ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్న జీ7 గ్రూపులోకి భారతదేశాన్ని ఆహ్వా నించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా వైరస్ దేశంలో 20 నుంచి 30 కోట్ల మందికి సోకుతుందనీ, 50 లక్షల మంది దాకా చనిపోతారనీ ఎంతో మంది ప్రచారం చేసీ, చేసీ అలసిపోయారు. కానీ, కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కోగలిగిన దేశం భారత్. దీనికి కారణం నరేంద్ర మోదీ.
ఏ క్షణమైనా చైనా భారతదేశం మీద యుద్ధానికి దిగొచ్చు అన్న రీతిలో వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండి చైనా సైలెంట్ అయింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. దీనికి కారణం నరేంద్ర మోదీ.
కేవలం జనాకర్షణ మాత్రమే కాకుండా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడుగా, ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పొందిన నాయకుడుగా నరేంద్ర మోదీ గతంలో భారతదేశం ఎన్నడూ చూడని బలమైన ప్రధాన మంత్రిగా మన్ననలు పొందుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఏడో ఏట అడుగుపెట్టకముందే పరిష్కారాలు చూపించారు.
దశాబ్దాలుగా ప్రజల్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాల బూజు దులిపిన మోదీ పార్లమెంటు వేదికగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన చట్టాలను అమల్లోకి తెచ్చారు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతి అనాగరికం అంటూ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, ఒకే దేశంలో ఒకే పన్ను వ్యవస్థ ఉండాలంటూ ఆర్థిక ప్రగతి కోసం జీఎస్టీ చట్టాన్ని, దేశం మొత్తం ఒక్కటే అంటూ జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేయడం, బ్యాంకుల విలీనం... కాంగ్రెస్ పార్టీ తన రాజ కీయాల కోసం, తమ నాయకుల అసమర్థతను కప్పి పుచ్చు కునేందుకు ఎన్నో తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నరేంద్ర మోదీ సరిచేస్తూ వస్తున్నారు.
పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే నేతగా కూడా మోదీ పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. దిల్లీ నుంచి రూపాయి పంపిస్తే పది పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని ఒకప్పుడు రాజీవ్ గాంధీ అంటే... దాన్ని చక్కదిద్దేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వ పథకాల లబ్ధిని జమ చేస్తున్నారు మోదీ. చిన్న, సన్నకారు వ్యాపారులు, యువతను రాయితీలు, రుణాలు ఇచ్చి ప్రోత్సహి స్తున్నారు. కరెంటు సదుపాయం లేని గ్రామాల్లో వెలుగులు నింపి, పొగగొట్టం దగ్గర దగ్గిదగ్గి అలసిపోయిన మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు ఇచ్చి, 50 కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సదుపాయాలు అందించి, దేశ వ్యాప్తంగా రైతులకు పంటల బీమా కల్పించి అండగా నిలుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించిన చైతన్యం పెంచారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఎగుమతులు పెరిగాయి. రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల కల్పనా సామర్థ్యం పెరిగింది.
పెరిగినవే కాదు, తగ్గినవీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పీజ్‌మెంట్ పాలిటిక్స్. ఏదో ఒక వర్గాన్ని, మతాన్ని, గ్రూపుని సంతోషపెట్టడం కోసం ఈ దేశంలో చాలాకాలంగా రాజకీయాలు నడిచాయి. మోదీ ఈ తరహా రాజకీయాలకు దిల్లీ స్థాయిలో స్వస్తి పలికారు. అవినీతికి కళ్లెం వేశారు. దిల్లీ అధికార కారిడార్లలో పైరవీకారులు కాలు పెట్టకుండా చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే విధానాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవకుండానే వారికి జరగాల్సిన పనులు జరిగేలా, రావాల్సిన నిధులు వచ్చేలా చూశారు. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రణాళికలో భాగం చేశారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని రగిలించారు.
కరోనా కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఉన్న దేశాలే కుప్పకూలిపోతున్న తరుణంలో భారతదేశం గట్టిగా నిలవగలిగిందంటే దానికి మోదీ ముందుచూపు, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకత్వ పటిమ, దేశ ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకురాగలిగిన ఆయన సామర్థ్యాలే కారణం. బ్రిటన్ వంటి అగ్రరాజ్యం, తక్కువ జనాభా ఉన్న దేశం కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోలేక, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చి రక్షించుకోలేక నానా అవస్థలు పడుతోంటే, భారతదేశం మాత్రం ఇరుగుపొరుగు దేశాలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంది.
దేశవ్యాప్తంగా ఎంతో మంది అడ్డుపుల్లలు వేసే రాజకీయ నాయ కులు, కుట్రలు, కుతంత్రాలు చేసే గ్రూపులు, అపనమ్మ కాలను పెంచేలా అవాస్తవాలను ప్రచారం చేసే నిపుణులు పుష్కలంగా ఉన్నప్పటికీ; కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్‌లోకి వెళ్లిపోతుందని కొన్ని రేటింగ్ సంస్థలు నివేదికలు ఇస్తున్నప్ప టికీ; భవిష్యత్‌లో అగ్రరాజ్యం కాగల సత్తా భారత దేశానికి మాత్రమే ఉందని ప్రపంచం యావత్తూ ఏకాభిప్రాయా నికి వచ్చేలా చేయగలిగిన నాయకుడు నరేంద్ర మోదీ.
పురిఘళ్ల రఘురామ్
(వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, న్యూఢిల్లీ)
Comments
Please login to add a commentAdd a comment