దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో రచయిత
ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య ఎమ్మెల్యే, తనకు సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం కోరుతూ అర్జీని వైఎస్ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్ ఆయనతో,’’ నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’’ అన్నారు. ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండగా ఎవరు వెళ్లినా, అడిగిన దానిలో సగం కత్తిరించి మంజూరు చేసేవారు. దాంతో వారు ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది’’ అని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయ్యాకే. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న రెండేళ్ల కాలం మినహా ఆయన ఎక్కువ కాలం సచి వాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా పార్లమెంటు సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వైద్య విద్య పూర్తిచేశాక తొలి నాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర ం ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. సీఎం పదవి చేపట్టాకే రాజకీయ నాయకుడిగా, వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేయడానికి వెసులుబాటు లభించింది. ఈ అరుదైన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో వరుసగా అయిదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వి నియోగం చేసుకున్నారు.
వైఎస్ చనిపోయి దాదాపు తొమ్మిదేళ్లయినా ఆయన వల్ల మేలు పొందిన వారు దాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. వీళ్లేమీ బడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప రాజకీయ నాయకులు అంతకంటే కాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, 108, 104 పథకాలను ప్రజలు నేటికీ ఆయన పేరిటే గుర్తుకు తెచ్చుకుంటున్నారనడం అతిశయోక్తి కాదు. రాజశేఖరరెడ్డి ఔదార్య లక్షణాన్ని ప్రస్ఫుటించే కొన్ని ఉదా హరణలను గుర్తుచేయడమే ఈ వ్యాసకర్త ఉద్దేశం.
ప్రింటింగు ప్రెస్సుల్లో పేరుకుపోయే అనవసరమైన కాగి తాలను కొందరు గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ ఉంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బనీ, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ మాటతో అతడికి కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని, ఈ విషయాన్ని జర్నలిస్టుల సంఘం నాయకుడు దేవులపల్లి అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడ మన్నాడు. రోగి వివరాలు తెలిసిన అమర్ వెంటనే వైఎస్‌ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించాలని వైఎస్ తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎంకు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్థిక సాయం అందించి రావాలని కోరారు.
వైఎస్ సీఎం అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో టంగుటూరి అంజయ్య సీఎంగా ఉండగా కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టు కున్నా డబ్బు మంజూరు చేసేవారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, తనకు సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం కోరుతూ అర్జీని వైఎస్ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్ ఆయనతో ‘‘నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’’ అన్నారు. ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండగా ఎవరు వెళ్లినా, అడిగిన దానిలో సగం కత్తి రించి మంజూరు చేసే వారు. దాంతో వారు ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది’’ అని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఆంగ్ల పత్రిక విలేకరి తన కుమార్తె పెళ్లికి పిలవడానికి భార్యను వెంట బెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వారిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చో బెట్టారు. సీఎం కాసేపటికి వచ్చి బయట కూర్చున్న భార్యా భర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించండి,’ అని ఒకటికి రెండు సార్లు అనడంతో ఆమె విస్తుపోయారు. వారిని వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి, ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎంద రికి పెళ్లయింది’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. అందరు జర్నలిస్టుల మాదిరిగానే వైఎస్సార్‌తో నాకూ కొన్ని అనుభవాలున్నాయి.
ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే వైఎస్‌ను అయన కారులోనే సరాసరి రేడియో రికార్డింగుకు తీసుకు వెళ్ళాను. ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్లే అనేది నా వాదన. నేను ఆయనని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన ప్రత్యక్ష సాక్షి వైఎస్‌కు మొదటినుంచి చివరి వరకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన భాస్కర శర్మ. వైఎస్ అపాయింట్‌మెంట్లు ఖరారు చేసే బాధ్యత పూర్తిగా ఆయనది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇలా ఎంతోమంది నుంచి ఒత్తిళ్ళు వచ్చేవి. సీఎం పేషీలో పని చేసేవాళ్ళు ఎంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది. నేను అనేకసార్లు శర్మను ఇబ్బంది పెట్టి ఎవరెవరి కోసమో వైఎస్ అపాయింట్‌మెంట్ ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్లీ ఫోనులోనే క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. ‘‘ సీఎం గారి అపాయింట్‌మెంట్ కోసం అందరూ క్యూలో ఉంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ’’ అనే వారు శర్మ.
వైఎస్ కూడా అంతే. ఈ విషయాలు తెలిసి కూడా తరువాత కలిసినప్పుడు ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ‘ఏవిటి విశేషాలు’ అంటూ పలకరించేవారు. ఆయన మరణించడానికి ముందు రోజే అసెంబ్లీలో కలిశాను. ఆయన లేరన్న సంగతి కూడా ఆ మరునాటికి కానీ తెలియని పరిస్థితి. మనిషిని ఆనవాలు పట్టలేని విధంగా మృత్యువు ఆయనను వెంట బెట్టుకు వెళ్లింది. అంతకు ముందు రోజు చూసిన ఆయన నగుమోమే మనస్సులో ముద్రపడిపోయింది. ఈరోజు వైఎస్ జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాలుగు ముక్కలు.
వ్యాసకర్త: భండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, మొబైల్ : 98491 30595
Comments
Please login to add a commentAdd a comment