తాపం తగ్గించకుంటే శాపమే! | Everyone Need To Care About Climate Change | Sakshi
Sakshi News home page

తాపం తగ్గించకుంటే శాపమే!

Published Fri, May 18 2018 2:05 AM | Last Updated on Fri, May 18 2018 9:51 AM

Everyone Need To Care About Climate Change - Sakshi

సమకాలీనం 

కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషులవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహిత్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరాకరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి.

పిడుగుపాటుకు మను షులు చనిపోతారని విన్నాం కానీ, ఇంత మందా? ఒకేరోజు 13 మంది! ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో 62 మంది పిడుగుపాటుకు గురై చనిపోగా, ఉత్తర కోస్తాలోనే 37 మంది మరణిం చారు. పొరుగున ఉన్న ఒడిశాలో కిందటేడు 36 గంటల వ్యవధిలో 34 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఏపీలో పదమూడు గంటల వ్యవధిలో 36,749 పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. (కొన్ని భూమివైపొచ్చి పిడుగులయ్యాయి, మరికొన్ని మేఘాల మధ్యే మెరుపులుగా ముగిసాయి). ఇదంతా ఏమిటి? అంటే, నిపుణులు కూడా ‘ఏమో...! ఇదైతే అసాధారణమే!!’ అంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు భూతాపం పెరగటం వల్ల వచ్చిన ‘వాతావరణ మార్పుల (క్లైమెట్‌ చేంజ్‌) కారణంగానే’ అంటే... చాలా మంది నమ్మట్లేదు. ‘ఆ.. మీరు అన్నిటికీ వాతావరణ మార్పు కారణం అంటారులే’ అన్నట్టు ఓ అపనమ్మకపు చూపు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పెచ్చు మీరిన వడదెబ్బ చావులయినా, అకాలవర్షాలు–వరదలతో ముప్పైనా, ఇప్పుడీ పిడుగుపాటు మరణాలయినా, ఉత్తరాదిని హడలెత్తిస్తున్న ఇసుక తుపాన్లు–వేడిగాలి దుమార మైనా..... అంత తీవ్రత చూపడానికి వాతావరణ మార్పే కారణం అని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తు న్నారు. పారిస్‌ సదస్సులో ప్రపంచ దేశాలు ఆందో ళన చెందినట్టు, భూతాపోన్నతి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని అందరూ అంగీ కరించినా, ఇంత త్వరగా ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరూ అనుకోలేదు.

అందుకే, చాలామంది దాన్నంత తీవ్రంగా పరిగణించలేదు. భవిష్యత్‌ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయనే ధ్యాస కూడా లేదు. రాబోయే పెనుప్రమాదాలకి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ స్పష్టమైన సంకేతాలే! ‘వాతావరణ మార్పు’ అన్నది కేవలం పర్యావరణానికే పరిమిత మైన అంశం కాదు. అనేకాంశాల సంకలనం! మార్పు లకు వేర్వేరు కారకాలున్నట్టే, ప్రభావం వల్ల పుట్టే విపరిణామాలకూ వైవిధ్యపు పార్శా్వలున్నాయి. ప్రభుత్వ విధానాలు, మనుషుల సంస్కృతి, ఆహా రపు అలవాట్లు, జీవనశైలి, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, ఎల్లలెరుగని స్వార్థం–సౌఖ్యం... ఇవన్నీ కారకాలు– ప్రభావితాలు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కొంతయితే, మానవ తప్పిదాలు పెచ్చుమీరి ప్రమా దస్థాయిని ఎన్నోరెట్లు పెంచుతున్నాయి. వాటిని నియంత్రించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. స్వచ్ఛంద సంస్థలకు తగు చొరవ–ప్రాతినిధ్యం కరువైంది. పౌరులు పూనికవహించడం లేదు. వెరసి సమస్య జటిలమౌతోంది. తీవ్రత గుర్తించి అప్రమత్త మయ్యేలోపే పరిస్థితులు చేయి దాటుతున్నాయి.

తెలివితో ఉంటే మంచిది
వాతావరణ మార్పు, మెళ్లో పెద్ద బోర్డు తగిలించు కొని వచ్చే భౌతికాకారం కాదు. ఈ రోజు (గురు వారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షాన్నే తీసు కోండి. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్మలాకాశం, నగరమంతా చిట్టుమని కాసిన ఎండ. అరగంటలోనే ఏమైందో అన్నట్టు ఉరుకులు పరుగులతో కమ్ము కొచ్చిన మబ్బులు. ఆకాశమంతా నల్ల టార్పాలిన్‌ కప్పేసినట్టు, నిమిషాల్లో కుండపోతగా వర్షం. రోడ్లన్నీ జలమయం! ఇదీ క్యుములోనింబస్‌ మేఘాల దెబ్బ. ‘సాధారణాన్ని మించిన ఉష్ణోగ్ర తలు నమోదయినపుడు ఇది జరుగుతూ ఉంటుం ద’ని నిపుణులు చెబుతున్నారు. వాటి రాకను, ఆ మేఘాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని, సగటును అంచనా వేయడం కూడా కష్టం. ఇవే మెరుపులు, ఉరుములు తద్వారా పిడుగుల్ని కురిపిస్తాయి. భూతా పోన్నతి ప్రత్యక్ష ప్రభావమే ఈ పిడుగుపాట్లు! మన దేశంలో పిడుగుపాటు మరణాల పరిస్థితి దారుణం. జాతీయ నేర నమోదు బృందం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత దశాబ్ది, ఏటా సగటున 2000 మంది పిడుగుపాటుతో మరణించారు.

తుపాన్లు, వరదలు, వడదెబ్బ, భూకంపాలు... ఇలా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యపు మరణాలతో పోల్చినా పిడుగుపాటు మరణాలే ఎక్కువ. గత మూడేళ్లతో పోల్చి చూసినా ఈ సంవత్సరం పరిస్థితి అసాధారణంగా ఉందని వాతావరణ అధికారులే చెబుతున్నారు. ఏ అభివృద్ధి చెందిన సమాజంలో నైనా ఈ మరణాల రేటు తగ్గుతుందే కాని పెరగదు. అమెరికాలో, పిడుగుపాటు మరణాల్ని కచ్చితంగా లెక్కించడం మొదలైన ఈ 75 ఏళ్లలో అతి తక్కువ మరణాలు, కేవలం 16 గత సంవత్సరం నమోద య్యాయి. 2013లో నమోదయిన 23 మరణాల సంఖ్య మీద ఇది రికార్డు! ప్రతి పది లక్షల మంది జనాభాకు పిడుగుపాటు మృతుల నిష్పత్తి అమె రికాలో సగటున 0.3 అయితే, ఐరో పాలో 0.2 గా నమోదవుతోంది. భారత్‌లో ఇది 2గాను, జింబా బ్వేలో 20 గాను, మాలవిలో 84 గాను ఉంది. పిడుగుపాటు మరణాలు అమెరికాలో తగ్గటానికి కారణాలేమిటి? అని ఓ అధ్యయనం జరిగింది. ప్రజల్లో అవగాహన పెరగటం, పిడుగు నిరోధక నిర్మాణాలు, సకాలంలో వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మనుషుల సంఖ్య తగ్గడం ప్రధాన కారణాలుగా తేలింది. ఆ తెలివిడి మనకూ ఉండాలి. వేడి తగ్గించుకుంటే, చెట్లు సమృ ద్ధిగా ఉంటే పిడుగులు మనుషుల జోలికీ, ఏ ఇతర జీవుల జోలికీ రావు.

ఒత్తిడి పెంచుతున్నాం!
భూపర్యావరణంలో ఉష్ణోగ్రత అసాధారణమైనపుడు మేఘాలపై ఒత్తిడి పెరిగి పైకి, పైపైకి అతి శీతలంవైపు వడివడిగా సాగుతాయి. ఫలితంగా మేఘాల్లో అంతర్గతంగా ఆ తాడనంలో పుట్టే మెరుపు నిజానికొక విద్యుత్‌ విడుదల! అత్యధిక సందర్భాల్లో ఇది మేఘాల మధ్యే జరిగి మనకొక మెరుపులా కన బడుతుందంతే! కానీ, తీవ్రంగా ఉన్నపుడు అట్టడు గున ఉండే మేఘ వరుసవైపునకు వస్తూ రుణావేశం (నెగెటివ్‌ చార్జ్‌)గా పనిచేస్తుంది. వర్షపు మేఘం– భూమి మధ్య అసమతౌల్యతను సవరించే క్రమంలో ఈ రుణావేశం, కిందికి పయనించి... భూమిపైని ధనావేశం (పాజిటివ్‌ చార్జ్‌)తో కరెంట్‌గా కలిసి పిడు గవుతుంది. ఇది సాధారణంగా మనిషిని యాంటెన్నా చేసుకోదు.

భూమ్మీద టవర్లనో, ఎల్తైన నిర్మాణాలనో, చెట్లనో, కడకు భూమినో వాహకంగా ఎంచుకుం టుంది. అందుకే చెట్ల కింద, రక్షణ లేని టవర్ల వద్ద, ఇంటి బాల్కనీల్లో, ఆరు బయట నిలబడొద్దంటారు. పరంపరగా మెరుపులొస్తున్నపుడు సెల్‌ఫోన్, ల్యాండ్‌ ఫోన్‌ మాట్లాడొద్దంటారు. భూమితో ‘ఎర్తింగ్‌’ అయ్యేలా ఉండొద్దంటారు. మేఘాల్లో పుట్టే ఈ నెగెటివ్‌ చార్‌ఎ్జ సగటున గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తుంటుంది. గాలి బలహీన వాహకం అవడం వల్ల మెరుపు పుట్టినపుడు ఉద్భవించే ఉష్ణం ఆ గాలిని అత్యంత వేగంగా వ్యాపింప/కంపింప చేయడం వల్లే ఆకాశంలో పెద్ద శబ్దాలతో ఉరుములు పుడతాయి. ఈ మెరుపు ఓ బలహీన వాహకం (గాలి)లో పుట్టించే ఉష్ణం (53,540 డిగ్రీల ఫారెన్‌హైట్‌) సూర్యుని ఉపరితల ఉష్ణం(10,340 డిగ్రీల ఫారెన్‌హైట్‌) కన్నా అయిదు రెట్లు అధికం! అందుకే, ఈ కరెంటు ఒక చెట్టులోకి వ్యాపించినపుడు పుట్టే ఉష్ణం ఆ చెట్టులో ఉండే మొత్తం తేమను లాగి మోడు చేస్తుంది. పిడుగు స్థాయిని బట్టి కొన్నిసార్లు బతికి, మనుషులు ఏదో రకమైన వైకల్యానికి గురవుతారు. ఇక మన తెలుగు భూభాగంపై ఈసారి పిడుగుల తాకిడి పెరగటానికి ఓ కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే శీతల మేఘాలు, ఉత్తర భారతం నుంచి వేడిగాలులు కలవడంతో కరెంట్‌ వల్ల 124 మైళ్ల మేర మేఘాచ్ఛాదనం ఏర్పడిందని, అదే ఇందుకు కారణమై ఉండవచ్చని ఓ అభి ప్రాయం.

నియంత్రిస్తేనే మనుగడ
తెలిసి తెలిసీ... మనం మన దైనందిన చర్యల ద్వారా భూతాపోన్నతికి కారణమౌతున్నాం. పారిస్‌ ఒప్పం దంలో భాగంగా పెద్ద హామీలిచ్చి వచ్చాక కూడా మన ప్రభుత్వ విధానాలు మారలేదు. వివిధ సంస్థల నిర్వాకాలు, కార్పొరేట్ల కార్యకలాపాలు, వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలి... దేనిలోనూ మార్పు రాలేదు. శిలాజ ఇంధన వినియోగం తగ్గలేదు. జలరవాణా ఊసే లేదు! ఆశించిన స్థాయిలో థర్మల్‌ విద్యుదు త్పత్తి తగ్గలేదు. పైగా భూగర్భ గనుల కన్నా ఉప రితల గని తవ్వకాల్నే ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. బొగ్గుతో విద్యుదుత్పత్తిలో ‘సూపర్‌ క్రిటికల్‌’ వంటి ఆధునిక సాంకేతికతకు మారకుండా, పాత ‘సబ్‌–క్రిటికల్‌’ పద్ధతిలోనే సాగి స్తున్నాం. కార్బన్‌డయాక్సైడ్‌ను విరివిగా విడుదల చేయడమే కాక జలాన్ని విస్తారంగా దుర్వినియో గపరుస్తున్నాం. సౌర–పవన విద్యుత్తు వాటా పెద్దగా పెరగలే! ఇకపై ప్రతి కొత్త వాహనం విద్యుత్‌ బ్యాటరీతో నడిచేదే రావాలన్న మాట గాలికి పోయింది. అడవుల విస్తీర్ణ శాతం పెంచాలన్నది ఉట్టి మాటయింది. పైగా, 1988 జాతీయ అటవీ విధా నానికి తూట్లు పొడుస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తాజా ముసాయిదా ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వారి ముందుంది. దీన్ని నిశి తంగా ఖండిస్తూ ప్రజలు, పౌరసంఘాలు చేతన పొంది కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తెస్తాయో చూడాలి!

చేయీ చేయీ కలిపితేనే....
కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషు లవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహి త్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరా కరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. ఉన్నొక్క సజీవ గ్రహాన్ని కాపాడుకుందాం!


దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement