వ్యవస్థల ప్రక్షాళన అనివార్యం | C Ramachandraiah Article On Purge Of Systems | Sakshi
Sakshi News home page

వ్యవస్థల ప్రక్షాళన అనివార్యం

Published Thu, Apr 23 2020 12:03 AM | Last Updated on Thu, Apr 23 2020 12:03 AM

C Ramachandraiah Article On Purge Of Systems - Sakshi

పౌరుషం, రోషం, సిగ్గు, అభిమానం లాంటి భావోద్వేగాలు మనుషులకు ఉండటం సహజం. ఆత్మా భిమానం లోపించినవారే వాటిని పక్కన పెట్టగలరు. సరిగ్గా ఏడాది క్రితం ఎన్ని కల సమయంలో ముఖ్య మంత్రిగా ఉన్న చంద్ర బాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచారంటూ వీరావేశం ప్రద ర్శించారు. మోదీ ఎన్నికల సంఘాన్ని బీజేపీ బ్రాంచ్‌ ఆఫీసులా మార్చేశారని దుయ్యబట్టారు. 2019 ఏప్రిల్‌ 10న అమరావతిలో; ఏప్రిల్‌ 20న తిరుపతిలో; ఏప్రిల్‌ 23న ముంబైలో మీడియా సమావేశాలు పెట్టి  దూషించారు. ముంబై సమా వేశంలో కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌లను చెరోపక్కన కూర్చో బెట్టుకొని, మోదీ రష్యా హ్యాకర్లతో ఈవీఎంలను తనకు అనుకూలంగా ప్రోగ్రామింగ్‌ చేయించుకొన్నారని ఆరోపించారు. ఎన్డీయేతర పక్షానికి చెందిన 23 రాజకీయ పార్టీలను కూడగట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమి షన్‌పై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయమంటూ తనను ‘క్రూసేడర్‌’ అని అభివర్ణించు కొన్నారు.

సరిగ్గా ఏడాది తర్వాత కరోనా నేపథ్యంలో ప్రధాని ఫోన్‌ చేసినందుకు చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ‘ప్రధాని మోదీ ఫోన్‌’ ముచ్చ ట్లను పార్టీ నేతలతో, మీడియాతో పంచుకొంటు న్నారు. మరోపక్క తెలుగుదేశం, బీజేపీ భవిష్య త్తులో కలిసి పనిచేస్తాయన్న ప్రచారాన్ని సొంత మీడియా ద్వారా ఉధృతం చేస్తున్నారు. ప్రతి ఎన్ని కల ముందు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటే. మోదీ నియంతృత్వంపై, ఎన్నికల సంఘం అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగకపోవడమే విశేషం. 

ఎన్నికలు ముగిసిన వెంటనే, చెట్టపట్టాలేసు కొని తిరిగిన 23 ఎన్డీయేతర రాజకీయ పార్టీలకు కారణాలు చెప్పకుండానే చంద్రబాబు దూరం జరి గారు. ఏ కూటమిలోనూ చేరకుండా ‘తటస్థ’ వైఖ రితో ఉంటామంటూ తాత్కాలికంగా సోనియా అండ్‌ కోతో చేసిన స్నేహం వదులుకుంటున్నట్లు ప్రధానికి సంకేతాలు పంపించారు. తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి సాదరంగా పంపించారు. వారి విలీన ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధమని ఓ పార్టీనేతతో తంతుగా ఓ ప్రకటన ఇప్పించి, తర్వాత మౌనవ్రతం దాల్చారు. తన అక్రమాలు వెలుగు చూడకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు అవసరమని చంద్రబాబుకు తెలుసు. మరి, ప్రధానితో మాట్లాడినప్పుడు, రాష్ట్రానికి ఉదా రంగా నిధులివ్వాలనీ; తను డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రతి కుటుంబానికీ రూ. 5,000 కేంద్ర ప్రభుత్వం అందించాలనీ ఎందుకు కోరలేదు? మోదీకి ఆగ్రహం వస్తుందని భయపడ్డారా?

కరోనా నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టీ వారు చేస్తున్న విమర్శలు మీడియాలో ప్రచురణ కావడానికి తప్ప మరెందుకూ పనికిరావు. హైదరాబాద్‌లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి లేఖలు సంధిస్తున్నారు. కరోనాపై తగి నంత అధ్యయనం చేయాలని, ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఇస్తున్న ఉచిత సలహాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజమండ్రి గోదావరి ఘాట్‌లో తను, తన కుటుంబ సభ్యులు స్నానం చేస్తున్న దృశ్యా లను అంతర్జాతీయ మీడియాకి ఇవ్వడం కోసం గంటల కొద్దీ భక్తుల్ని క్యూలైన్లలో నిలిపివేసి, తర్వాత జరిగిన తొక్కిసలాటలో 31 మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు నిర్వాకాన్ని ప్రజలు మర్చిపోగలరా?

ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా ఉండాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబు నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని ప్రభుత్వా నికి సమస్యలను సృష్టించాలని చూశారు. రమేష్‌ కుమార్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. తన సన్నిహి తులను కీలక వ్యవస్థల్లోకి పంపి, భవిష్యత్తులో తనకు ఎటువంటి సమస్యలు రాకుండా ముందు చూపు ప్రదర్శించడం రాజకీయాల్లో చంద్రబాబు ఒక్కడికే చెల్లింది. ఆ క్రమంలోనే, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్ణీత గడువు ప్రకారం 2019 సాధారణ ఎన్నికల కంటే ముందుగానే నిర్వహించాల్సి ఉన్న ప్పటికీ, పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించి ఎన్నికలను జరపనీయకుండా పంచా యతీరాజ్‌ చట్టానికి తూట్లు పొడిచారు. ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన తొలిరోజు నుంచే, అక్ర మాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై ఆరోప ణలు చేయడం మొదలుపెట్టారు. చివరకు తన అమ్ములపొదిలోని ‘నిమ్మగడ్డ’ అస్త్రాన్ని ఉపయో గించి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయించారు.

నవంబర్‌ 26, 1949న రాజ్యాంగం ముసా యిదా ప్రతిని సమర్పిస్తూ అంబేడ్కర్‌ ‘‘రాజ్యాంగం ఎంత గొప్పదయినా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే అది మంచిదవుతుంది. చెడ్డవారైతే అది చెడ్డదవుతుంది’’ అన్నారు. ఇందుకు, 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలే పెద్ద ఉదాహరణలు. నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన 29 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి ఫిరా యించుకోవడం, అందులో నలుగురిని క్యాబినెట్‌ మంత్రుల్ని చేయడంతో గవర్నర్, స్పీకర్‌ వ్యవస్థల ఔన్నత్యం దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించడానికే పత్రికలను నడుపుతున్నామనే  కొందరు మీడియా సంస్థల యజమానులు చంద్ర బాబు రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తుంటే మౌనం దాల్చారు.

ఇప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికలను వాయిదా వేసేముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఉండాల్సిందన్న ప్రాథ మిక సూత్రాన్ని ఈ మీడియా బాసులు ఎందుకు చెప్పలేదు? నిమ్మగడ్డకు ఏ హక్కు ఉందని గౌరవ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉందని ఆరో పిస్తారు? అది అతని వాచాలత్వం కాదా? వైఎ స్సార్‌సీపీ ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు, ఆ పదవి కోసం ఎందుకు పాకులాడాలి? ముందే ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రభుత్వం తెచ్చిన తాజా ఆర్డినెన్స్‌తో పదవి పోగానే న్యాయ స్థానానికి ఎందుకు వెళ్లినట్లు? ఈ వ్యక్తికి ఎన్నికల కమిషన్‌ లాంటి రాజ్యాంగ వ్యవస్థను నిర్వహించే నైతిక హక్కు ఉందా?

‘ఒక దేశం యొక్క బలాన్ని నిర్ణయించేది సైనిక పాటవం ఒక్కటే కాదు. పటిష్టమైన వ్యవస్థల సముదాయమే’ అని అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ అన్నారు. అక్కడ దేశాధ్యక్షుడైనా, మరే ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా తమ బలహీనతలతో అధికారాలను పణంగా పెట్టిన ప్రతి సందర్భంలో వారిని ఆ పదవుల నుంచి దించి వేయడానికి ఆస్కారం ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తూ మన కొన్ని వ్యవస్థల్లో ‘బ్లాక్‌ షీప్‌’ తిష్టవేసి ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లాంటి వ్యక్తులను చంద్ర బాబు నమ్ముకొంటే, జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనే నమ్ముకొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు!


వ్యాసకర్త
సి. రామచంద్రయ్య 
మాజీ మంత్రి,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement