నిరర్థక విన్యాసాలు | Once again Chandrababu plays political stunt | Sakshi
Sakshi News home page

నిరర్థక విన్యాసాలు

Published Sun, Feb 18 2018 12:36 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Once again Chandrababu plays political stunt - Sakshi

త్రికాలమ్‌
మితభాషి మౌనంగా ఉండటంలో వింత లేదు. ప్రతి సందర్భంలోనూ గంటకు తక్కువ కాకుండా మీడియా గోష్ఠిలో మాట్లాడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండువారాలకు పైగా మాట్లాడకుండా లీకులతోనే వార్తలలో అగ్రగణ్యుడిగా ఉండటం విశేషం. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులూ, అన్ని రాష్ట్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌కే అధికంగా కేంద్ర నిధులు అందాయంటూ బీజేపీ నాయకులూ వాదులాడుకున్నారు. చంద్రబాబునాయుడు మాత్రం పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి మీడియాకు దూరంగా ఉంటూ ఆయన కేంద్రంపైన నిప్పులు కురిపించినట్టూ, ఆగ్రహం వెలిబుచ్చినట్టూ, తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైనట్టూ వార్తలు పుంఖానుపుంఖంగా పత్రికలలోనూ, టీవీ చానళ్ళలోనూ వచ్చేట్టు చేశారు. మేఘనాథుడు, ఘటోత్కచుడు మేఘాల మాటున కదలాడుతూ నేలపైన ఉన్న శత్రువులతో యుద్ధం చేసినట్టు మీడియా మాటున చంద్రబాబునాయుడు అత్యంత లాఘవంగా పోరాటం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంటులో సమర్పించి రెండువారాలు దాటిన తర్వాత శనివారంనాడు ఒక ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బిత్తరపోయి చూస్తున్న విద్యార్థుల ఎదుట గంభీరమైన రాజకీయోపన్యాసం చేశారు. ఆవేశంగా ప్రసంగించారు కానీ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సందేశం ఏదీ అందించలేదు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని అనలేదు. చివరికి బడ్జెట్‌లో సైతం అన్యాయం చేసినందుకు కేంద్రం నుంచి ఇద్దరు తెలుగుదేశం మంత్రులనీ ఉపసంహరించుకుంటానని చెప్పలేదు. పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తానని కూడా చెప్పలేదు. పాత మాటలనే స్వరం పెంచి కాస్త కటువుగా అన్నారంతే. అంతకు ముందు సాధారణంగా మెత్తగా మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. హరిబాబు, కేంద్ర బీజేపీ ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ఎంతెంత సాయం చేసిందో గణాంకాలు విడుదల చేశారు. సోము వీర్రాజు వంటి బీజేపీ నాయకులు చంద్రబాబునాయుడిని గట్టిగానే విమర్శించారు. వీర్రాజు, బోండా ఉమామహేశ్వరరావుల మధ్య వాగ్వాదం రాష్ట్ర ప్రజలందరూ ఆలకించారు. తాను బీజేపీతో అంటకాగుతూనే వైఎస్‌ఆర్‌సీపీతో బీజేపీ ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకోబోతోంది అంటూ చంద్రబాబునాయుడు ఒకానొక సమావేశంలో వ్యాఖ్యానిం చినట్టు వచ్చిన లీకులకు మీడియా ప్రాచుర్యం ఇచ్చింది. 

పవన్‌కల్యాణ్‌ పూనిక 
తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తున్న రాజకీయ నాటకానికి తోడుగా సుప్రసిద్ధ సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ మరో వేదికపైన సరికొత్త విన్యాసం ప్రారంభించారు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి తన బలం చాలడం లేదని చెబుతూ జగమెరిగిన జయప్రకాశ్‌నారాయణ (జీపీ)నీ, వాగ్బాణాలు సంధించడంలో సవ్యసాచిగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌నీ, కేంద్ర మాజీ హోం కార్యదర్శి పద్మనాభయ్యనూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావునీ, మరికొంతమంది మేధావులనూ ఒక వేదికపైన చేర్చి నిజనిర్ధారణ కమిటీ (జాయింట్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ)ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పనక్కర లేదంటూ శుక్రవారంనాడు ఎన్‌టీవీ ఇంటర్వ్యూలో జయప్రకాశ్‌నారాయణ అన్న మాటలనే చంద్రబాబునాయుడు ఇంజనీరింగ్‌ కళాశాల ఉపన్యాసంలో మరింత స్పష్టంగా అన్నారు. నోటుకు ఓటు కేసులో తెలంగాణ ప్రభుత్వంతో ‘మీకు సీబీసీఐడీ ఉంది మాకూ సీబీసీఐడీ ఉంది, మీకు పోలీసులు ఉన్నారు, మాకూ పోలీసులు ఉన్నారు’ అన్న చందంగానే ‘కేంద్రానికి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికీ అధికారాలు ఉన్నాయి. కేంద్రం లెక్కలు పార్లమెంటులో చెప్పాలి. రాష్ట్రం శాసనసభలో చెప్పాలి,’ అంటూ వాదించారు.

జమాఖర్చు వివరాలు ఎక్కడైనా చెబుతున్నారా? నిజనిర్ధారణ కమిటీలో ఉన్న మేధావులు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగినవారు. ఒకరి మాటను మరొకరు మన్నించాలన్న పట్టింపు లేదు. లోకం తీరు బాగా తెలిసినవారూ, అనేక యుద్ధముల ఆరియు తేరినవారూ పవర్‌స్టార్‌ పిలుపందుకొని ఆయనకు అండగా నిలబడటం విశేషం. వీలైనంతవరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు చేయాలన్నది వారి సంకల్పం అనడంలో సందేహం అక్కరలేదు. సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఎన్ని పిటిషన్లు పెట్టినా స్పందించని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలోని నిజనిర్ధారణ కమిటీకి అన్ని వివరాలూ అందజేయడానికి సంసిద్ధతను వెలిబుచ్చింది. హరిబాబు విడుదల చేసిన వివరాలకూ, మంత్రి కాల్వ శ్రీనివాసులు అందజేసే అంకెలకూ మధ్య అంతరం విధిగా ఉంటుంది. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని హరిబాబు చెబుతున్నారు. వేలకోట్లు కూడా ముట్టలేదని చంద్రబాబునాయుడు అంటున్నారు. అందరూ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నప్పటికీ మొదటిరోజు నిజనిర్ధారణ సంఘం సమావేశం ముగిసే సమయానికే మేధావులలో భిన్నస్వరాలు వినిపించాయి. ప్రత్యేక హోదాను మంత్రంతో పోల్చుతూ జేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలో అడగాలి కానీ మంత్రాలతో ప్రయోజనం లేదని ఎన్‌టీవీ ఇంటర్వ్యూలో వాదించారు. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ప్రయోజనం కలుగుతుందని తాను భావిస్తున్నట్టు ఉండవల్లి అన్నారు. మనం చెల్లిస్తున్న పన్నులనే మనకు తిరిగి ఇస్తున్న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పవలసిన అవసరం లేనేలేదని జేపీ అంటే లెక్కచెప్పి తీరాలనీ, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ కూడా కేంద్రానికి పంపించాలనీ ఐవైఆర్‌ కృష్ణారావు శుక్రవారం సాయంత్రమే స్పష్టం చేశారు. ‘గణాంకాలు కొత్తగా సేకరించేది ఏముంది? అన్ని లెక్కలూ ఉన్నాయి. ఇప్పుడు కావలసింది అధ్యయనం, క్షేత్రంలో పోరాటం,’ అంటూ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ దిశానిర్దేశం చేశారు.

నానాగోత్రీకులు పవన్‌కల్యాణ్‌ ఆహ్వానం అందుకొని ఒక వేదిక మీదికి వచ్చారు. కానీ వారు ఎన్ని అంశాలపైన ఏకాభిప్రాయం వెలిబుచ్చుతారో చూడాలి. ఇరవై ఏళ్ళ కిందట జేపీ లోక్‌సత్తాను నెలకొల్పినప్పుడు ఆయనతో కలసి పనిచేయడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కెఆర్‌ వేణుగోపాల్, అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు వంటి హేమాహేమీలు నడుం బిగించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు వీలైనంత సేవ చేయాలన్నదే వారి అభిలాష కూడా. తర్వాత వారు వెనక్కు తగ్గారు. వారిలాగే చాలామంది పోరాటం విరమించుకున్నారు. జేపీ ఒక్కరే అలుపెరుగని యోధుడిలాగా పోరాటం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కైనా, చిరంజీవికైనా రాజకీయాలు సినిమారంగానికి కొనసాగింపే. విజయం సిద్ధిస్తే ఇక్కడ కొనసాగుతారు. లేకపోతే సినిమారంగం ఉండనే ఉన్నది.
 
సినిమా కొనసాగింపు
అన్ని స్థానాలకూ పోటీ చేయాలనీ, గెలిచి అధికారం చేపట్టాలనే సంకల్పంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పారు. పార్టీ అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల రుచి చూశారు. అవి రుచించకనే తిరిగి సిని మాలలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్‌లో తిరిగి జవసత్వాలు నింపడానికి ప్రయత్నిస్తానంటే పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉంది. కానీ చిరంజీవి సిద్ధంగా లేరు. పవన్‌కల్యాణ్‌ నాలుగేళ్ళపాటు సినిమాలో ఒక కాలూ, రాజకీయాలలో ఒక కాలూ అన్నట్టు కాలక్షేపం చేశారు. నరేంద్రమోదీని కానీ చంద్రబాబునాయుడిని కానీ పల్లెత్తు మాట అనకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ కొన్ని కార్యక్రమాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కొన్ని రోజుల పాటు వరుసగా రాజకీయాలలో గడుపుతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టూ, టీడీపీని కూడా విమర్శిస్తున్నట్టూ అర్థం కావడానికి ప్రయత్నిస్తున్నారు. నిజనిర్ధారణ సంఘం ఒక ఎన్‌జీవో లాంటిది. బీజేపీ విడుదల చేసిన జాబి తానూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన జాబితానూ పరిశీలించిన అనంతరం ఈ సంఘం ఏమి చేస్తుంది? ఎవరి వాదన నిజమో ఎట్లా నిర్ధారిస్తుంది? అంతకు మించి ఏమి చేస్తుంది? ఉదాహరణకు రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు. ఆ నిధులను ఎట్లా ఖర్చు చేసిందో ప్రభుత్వం ఈ కమిటీకి చెబుతుందా? వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్‌ (బ్యాక్‌వర్డ్‌ రీజియన్‌ గ్రాంట్స్‌ ఫండ్‌) కింద ఎంత ముట్టిందో, ఎంత ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందా? పట్టిసీమ నిర్మాణం ఆవసరమా, కాదా అనే అంశంపైన, పోలవరం పనులపైనా జేపీకీ, ఉండవల్లికీ మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? 

ఎవరి రాజకీయ ప్రయోజనాలూ, దృష్టికోణాలూ ఎట్లా ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఎందుకు అవసరమో తెలుసుకోవాలి. ఇది మంత్రమే. ప్రగతిమంత్రం. సాధారణంగా బాగా వెనుకబడిన కొండ ప్రాంతాలకు మంజూరు చేసే ఈ హోదాను ప్రత్యేక పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి రాజ్యసభలో సరిగ్గా నాలుగేళ్ళ కిందట 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లుపైన రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో బీజేపీ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను గట్టిగా అడిగి సాధించారు. 1967 నుంచి ఇప్పటి వరకూ ప్రత్యేకహోదాను అస్సాం, నాగాలాండ్, జమ్మూ–కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌కు ఇచ్చారు. కొండలూ గుట్టలూ ఉండి, తక్కువ జనాభా ఉండి, అంతర్జాతయ సరిహద్దు పొడవునా ఉండి, ఆర్థికంగా వెనుకబడి ఉండి, ప్రాథమిక వసతులు ఏ మాత్రం లేని, అర్థికంగా అట్టడుగున ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చారు. ఈ అంశాల దృష్టితో చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు అర్హత ఉండదు.

కానీ హైదరాబాద్‌ నగరం తెలంగాణలో ఉండటం కారణంగా బాగా నష్టబోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సహాయం కింద అయిదేళ్ళపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభలో ప్రకటన తర్వాత మంత్రిమండలి తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్రణాళికాసంఘానికి ఆదేశాలు పంపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులో ఉన్న అంశాలతో పాటు ప్రత్యేకహోదా హామీని అమలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. ఆ పని చేయకుండా నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడూ యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ శాపనార్ధాలు పెడుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేశారు. 14వ ఆర్థిక కమిషన్‌ను అడ్డం పెట్టుకొని ప్రత్యేకహోదా కుదరదన్నారు. ప్రత్యేక ప్యాకేజి అన్నారు. చివరికి అది కూడా అందలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ సంఘం పరిశీలనాంశాలలో ప్రత్యేకహోదా లేకపోవడం విచిత్రం. 

ప్రత్యేకహోదా ఆవశ్యకత
ప్రణాళికాసంఘం పోయి నీతి ఆయోగ్‌ వచ్చిన తర్వాత పన్నుల ఆదాయం మొత్తంలో రాష్ట్రాలకి ఇదివరకు వచ్చే 32 శాతానికి బదులు 42 శాతం వాటా వస్తుంది కనుక ప్రత్యేకహోదా ప్రసక్తి ఉండదని తేల్చి చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టినవారికి పెట్టుబడులలో సబ్సిడీ ఉంటుంది. ఆదాయంపన్నూ, ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాలూ, కార్పొరేట్‌ పన్నులలో రాయితీలు ఉంటాయి. రవాణా చార్జీలలో సబ్సిడీ ఇస్తారు. ఇన్ని వసతులు అదనంగా ఉంటాయి కనుకనే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ, ప్రత్యేకహోదా కలిగిన ఇతర రాష్ట్రాలలోనూ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ని శిఖరాగ్ర సదస్సులు నిర్వహించినా, ఎంత భూమి ఇస్తానంటూ వాగ్దానం చేసినా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు రాకపోవడానికి కారణం ప్రత్యేకహోదా లేకపోవడమే. ప్రత్యేకహోదా కారణంగా లభించే రాయితీలు లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలను కాదని విజయవాడకో, విశాఖకో, తిరుపతికో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఎందుకు వస్తారు? పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు ఎట్లా పెరుగుతాయి? అందుకే ప్రత్యేకహోదా సంజీవని అంటున్నది. ప్రత్యేకహోదా నిరర్థకమైనదే అయితే పదేళ్ళు కావాలని వెంకయ్యనాయుడూ, పదిహేనేళ్ళు కావాలని చంద్రబాబునాయుడు ఎందుకు ఉద్ఘోషించారు? ఆ హక్కు కోసం సమష్టిగా పోరాడకుండా వ్యక్తిగత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం పరోక్ష పోరాటాలు చేయడం వలన ప్రయోజనం శూన్యం.


కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement