ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నది. రాబోయే ఆగస్టు 1లోగా రాష్ట్రంలోని 12,888 గ్రామ పంచాయతీలకు 1,30,870 వార్డులకు ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత సంవత్సరం నవంబరు నుంచీ సన్నాహాలు ప్రారంభించింది. 2017 నవంబరు 27–30 తేదీల మధ్య ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలను విశదీకరిస్తూ 8 సర్క్యులర్స్‌ను జారీ చేసింది. ఎన్నికల యంత్రాంగం; పోలింగ్ స్టేషన్ల నిర్ధారణ, పోలింగ్ సిబ్బంది నియామకం వంటి అంశాలపై తీసుకోవలసిన చర్యలను సూచించింది.
ఇలా ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తుంటే దానికి భిన్నంగా రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల వాయిదాకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. మే నెల 15 తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటన చెయ్యకపోగా మరి కొంత గడువు కావాలని, కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయని, గ్రామ కార్యదర్శుల కొరత వున్నదని వాయిదా కోరడం విడ్డూరంగా కనిపిస్తున్నది. కాని ఇదే ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు గొప్పగా అమలు అవుతున్నట్లు నిత్యం ప్రకటనలు చేస్తున్నది. తీరా ఎన్నికలొచ్చేసరికి చేతులెత్తేయడం వెనక ఎన్నికలు వాయిదా కుట్ర కనిపిస్తున్నది.
పంచాయతీ ఎన్నికలు జరగాలంటే వాటి రిజ ర్వేషన్లను ప్రభుత్వమే ఖరారు చేసి పంపాల్సి వుంది. దీనిమీద ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరిగిన దాఖలాలు లేవు. ఎన్నికలు జరపాల్సిన పంచాయతీల జాబితా, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల జాబితాలు ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందిస్తే తప్ప ఎన్నికలు జరిగే వీలు లేదు. అందుచేత ప్రభుత్వం తన దగ్గర వున్న యీ అవకాశాలను వినియోగించుకుని దొడ్డిదారిన ఎన్నికల వాయిదాకు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
రాజ్యాంగ ఉల్లంఘన : రాజ్యాంగంలో పంచాయతీల పదవీ కాలాన్ని అయిదేళ్లుగా స్పష్టం చేసింది. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అసాధ్యమైతే తప్ప పంచాయతీ ఎన్నికల వాయిదాకు వీలులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిలో ఎన్నికల వాయిదాను తప్పనిసరిగా చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది.
వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు కూడా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలాగా గడువు ముగిసేలోగా ఎన్నికలు జరిగితీరాలి. కాని జరగడం లేదు. పంచాయతీలు, వార్డులు, రిజర్వేషన్లు ఖరారు చేసే పనిని రాష్ట్రప్రభుత్వాలకు చేతుల్లోపెట్టారు. ఈ చిన్న సందులో దూరి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లం ఘనకు పూనుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరపడానికి ఎలాంటి అవరోధాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ దురుద్దేశంతో పంచాయతీ ఎన్నికల వాయిదా వైపు అడుగులు వేస్తున్నారు.
చంద్రబాబు పాలన ఒక వికృతమైన కేంద్రీకృత పాలన అని అందరికీ తెలుసు. ఆయన ఎన్నికైన పంచాయతీలను ఏనాడూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించిన పాపాన పోలేదు. ఆయన ఎప్పుడు పాలనలోకి వచ్చినా పంచాయతీల నెత్తిమీద జన్మభూమి కమిటీలు, లేదా నోడల్ వ్యవస్థను పెట్టి వాటి ఉనికిని నామమాత్రం చేయడం మనం చూస్తున్నదే. కొన్ని రాష్ట్రాలలో పంచాయతీలను ప్రభుత్వ పథకాలు అమలు చేసే ఏజెన్సీలుగానైనా చూస్తున్నారు. ఇక్కడ ఆ ఏజెన్సీ పాత్ర కూడా ఆయన ప్రభుత్వమే స్వీకరించి పంచాయతీల స్థానంలో నామినేట్ చేసిన కమిటీలకు అప్పజెప్పారు. చంద్రబాబు కేంద్రీకృత పాలనకి ఎన్నికైన పంచాయితీలు సరిపడవు. అవి వుంటే వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చడం లేదా వీలుంటే వాటికి ఎన్నికలు లేకుండా చెయ్యడం అన్నది ఆయన వైఖరిగా కనిపిస్తున్నది.
ఇది అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం. ఎన్నికైన పంచాయతీలు లేకుండా వుంటే ప్రత్యేక అధికారుల పేరుతో, కొత్త జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో పార్టీ పాలన సాగించడానికి అవకాశం కలుగుతుంది. దీనిని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులలోనూ జారవిడుచుకోరు. పైగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరిగితే ఎటుపోయి ఎటువస్తుందోనన్న భయం కూడా ఆయనలో కనిపిస్తుంది. దీనికి తోడు గ్రామస్థాయి వరకు సంస్థాగత నిర్మాణం వున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పంచా యతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్ష పార్టీలకు కూడా పోటీ చేసే అభ్యర్థుల రూపంలో సంస్థాగత నిర్మాణం జరిగే అవకాశం వుంది. రాబోయే ఎన్నికలలో ప్రత్యర్థులకు అది వరప్రసాదం అవుతుంది. అందుచేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏ మాత్రం కనిపిం చడం లేదు.
పంచాయితీ ఎన్నికల మీద ప్రతిపక్షాలలో కూడా తగినంత కదలిక కనిపించడం లేదు. వికృతమైన చంద్రబాబు నాయుడు కేంద్రీకృత పాలనను ఎండగట్టాలి. పంచాయతీ వ్యవస్థను భ్రష్టుపట్టించిన తీరును బట్టబయలు చెయ్యాలి. ఎన్నికల వాయిదా జరిగితే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టి రాజ కీయంగా ఏకాకిని చెయ్యాలి. రాజ్యాంగబద్ధంగా పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరపడానికి అందరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
-డి.వి.వి.యస్. వర్మ
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 98660 74023
Comments
Please login to add a commentAdd a comment