంది/ వంద డొక్కల్ని ఒక రెక్కగా చేర్చే ఆగ్రహం/లక్ష చుక్కల్ని ఒక పాటగా/ పేర్చే ఆగ్రహం పేదవాళ్ల ఆగ్రహం/ రెండు పోలీసు టోపీల ఎదుట ఈ గీతాన్ని నిలబెడుతుంది’! అలా నిలబడిన గీతం లక్ష కంఠాల్ని కుదిపి కదుపుతోంది!!


ఏబీకే ప్రసాద్‌ సీనియర్‌
సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement