చంద్రులిద్దరూ దొందూ దొందే | Devulapalli Amar Guest Column On Telugu States Cms | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 2 2019 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Devulapalli Amar Guest Column On Telugu States Cms - Sakshi

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్‌రావు , చంద్రబాబునాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. చంద్రశేఖర్‌రావు అయినా చంద్రబాబునాయుడు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్‌వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్రబాబువి. ఈయన ఫెడరల్‌  ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమిని బలోపేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆ రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం సం బంధంలేని ఒక రాజకీయ యుద్ధం జోరుగా సాగుతున్నది. ఇటీవలే ముగిసిన తెలంగాణ  శాసన సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ యుద్ధం మరింత తీవ్రం అయింది. ఈ రెండు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాన్ని  రెండు జాతీయ రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల మీద ఈ రెండు ప్రాంతీయ పార్టీల అధినేతల రాజకీయ యుద్ధం ప్రభావం ఆ రెండు జాతీయ పార్టీల జయాపజయాల మీద కొద్దో గొప్పో ఉండకపోదు కాబట్టే వాటికి ఈ ఆసక్తి. 

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్‌రావు , చంద్రబాబు నాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. తెలంగాణ  సాధన కోసం పద్నాలుగేళ్ళు సాగిన మలి విడత ఉద్యమ కాలంలో కానీ, తత్ఫలితంగా సాకారం అయిన తెలంగాణా రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏళ్ళు పరిపాలన సాగించిన కాలంలో కానీ చంద్రశేఖర్‌ రావు ఆ విషయాన్ని అనేక మార్లు రుజువు చేసుకున్నారు. మళ్ళీ మంచి ఆధిక్యతతో ప్రజలు అధికారం కట్టబెట్టి రెండవసారి ముఖ్యమంత్రిని చేశాక అయినా ఆయన కొంచెం మారుతారేమో, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారేమో అనుకున్న వారికి ఆశాభంగమే అయింది. ఈ పదవీ కాలంలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతున్నదో ఈ మూడు వారాల కాలంలో తెలంగాణ  ప్రజలకు రుచి చూపించారు. 

డిసెంబర్‌ 11 న ఎన్నికల ఫలితాలు వెలువడితే ఇవాళ జనవరి రెండవ తేదీ వరకు అంటే 21 రోజులయినా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఆయన దృష్టిలో మంత్రివర్గం ఉన్నా లేకున్నా ఒకటే. అవును మంత్రివర్గం ఉన్ననాడు కూడా నిర్ణయాలన్నీ ఆయనే చేసినప్పుడు ఇంకా మంత్రివర్గంతో పని ఏముంటుంది? తన పార్టీ తరఫున గెలిచిన 88 మంది శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉన్నా ఇద్దరు స్వతంత్ర ఎంఎల్‌ఏలను రెండో రోజే కండువా కప్పి పార్టీలో కలిపేసుకున్నారు. తన కుమారుడికి పార్టీ కార్యాధ్యక్ష పదవి కట్టబెట్టి రానున్న రోజుల్లో ఆయనే ముఖ్య మంత్రి, అన్ని అధికారాలూ ఆయనవే అన్న సంకేతాలు బలంగా పంపించారు. అధికార కేంద్రం ఇప్పుడు తెలంగాణ భవన్‌లో కేటీ రామారావు చాంబర్‌కు బదిలీ అయిపోయింది.

మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళంతా ఆయన ఆఫీస్‌ ముందు క్యూ కడుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటివి సహజమే కాబట్టి అవి పార్టీ లో ప్రజాస్వామ్యయుతంగా అత్యధికుల ఆమోదంతో జరిగాయా లేదా అన్నది ఎవరూ పట్టించుకోరు. దేశమంతటా ప్రాంతీయ పార్టీలలో ఏక వ్యక్తి అధికారం చెలాయించిన చోటల్లా ఇదే పరిస్థితి ఉంటుంది. దాన్నే కేసీఆర్‌ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అంతేకానీ అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఎందుకు అనుకుంటారు.  రాష్ట్రంలో మంత్రివర్గం ఉండదు. శాసన సభ్యులతో∙ఒక పూట అసెంబ్లీని సమావేశ పరిచి ప్రమాణం అయినా చేయిద్దామనే ఆలోచన ఉండదు. 

స్వతంత్ర ఎంఎల్‌ఏలతోబాటు, శాసన మండ లిలో కాంగ్రెస్‌ పక్షాన్ని నిర్వీర్యం చేస్తూ ఆ పార్టీ సభ్యులను కలుపుకుని వారికి చట్టబద్ధత కల్పిస్తారు. కానీ తమను విభేదించి బయటికివెళ్ళిన మండలి సభ్యుల మీద మాత్రం 24 గంటల్లో వేటు వేయిస్తారు. అదే శాసన మండలిలో కాంగ్రెస్‌ నుండి తన పార్టీలోకి కొంతకాలం క్రితం ఫిరాయించిన వారి మీద వేటు ఉండదు. ఇంకాపదిమంది దాకా కాంగ్రెస్‌ సభ్యులకు కండువాలు కప్పబోతున్నామని ఆయన నోటనే విన్నాం. వాళ్ళు వొస్తానంటే నేనువొద్దని ఎలా అనాలి అని ఆయనే స్వయంగా విలేకరులకు చెప్పారు. వంద స్థానాలు గెలుస్తామని  ఎన్నికల ముందు చెప్పిన మాటను ఈ విధంగా నిజం చెయ్యాలన్నది తండ్రీకొడుకుల పట్టుదల అని అర్థం అవుతూనే ఉంది.

ఒక పార్టీ పేరు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళుతున్న వాళ్ళు సిగ్గుపడనప్పుడు చేర్చుకునే వాళ్ళెందుకు సిగ్గు పడాలి? అని కదా ఇవాళ దేశమంతటా రాజకీయ పార్టీలు చెపుతున్నది. అదే కేసీఆర్‌ కూడా పాటిస్తున్నారు. ప్రతిపక్షం నుండి 23 మంది శాసన సభ్యులను  కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్ర బాబు మొన్నటికి మొన్న తెలంగాణా ప్రచారంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో టీఆర్‌ఎస్‌ మీద విరుచుకుపడిన విడ్డూ రంచూసాం కదా. నాలుగైదు మాసాల్లో జరగనున్న లోక్‌సభ  ఎన్నికల దాకా తెలంగాణాలో ఇదే పరి స్థితి కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. 

ముఖ్య మంత్రే చెప్పారు. తన పరిపాలనా పద్ధ తికి ప్రజలు ఆమోదం తెలిపారనడానికి నిదర్శనమే మొన్నటి ఫలితాలు అని. సచివాలయానికి వెళ్ళవలసిన పని లేదని ప్రజలే అంగీకరించారు కదా అని చెప్పేశారు ఆయన. ఆయనను ఎదిరించే సాహసం ఆ పార్టీలో ఎవరూ చెయ్యలేరు. మంత్రివర్గం లేకుండా ప్రగతి భవన్‌ దర్బార్‌లో ఆయన నిర్వహిస్తున్న సమీక్షల తీరు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకే నోరు లేనప్పుడు అధికారులు మాత్రం ఏం మాట్లాడుతారు? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి పారుదల ప్రాజెక్ట్‌ల పురో గతి సమీక్షలో నాలుగున్నర సంవత్సరాలు నిద్రాహారాలు మాని ప్రాజెక్ట్‌ సైట్‌ల దగ్గర గడిపిన అప్పటి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు ఉండడు,వాటితో ఏ సంబంధం లేని ఇతర ప్రజాప్రతినిధులు ఉంటారు.

ఎన్నికల ప్రచార సభల్లో ఇరిగేషన్‌ మంత్రిగా హరీశ్‌ చేసిన కృషిని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్‌కు మళ్ళీ గెలిచాక సమీక్షల్లో ఆయన కూడా ఉండాలని అనిపించదు, పైగా పనిలో జాప్యం జరుగుతున్నదని అధికారులను మందలించడం దేనికి సంకేతం?హరీశ్‌ రావును వేనోళ్ళ పొగిడిన నోటనే ఆయన అధ్వర్యంలో  పనిసరిగా జరగలేదని చెప్పడమా! ప్రాజెక్ట్‌ల సందర్శనకు కూడా బయలుదేరారు ఆయన. తన కుమారుడి ప్రాముఖ్యత పెంచే క్రమంలో హరీష్‌ సమర్ధతను తగ్గించి చూపే ప్రయ త్నం కావొచ్చు, అది వారి రాజకీయ విజ్ఞతకే వొదిలేద్దాం. కానీ ఈ వ్యవహారం అంతా అప్రజాస్వామికంగా ఉంది అని చెప్పేదెవరు ఆయనకు. మాట్లాడితే మీడియా మీద విరుచుకు పడుతున్నారాయే.

మొన్నటి పత్రికా గోష్టిలో ఆయన ఇంకోమాట కూడా చెప్పారు. దాన్నిబట్టి రేపటి నుండి పత్రికల్లో,టీవీ లలో ఎటువంటి వార్తలు రాయాలో,చూపాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు.  ప్రముఖ విద్యావేత్త, మేథావి చుక్కా రామయ్య చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి అయిన మౌన సంస్కృతి  రాజ్యం ఏలుతున్న కారణంగానే పాలకులు ఇట్లా వ్యవహరించగలుగుతున్నారు. కేసీఆర్‌ అయినా చంద్రబాబు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కూడా గడ్డు కాలం నడుస్తున్నది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు వెయ్యి కోట్లకు పైగా పేరుకు పోయాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులు వైద్యం ఎందుకు చెయ్యడం లేదు ఆరోగ్యశ్రీ ప«థకం కింద? సామాన్యుడి అవసరాలు తీరనప్పుడు పాలకులు చెప్పే వృద్ధిరేటుల ఊసెవరికి కావాలి? రాష్ట్రం మీద నుండి దృష్టి మళ్ళించడానికే ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌ పర్యటనలు అని అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆయనకు ఏనాడయినా కాంగ్రెస్‌తోనే సమస్య. అందుకే ఆయన కాంగ్రెస్‌ ఉండే ఫ్రంట్‌ను వ్యతిరేకిస్తారు.

బీజేపీని కూడా విమర్శిస్తున్నాం, ఆ పార్టీ ఉండే ఫ్రంట్‌లో కూడా చేరబోము అన్న మాటలు ఇప్పటి వరకే. లోక్‌సభ ఎన్నికల తరువాత అది బహిరంగ రహస్యమే అవుతుంది. అప్పటి రాజకీయ అవసరాలు అని సమర్థించుకోవొచ్చు. 2009లో ఎన్నికల ఫలి తాలు వెలువడక ముందే లుధియానా వెళ్లి అడ్వాణీ ప్రచార సభ వేదిక ఎక్కి కూర్చున్నది కేసీఆరే కదా.

ఇక తెలంగాణ  ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆ రాష్ట్రాన్ని భయంకరమయిన అప్పుల్లో ముంచేసి అస్తవ్యస్తం చేసిన పరిస్థితి నుండి జనం దృష్టి మళ్ళించడానికి, రోజురోజుకూ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి,ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయ కుడు జగన్‌మోహన్‌ రెడ్డికి  కోట్లాది మందిలో పెరిగిపోతున్న అభిమానం నుండి దృష్టి మళ్ళించడానికి మార్గం కావాలి. కేంద్ర ప్రభుత్వ అధినేత మోదీ, కేసీఆర్‌ను జగన్‌కు జత కట్టేసి లబ్ధి పొందాలన్న దుగ్ధ ఆయనది. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేస్తానని బయలుదేరిన చంద్రబాబు రెండు ప్రయోజనాలు ఆశించారు.

ఒకటి ముందే చెప్పుకున్నట్టు రాష్ట్ర సమస్యల నుండి, తన అస్తవ్యస్త, అవినీతిమయ పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడం, రెండవది బీజేపీ నుండి తన మీదకు దూసుకు వొచ్చి  పడుతుందని ఊహిస్తున్న ప్రమాదాల నుండి రక్షణ పొందడం. అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్‌ కలయిక అనే కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఒకే అసత్యాన్ని పదేపదే చెపితే జనం నమ్మేస్తారు అన్న గోబెల్‌ పక్కా  వారసుడు ఆయన. ఆ అసత్యాన్ని అంతే స్థాయిలో అన్నిసార్లూ ప్రచారం చెయ్యడానికి ఆయన చేతిలో మీడియా ఉండనే ఉంది. 

కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్‌వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్ర బాబువి. ఈయన ఫెడరల్‌  ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమిని బలో పేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే కేసీఆర్‌కు, బీజేపీ కూటమి అధికారంలోకి వొస్తే చంద్రబాబుకు రాజకీయంగానే కాదు. ఇతరత్రా కూడా ఇబ్బందులు తప్పవు. అదీ జాతీయ రాజకీయాలపై వారు చూపు తున్న మక్కువకు అసలు కారణం.ఆ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ ఇద్దరు ప్రాంతీయ నాయకులను అందుకే అంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయిదు మాసాలాగితే లోక్‌సభ ఫలితాలు వెలువడిన 24గంటల్లో దూద్‌  కా దూద్‌ పానీ కా పానీ, అసలు రంగులన్నీ బయట పడతాయి.


వ్యాసకర్త: దేవులపల్లి అమర్‌, datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement