చంద్రబాబు నాయుడు
సందర్భం
పార్టీ ఆధారిత పార్లమెం టరీ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియే అస్తవ్యస్తంగా మారిన ఈ తరుణంలోనూ కొన్ని పరిణామాలు ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అనిపిస్తాయి. నరేంద్ర మోదీ, చంద్రబాబులను అభివృద్ధికి ప్రతీకగా మీడియా పేర్కొంటూ ఉంటుంది. నిజా నికి వారు కొందరి పెరుగుదలకు మాత్రమే ప్రతీ కలు. బాబు మార్కు ‘పెరుగుదల’ ఆర్థిక విధానాలను ప్రజలు ప్రతిసారీ తిప్పికొడుతూనే ఉన్నారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ కె. విజయరామారావు 1999 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైబాబు ప్రభుత్వంలో కీలకమైన పట్టణాభివృద్ధి శాఖను చేపట్టారు. ఆయన కాలంలోనే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం పేరిట చంద్రబాబు మార్కు ‘సంపద పెరుగుదల’ పెద్ద ఎత్తున సాగింది. ఇది ప్రజలకు నచ్చలేదు.
2004 ఎన్నికల్లో విజయరామారావును ఓడించడమేగాక, గ్రేటర్ హైదరాబాద్ లోని 16 నియోజకవర్గాల్లో 13 చోట్ల టీడీపీని ఓడించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధునిక హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని చెప్పుకుంటే 150 డివిజన్లలో ఒకే ఒక్క చోట టీడీపీ గట్టెక్కింది.తాను అభివృధ్ధి ప్రవక్త అని చెప్పుకున్నప్పుడల్లా ప్రజలు బాబుకు గట్టి గుణపాఠమే చెపుతూ వచ్చారు. అయినా ఆయన తన విధానాలను మార్చుకోలేదు. అమరావతి, పోలవరం భారీ ప్రాజెక్టుల్ని చూపి సంపద పెంచినట్టు భారీ ప్రచారం చేసుకుంటే సులువుగా గెలవవచ్చని వారు ఆశపడ్డారు. అమరావతి, పోలవరం వల్ల రాష్ట్రంలో ప్రాబల్యంగల రెండు మూడు సామాజికవర్గాల సంపద మాత్రమే పెరుగుతుందని తెలియనంత అమాయకులు కాదు ప్రజలు. అమరావతి మంత్రి నారాయణనే కాక నెల్లూరులో టీడీపీ అభ్యర్థులు అందరినీ ప్రజలు ఓడించారు. దీనినే ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అంటారు.
అమరావతి, పోలవరం (పట్టిసీమ)ల వల్ల భారీగా సంపద పెరిగిన ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన కొన్ని గ్రామాల్లో అధికార పార్టీకి కొన్ని ఓట్లు పడివుండవచ్చు గానీ ఆ రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 33 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది నాలుగే స్థానాలు. ప్రజలు పోలవరం మంత్రి దేవినేని ఉమను మైలవరంలో మట్టికరిపించారు. ఇది మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్.తాను సమాచార విప్లవ సారధినని బాబు చాలాసార్లు చెప్పుకునేవారు. అయితే, హైదరాబాద్‌లో వారికి కాలం కలిసివచ్చినట్టు విజయవాడలో కలిసిరాలేదు. చేనేత కేంద్రమైన మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ సిలికాన్ వ్యాలీగా మార్చినట్టు టీడీపీ ప్రచారం చేసుకుంది. ఆ నమ్మకంతోనే సీఎం తనయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ను మంగళగిరి బరిలో దించారు.
ప్రజలు లోకేశ్‌నూ ఓడించి మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్ చేశారు. అభివృద్ధి అంటే పోలవరం, అమరావతి, ఐటీ ప్రాజెక్టులే కాదని ప్రజలు గట్టిగా చెప్పారు. జగన్‌కు వాళ్ళ నాన్న పెద్ద ప్లస్ పాయింట్ అయితే, బాబుకు వాళ్ళబ్బాయి పెద్ద మైనస్ పాయింట్.దెందులూరులో చింతమనేని ప్రభాకర్, విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమామహేశ్వరరావు సాగించిన అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. రాష్ట్రమంతటా గనుల మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ఇందులో మహిళల వస్త్రాపహరణాలు, అత్యాచారాలు, హత్యాచారాలు అన్నీ ఉన్నాయి. టీడీపీ అధినేత వాళ్ళను అదుపు చేయకపోగా అడ్డంగా వెనకేసుకు వచ్చారు. కొత్త రాష్ట్ర శాసన సభకు తొలి స్పీకర్‌గా ఎన్నికైన కోడెల శివప్రసాద్ 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో గొడ్లలా అధికారపార్టీ కొనేసినా కళ్ళు మూసుకున్నారు.
ప్రతి పక్షం సభకు రాలేని పరిస్థితిని కల్పించారు. సభా గౌరవాన్ని పాతాళానికి తొక్కేశారు. సత్తెనపల్లి ప్రజలు ఆయనకు రాజకీయాల నుంచి అవమానకరపు వీడ్కోలు పలికారు. విచిత్రం ఏమంటే, 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను రేటుకట్టి కొన్న టీడీపీకి మే 23 నాటి ఎన్నికల ఫలితాల్లో దక్కింది 23 ఎమ్మెల్యేలే! దీన్ని ఒక మేజికల్ జస్టిఫికేషన్ అనుకోవచ్చు!. కార్పొరేట్లకు ప్రభుత్వాధినేతలు మొహమాటంతో కొన్ని పనులు చేసిపెట్టాల్సి ఉంటుందనేది నిజమే గానీ, నిత్యం కార్పొరేట్ల సేవలోనే తరించే ప్రభుత్వాధినేతలకు ప్రజలు గట్టిగానే బుధ్ధి చెపుతారన్నది అంతకన్నా నిజం. తమ రాజకీయ ఆబ్లిగేషన్లను పాటిస్తూనే ప్రజల కోసం తపన పడే ప్రభుత్వాధినేతలు సహితం కొందరు ఉన్నారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ ఆ కోవలోకి వస్తారు. ప్రజలు కూడా వాళ్ళనే తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. అసలు విషయం ఏమంటే, ఏపీ ప్రజలు ఈసారి బాబును ఎన్టీఆర్‌కు రాజకీయ వారసునిగా చూడడానికి ఇష్టపడలేదు. జగన్‌ను వైఎస్సార్‌కు రాజకీయ వారసునిగా గుర్తించి పట్టంకట్టారు. ఇది అసలైన ఎలక్టోరల్ జస్టిఫికేషన్! జగన్ ఒకే విధానానికి కట్టుబడి, నిరంతరం జనంలో వుండి వాళ్ళ ఆదరణను పొందారు. చంద్రబాబు ప్రతి అంశం మీదా మాట మార్చి విశ్వసనీయతను కోల్పోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొత్తతరం, కొత్త చూపు, కొత్త ఆశలు, కొత్త సాకారం !
డానీ
రచయిత సీనియర్ పాత్రికేయులు,
సమాజ విశ్లేషకులు ‘ 90107 57776
Comments
Please login to add a commentAdd a comment