కాసింత సహృదయత లేదా? | samanya kiran fires on telugu desham party over dengue issues | Sakshi
Sakshi News home page

కాసింత సహృదయత లేదా?

Published Tue, Oct 24 2017 1:14 AM | Last Updated on Tue, Oct 24 2017 2:24 AM

samanya kiran fires on telugu desham party over dengue issues

ఆలోచనం
గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగు దేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న తెలుగుదేశం వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో?
కుటుంబాన్ని ఒక్కడై పోషిస్తున్న ఎలియేలుకు ఒక నెల క్రితం బాగా జ్వరమొచ్చింది. ఒంగోలుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలియేలు మొదట తన ఊర్లోనే ఉన్న ఆర్‌ఎంపీ దగ్గరకి వెళ్లి చూపించుకున్నాడు. ఆయనేవో మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గింది. కానీ ఒకటే నీరసం. పనికి పోవడం ఆపి చేతిలో ఉన్న 4 రూపాయలూ ఖర్చుపెట్టి ఇల్లు గడపడం మొదలు పెట్టాక ఎలియేలు వాళ్ళ కాలనీలోనే పదకొండేళ్ల చిన్న అబ్బాయి చనిపోయాడు. డెంగ్యూ అన్నారు. ఎలియేలుకు భయం వేసింది. మళ్ళీ జ్వరం కాయడం మొదలుపెట్టింది. ప్రభుత్వాసుపత్రిలో చూపిస్తే పరీక్షలు చేయాలి, ప్లేట్లెట్‌ కౌంట్‌ చూడాలన్నారు. చూడటానికి అవసరమైన మెషీను తమవద్ద లేదు కాబట్టి పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రికి పొమ్మన్నారు. అతని దగ్గర డబ్బులేదు. అతని భార్యకి బాగా భయం పట్టుకుంది. వేకువజామునే బస్సెక్కి పుట్టింటికెళ్లి తండ్రిని, అన్నల్నీ అడిగి  ఐదువేలు తెచ్చి పరీక్షలు చేయించింది. అప్పట్నుంచి, మొన్న విజయవాడ నుంచి ఇంటికొచ్చేదాకా దాదాపు లక్షదాకా ఖర్చయింది. తర్వాతే అతను ఇంటికొచ్చాడు. ఇలాంటి కేసులు ప్రకాశం జిల్లాలో బోలెడు. ఒంగోలుకు దగ్గర్లోనే ఉన్న దర్శిలోనే ఇప్పటివరకు డెంగ్యూతో 15మంది పిల్లలు మరణించినట్టు వార్తలు.

ప్రజారోగ్యం మన ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది. మందుల నుంచి ప్రతి ఒక్కటీ మన వైద్యశాలలో ఫ్రీ. అయితే కాగితాలలో కనిపించే మాటలకు కంటి ముందు కని పించే దృశ్యాలకు పొంతన ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన ప్రజలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వైపు పరిగెత్తుతున్నారు. ఒకప్పుడు మనకు ప్రతి ఊరిలో ఆయుర్వేద వైద్యులుండేవాళ్లు. వీరు డబ్బుకోసం కాక వైద్య సేవ మీద తృష్ణతో వైద్యం చేసేవారు. కొన్ని రోగాలకు, కొన్ని ఆపత్సమయాలకు అక్కరకు వచ్చే దేశీయ ప్రత్యామ్నాయ వైద్యాన్ని పెకలించివేసింది ఇంగ్లీష్‌ వైద్యం.

ప్రకాశం జిల్లా అంతటా వీస్తున్న విషపు గాలి నన్నూ టైఫాయిడ్‌ రూపంలో ఆవహించింది. ఎంతకూ తగ్గని ఈ రోగం నాకు టైఫాయిడ్‌ మేరీని జ్ఞాపకం తెచ్చింది. టైఫాయిడ్‌ మేరీ యుఎస్‌లో మొదట గుర్తిం చిన టైఫాయిడ్‌ వ్యాధి లక్షణాలను కనిపించకుండా మోసుకొచ్చే వాహకం. 1900–1907 వరకు ఆమె వంటమనిషిగా పనిచేసిన ప్రతి ఇంటివారు జ్వరపడటమూ, కొంతమంది మరణించటం జరిగింది. దీనికి మేరీ కారణమని భావించి చేసిన పరిశోధనలో అది నిజమని రుజువయ్యాక ఆమె అరెస్టై అనేక ఏళ్ళ పాటు ఏకాకితనాన్ని అనుభవించింది. ఆ తరువాత ఏటా వేల సంఖ్యలో టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యే అమెరికా మెరుగైన పారిశుధ్య పద్ధతులను అవలంబించి నేడు ఆ కేసులను మూడొందలు  నాలుగొందలకి కుదించింది. ఆ కొన్ని కేసులు కూడా మెక్సికో, నార్త్‌ అమెరికా నుంచి వస్తున్న ప్రయాణికులు మోసుకొస్తున్నవే తప్ప అక్కడివి కావట. మనకి మన చుట్టూతా అందరూ టైఫాయిడ్‌ మేరీలే. మనం కూడా మన చుట్టు పక్కల వారికి టైఫాయిడ్‌ మేరీలమే. అమెరికా ఎప్పుడో శతాబ్దం పూర్వం ఆరోగ్యం పట్ల, పారిశుధ్యం పట్ల చూపించిన శ్రద్ధ మనం ఇప్పుడు కూడా చూపించలేక పోతున్నాం. ఒక రోజు నేను నా తమ్ముడి వెట్‌ క్లినిక్‌లో కూర్చుని వున్నాను. ఆరోగ్యంగా ఉన్న ఒక కుటుంబం బలహీనంగా వున్న ఒక దేశీ జాతి కుక్కను తీసుకుని వచ్చింది. ఊరకుక్క అని చిన్న చూపు చూడకండి అని వేడుకున్న యజమానురాలు ఆ శునకం రోగాన్ని నివేదించింది. అప్పటికప్పుడు ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు జరి గాయి. అంతసేపు ఆ కుక్క, ఆవేదన చెందుతున్న ఆ తల్లి ఒడిలో అలసటగా పడుకుని ఉంది.

ఆ పడుకోవడంలో అది ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. ఇది రాస్తున్నపుడు నాకెందుకో దాని ముఖంలో ఆ రోజు కనిపించిన ఆ సౌఖ్యం పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. గాలి మార్పుకోసం ఒంగోలు నుంచి పారిపోయి వచ్చాను నేను. ఇవాళ పొద్దుటే కళ్లు తెరవగానే ఎదుట కనిపించిన ఆకు పచ్చటి  మైదానం నాకు శరత్‌ చంద్ర ఛటోపాధ్యాయ ‘దత్త’ నవలలో డాక్టర్‌ నరేంద్రుడుని జ్ఞాపకం తెచ్చింది. మైదానంకి ఆవలనుంచి నడుచుకుంటూ వస్తున్న అతని రూపం, ఆ పుస్తకంలో అక్కడక్కడా కనిపించే మసూచి రోగం జ్ఞాపకం వచ్చాయి. అందులో ఒక మాట.. ‘‘సహృదయం అనే వస్తువు ఒకటి ఉంది. మీరు దాన్ని ఇంకెక్కడా చూడలేదా’’ అని. తెలుగుదేశం పార్టీ గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతూ ఉంది. మరి ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో? బహుశా బాబుగారు ఇచ్చేదేదయినా ఇప్పుడే ఇచ్చేస్తే ఓటేసేనాటికి మరచిపోతారని అనుకుంటున్నారేమో. ఈ పార్టీలు, రాజకీయాలు అంతా పక్కన పెట్టేసి ఆలోచించి చూడండి, సహృదయత అనే వస్తువు ఒకటి వుంది. మీకింతవరకు పరిచయం కాకుంటే పరిచయం చేసుకోండి. మన రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేనివే. రాజకీయాలు పక్కన పెట్టి వారికి వెచ్చటి ఓదార్పును ఇవ్వండి. ఆరోగ్య సేవలు మెరుగుపరచండి.


వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి : సామాన్య కిరణ్‌

91635 69966

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement