విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని తమ విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల వ్యవహారాల్లో పీకల్లోతున జోక్యం చేసుకొని ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఇలాంటివి చాలా జరిగాయి. గతంలో ఏపీ ప్రభుత్వం వర్సిటీల్లో సహాయాచార్యులను నియమించే ప్రక్రియను తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీఎస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి వాటిని నాయకులు తమ కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చిన నూతన ప్రభుత్వం వర్సిటీల పాలనలో జరుగుతున్న అన్ని అక్రమాలను కడిగేసి, అన్ని నియామకాల్లో ప్రమాణాలను పాటించే బాధ్యత తప్పక తీసుకోవాలి.
గడచిన ఐదారేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల పాలన గాడి తప్పి కంగాళీ అయింది. ఏయే అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో వివేచించి దారికి తెచ్చే మార్గాన్ని ఆలోచించి ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన విశ్వవిద్యాలయాలు రెండు అధికారాల అధీనంలో పనిచేయవలసి ఉంటుంది. మనకు విద్యారంగం రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. యూజీసీ పార్లమెంటు అనుమతితో ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని అధికరణాలను చేస్తుంది. ఇవి పార్లమెంటు చేసే చట్టాలలో భాగం. అదేవిధంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల పాలనకు సంబంధించి మరికొన్ని నిబంధనలను పెట్టుకుంటాయి. ఉదాహరణకు యూజీసీ ప్రకారం ఆచార్యుల పదవీ విరమణ 65 ఏళ్లకు జరగాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని 60, కొన్ని 62 మరికొన్ని 65 ఏళ్లుగా పెట్టుకున్నాయి. కాగా విశ్వవిద్యాలయాల కేంద్ర రెగ్యులేషన్ ప్రకారం 65 సంవత్సరాలుగా మాత్రమే ఉండాలని ఆదేశించవలసిందిగా రాష్ట్రాల ఆచార్యులు కొందరు సుప్రీంకోర్టును కోరారు.
దానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ రాష్ట్రాలకు వారి పాలన పద్ధతి ప్రకారం పదవీ విరమణ వయస్సును పెట్టుకోవచ్చు అని చెప్పింది. కాని అదే సుప్రీంకోర్టు యూజీసీ నిబంధనలు కొన్నింటిని రాష్ట్రాలు అధిగమించరాదని చెప్పింది. ఆచార్యుని అనుభవం పదేళ్లు ఉంటేనే వీసీ పదవికి అర్హుడు అనే విషయంలో సుప్రీం తుది తీర్పు ఇంకా రావలసే ఉంది. అందాక అదే అమలులో ఉంది చాలా రాష్ట్రాలలో. విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని వారి వారి విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల పాలనలో పీకల్లోతున జోక్యం చేసుకొని, వాటి స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కి, రకరకాల గందరగోళాలు సృష్టించి ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గడచిన దశాబ్దంలో ఇలాంటివి చాలా జరిగాయి. వర్సిటీల ఆచార్యులను మూడు స్థాయిలలోని వారిని నియమించుకునే స్వతంత్ర ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలకే ఉంటుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్షజోక్యం ఏ విధంగానూ ఉండదు. కాని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో సహాయాచార్యులను నియమించే పద్ధతిని తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీయస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది.
వారికి సర్వీసుకమీషనే పరీక్షపెట్టి వారిలో ఉత్తీర్ణత పొందిన వారి జాబితాను విశ్వవిద్యాలయాలకు పంపితే ప్రభుత్వ నియమాల ప్రకారం వారిని నియమించుకునేలా చట్టాలు మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి తిరిగి వాటిని నాయకుల కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. దీని వల్ల విశ్వవిద్యాలయాలు మరో రకం డిగ్రీ కాలేజీలుగా మారిపోతాయి. ఇలా చేయడానికి ప్రభుత్వం చూపిన సాకు ఏమంటే విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు సహాయాచార్యుల నియామకాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని అవినీతి జరుగుతూందని. కానీ సర్వీసు కమిషన్లు కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడిన ఘట్టాలు గతంలో ఎన్నో జరిగిన ఉదంతాలు కోర్టు కేసులు పరిశీలిస్తే చరిత్రే తెలుస్తుంది. ప్రభుత్వం చేసిన ఈ మార్పు వల్ల అవినీతి ఒకచోటునుండి మరొక చోటుకు మారుతుందే కాని ఆగదు అని ప్రభుత్వం గమనించలేదు. దీనికి బదులు అసలు ఉపాధ్యక్షుల నియామకంలోనే నిజాయితీపరులను నియమిస్తే, యూజీసీ నిబంధనలను పాటిస్తే ఈ అక్రమాలు జరగవు. అలా కాక కొన్ని ప్రభుత్వాలు వీసీల నియామకాలలోనే యూజీసీ నియమాలను ఉల్లంఘించి అనర్హులకు అనుభవం లేనివారికి అవకాశాలిచ్చాయి. దీనికి రాజకీయ కారణాలు ఒత్తిడులే కారణం. అంతే కాదు ఆచార్యులను ప్రభుత్వమే నియమించడం వల్ల విశ్వవిద్యాలయాలకు చాలా నష్టం జరుగుతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకమైన శాఖలుంటాయి. అసలు కొన్ని విశ్వవిద్యాలయాలే ప్రత్యేక అవసరాలకోసం ఏర్పడతాయి. వాటికి ఏవిధమైన పోస్టులు కావాలి ఏశాఖలు కావాలి ఎలాంటి వారితో వీటిని నింపుకోవాలి అనే విషయం ఆయా విశ్వవిద్యాలయాలకే తెలుస్తుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ప్రమాణాలను, విద్యావసరాలను దెబ్బకొట్టే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఖర్చును తగ్గించుకొని ఉన్నత విద్య బడ్జెట్‌కు తీవ్రంగా కోత పెట్టే దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొన్ని శాఖలను అనవసరమైనవిగా ప్రభుత్వమే నిర్ణయించుకుంది. కొన్ని శాఖలను రద్దు చేసి వాటిలో ఉన్న ఆచార్యులను వేరే శాఖలకు పంపి శాఖలను కలిపేయడం లేదా రద్దు చేయడం చేసింది. ఆచార్యుల పోస్టులు వందల సంఖ్యలో రద్దు చేయడం లేదా ఆచార్యుల పోస్టులను సహాయ ఆచార్యుల పోస్టులుగా మార్చి వాటి రిక్రూట్‌మెంటును సర్వీసు కమిషన్ ద్వారా చేయడం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా కొన్నింటిని రద్దుచేయడం కొన్నింటినే ఉద్యోగ ప్రకటనలలో ఉంచడం చేసింది. జానపదశాఖ, సంగీత లలితకళ శాఖలు, తత్వశాస్త్రశాఖ కొన్ని సంప్రదాయసైన్సు శాఖలలోని పోస్టులను రద్దుచేసింది. కొన్నింటిని మూసివేయడం చేసింది. సమాజానికి కంప్యూటర్ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు ఎంత అవసరమో ఒక అర్థశాస్త్ర శాఖ, ఒక చరిత్ర శాఖ, ఒక జానపద శాఖ తత్వశాస్త్రశాఖ కూడా అంతే అవసరం అనే స్పృహను ప్రభుత్వం కోల్పోయింది. ఈశాఖలు ఎందుకు వాటిని రద్దుచేస్తేనే మంచిది అనే ధోరణిలో ఇలా హేతుబద్ధీకరణ చేసింది ప్రభుత్వం.
ఇది ఉన్నత విద్యకు సమాజ ప్రగతికి శరాఘాతం లాంటిది. ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకంలో చరిత్ర శాఖలు ఎందుకు వాటిని తీసివేయాలి అని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దఎత్తున మేధావులలో, విశ్వవిద్యాలయాల పరిధిలో అలజడి చెలరేగింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. కానీ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధానాలనే అమలుచేస్తూ వచ్చింది. విభజనానంతరం 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఒక హైపవర్ కమిటీని వేసి హేతుబద్ధీకరణ పేరుతో పైన చెప్పిన అవాంఛనీయమైన పనులు అన్నీచేసింది.
ఇక విశ్వవిద్యాలయాలను డిగ్రీకళాశాలలుగా మార్చే మరొక చర్యతీసుకుంది ప్రభుత్వం. అదేమంటే పీజీ ఎంట్రెన్స్‌కి కామన్ పరీక్ష పెట్టడం, కామన్ సిలబస్‌లు అన్ని కోర్సులకు ఉండాలని చెప్పడం ఇలాంటిదే. రీసెర్చి ప్రవేశాలకు కూడా కామన్ ప్రవేశ పరీక్షపెట్టడం కూడా ఇలాంటిదే. దీనివల్ల చాలా విశ్వవిద్యాలయాలకు వాటి స్వేచ్ఛపోతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు వాటి అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక రచన చేసుకుంటాయి. కరిక్యులమ్ డిజైనింగ్‌కి నాక్ అత్యంత ప్రాముఖ్యం ఇస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తిం చలేదు. ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాలలోనే ఆయా ఉపాధ్యక్షుల అలసత్వం వల్లనేమి, భిన్నమైన ఆలోచనల వల్లనేమి పరిశోధనల ప్రమాణాలు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దూరవిద్యలో పీహెచ్‌డీ పరిశోధనకు అవకాశం కల్పించడం యూజీసీ చేసిన ఘోరమైన తప్పిదంగా అది గుర్తించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తిరిగి 2009లో దాన్ని రద్దుచేసినా కొన్ని విశ్వవిద్యాలయాలు పాత డేట్లతో అడ్మిషన్లు చేసాయి.
ధనసంపాదనే ధ్యేయంగా ఆయా విశ్వవిద్యాలయాలు ఈ పాపానికి దిగాయి. ఎనిమిదివేల పీహెచ్‌డీ ప్రవేశాలు కేవలం మూడు నాలుగేళ్లలోనే చేసి ద్రవిడ వర్సిటీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంపైన ఎంతో చర్చ జరిగింది ఎన్నో కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కావలసినంత రచ్చ జరిగింది. ఆ వర్సిటీ దాన్ని ప్రక్షాళన చేసుకునే పని ఇంకా చేసుకుంటూనే ఉంది. కాగా ఓయాలో కూడా ఏడువేల పీహెచ్‌డీ ప్రవేశాలు జరిగాయని ఇటీవలే వార్తలు పొక్కాయి. ఒక శాఖలో శాశ్వత ఉద్యోగిగా ఉన్న ఆచార్యుడు మాత్రమే ఆ శాఖలో పీహెచ్‌డీ పర్యవేక్షణకు అర్హుడు కాగా తాత్కాలిక ఆచార్యులకు అవకాశం ఇవ్వడం, ఒక శాఖలో పనిచేసే వారికి మరొక శాఖలో పరిశోధకులకు పర్యవేక్షణ చేసే అవకాశాలు ఇవ్వడం. డాక్టరేట్ ఉందని బోధనేతర సిబ్బందికీ పర్యవేక్షణ ఇవ్వడం ఇలాంటి అక్రమవిధానాలు కూడా కొన్ని చోట్ల జరిగాయి.
విశ్వవిద్యాలయాలకు ఈసీ మెంబర్లను ఎంపిక చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులకు, విద్యావేత్తలకు అవకాశం పూర్తిగా ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయ కోణంలోనే పునరావాస కల్పన చేసే దిశగా ఆ పద్ధతికి గండి కొట్టి కొన్ని ఎంపికలను రాజకీయ నాయకులతో చేశాయి. దీనివల్ల విశ్వవిద్యాలయ పాలన రాజకీయమయం అవుతుందే కాని విద్యాప్రమాణాలకు ఏవిధంగానూ ఉపయోగపడదు. గ్రాంటులు చాలినంత ఇవ్వకుండా మీ వనరులు మీరే చూసుకోండి అని విశ్వవిద్యాలయాలను వదిలివేయడం వల్ల కూడా అవి ఆర్థిక సంపాదన పైన ధ్యాస పెట్టడంతో íపీహెచ్‌డీ అక్రమాలకు గేట్లు ఎత్తినట్లు అయింది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పరిపాలనను అన్ని కోణాలలో అన్ని స్థాయిలలో చక్కదిద్దే ప్రయత్నం ఇది చేస్తూ ఉంది. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ పాలనపైన ఈ కొత్త ప్రభుత్వం ధ్యాసపెట్టాలి. పైన చెప్పిన అక్రమాలను కడిగి వేసి విశ్వవిద్యాలయాలలో ఉన్నత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్ని నియామకాలను ప్రమాణాల ప్రాతిపదికనే చేయాలి. ఈ కొత్త ప్రభుత్వం ఈ గురుతర బాధ్యతను స్వీకరిస్తుందని ఆశిద్దాం.
వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, జానపద ఆదివాసీ అధ్యయనాల శాఖ, ద్రవిడ విశ్వవిద్యాలయం
మొబైల్ : 94404 93604
ప్రొఫెసర్ పులికొండ
సుబ్బాచారి
Comments
Please login to add a commentAdd a comment