ఆ ఆగ్రహమే రేపటి వ్యూహం | shekar gupta article on BJP and Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆ ఆగ్రహమే రేపటి వ్యూహం

Published Sat, Dec 30 2017 1:35 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

shekar gupta article on BJP and Narendra Modi - Sakshi

మోదీలోని ఉద్వేగం కట్టలు తెంచుకోవడంలో ముప్పు తప్పిందన్న ఊరటతో పాటూ ఆగ్రహం కూడా ఉంది. ఈ ఆగ్రహమే ఆయన భావి రాజకీయాలను నిర్వచిస్తుంది. బీజేపీ ఇక అనుసరించనున్న రాజకీయాలకు మతం, జాతీయవాదం, అవినీతి అనేవి మూడూ చోదక శక్తులుగా ఉంటాయి. అయితే వృద్ధి, ఉద్యోగాలు, మంచి రోజులు నినాదాలు అప్పు డప్పుడూ వినిపిస్తాయి. అయితే అవి తర్వాత పుట్టుకొచ్చిన యోచనలుగానే ఉంటాయి. గుజరాత్‌ ఎన్నికల తర్వాత కళ్లల్లో నీరుబికిన మోదీ మోమును చూస్తే అనిపించినది అదే.

ఈ ఏడాదిని గుర్తుండిపోయేలా చేసే రాజకీయ చిత్రం ఏది? ఎంచుకోడానికి మనకు చాలానే ఉన్నాయి: గుజరాత్‌ ఎన్నికల తర్వాత ప్రధాని విజయ సంకేతంగా రెండు వేళ్లను చూపడం; గాంధీ టోపీ పెట్టుకున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పతాకాన్ని ఎగురవేస్తుండటం; నూతన దళిత రాష్ట్రపతి; విజయో త్సాహంతో ఉన్న అమరీందర్‌సింగ్‌; ఈవీఎంలను తప్పుపడుతున్న కేజ్రీ వాల్‌; బీజేపీలో ప్రముఖనేతగా ఎదుగుతున్న నేత యోగి ఆదిత్యనాథ్‌ నోయిడా మూఢ నమ్మకాన్ని వమ్ముచేస్తూ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావడం (నోయిడాను సందర్శిస్తే ఓడిపోతామనే రాజకీయ మూఢ నమ్మకం ఉంది). లేకపోతే, మీరు సంక్లిష్టతలను ఇష్టపడేట్టయితే నితీశ్‌ కుమార్‌ బీజేపీ, ఎన్‌డీఏలకు చెందిన ఇతర ముఖ్యమంత్రులతో కలసి విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడాన్ని ఎంచుకోవచ్చు. మోదీని ఆయన తన ప్రమాణస్వీకారానికి హాజరు కావడానికి అనుమతించనిది ఈ దశాబ్దంలోనే. కావాలంటే మీరు లాలూప్రసాద్‌ యాదవ్‌ తిరిగి జైలుకు వెళ్లడా న్నయినా ఎంచుకోవచ్చు.

భవిష్యత్తును ఆవిష్కరించనున్న చిత్రం అదే
కానీ నేను ఎంచుకునే రాజకీయ చిత్రం వీటిలో ఏదీ కాదు. గుజరాత్‌లో గెలి చాక జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టిన దృశ్యం. అది, 2017 రాజకీయ ముఖ చిత్రాన్నేకాదు 2018 రాజకీయాలను కూడా నిర్వచిస్తుంది, 2019 ఎన్నికల సమరానికి కథనాన్ని సమకూరుస్తుంది. నిజ ఉద్వేగాలను లోలోపలే దాచుకో గల సామర్థ్యం మరెవరికన్నా ఎక్కువగా ప్రధానికే ఉంది. ఆయన బహిరం గంగా కనిపించేటప్పుడు ముందస్తుగానే, జాగ్రత్తగా ఎంచుకున్న విధంగా తన ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. కానీ ఇలా ఉద్వేగం కట్టలు తెంచుకో వడం మాత్రం సహజంగానే జరిగినట్టుంది. లేకపోతే, అణచుకోలేక కట్టలు తెగిన ఉద్వేగం అనవచ్చు.

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం మధ్యలో ఉండగా, గట్టి పోటీనే ఎదు ర్కోవాల్సి వస్తుందని అర్థమైంది. బీజేపీకి ఆధిక్యత లభించినా కొన్ని సీట్లు ప్రత్యర్థివైపు మొగ్గి ఉంటే అపారమైన నష్టం జరిగేదే. అది, కాంగ్రెస్‌ను పరివర్తనా దశలో ఉన్న పార్టీగా పునరుజ్జీవింపజేసి ఉండేది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఆకర్షించగల బలమైన శక్తిగా దాన్ని మార్చేది. ఏది ఎక్కువ లాభదాయకమనిపిస్తే వారితో చేరే బీజేపీ కొత్త మిత్రుడు నితీశ్‌ లాంటి వారు అది చూసి బెంబేలెత్తిపోయేవారు. అందువల్ల మోదీ ఉద్వేగం కట్టలు తెంచు కోవడం ఉపశమన భావంతో పాటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసేది. ఈ ఆగ్రహమే ఆయన భావి రాజకీయాలను నిర్వచిస్తుంది.
 
ఇరవై రెండేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఆయన పార్టీవారు చెప్పుకోవచ్చుగానీ, ఆయన దాన్ని నమ్మేంత అవివేకి కారు. ఆయన ప్రధాని అయ్యాక మొదటిసారిగా గుజరాత్‌లో జరిగిన ఎన్నికలవి. కాబట్టి సంప్రదా యకమైన ప్రభుత్వ వ్యతిరేకత అంశం వాటికి వర్తించదు. ఆయన పార్టీ గుజరాత్‌ శాఖ మూడున్నరేళ్లపాటూ పరిస్థితులను చేజారిపోనిచ్చింది. ఒకరిని మించి మరొకరు  అసమర్థులైన ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రం చూసింది. కుల ప్రాతిపదికపై వెల్లువెత్తనున్న పెద్ద కుల ఉద్యమాలను ముందస్తుగా కనుగొనడంలో లేదా వాటిని అదుపులో ఉంచడంలో అక్కడి పార్టీ, ప్రభు త్వమూ విఫలమయ్యాయి. వ్యవసాయరంగంలోని ఆగ్రహం మోదీ ఎన్నడూ చూడని స్థాయికి చేరింది. సంప్రదాయకంగా కాంగ్రెస్‌ వారు సైతం ఆయనను గౌరవంగా చూసే రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా, దురుసుగా మాట్లాడే జనాకర్షణగల నేతల కొత్త తరం వృద్ధి చెందింది. విస్తీర్ణత రీత్యా గుజరాత్‌ మధ్యస్త స్థాయి రాష్ట్రం. అయినా దేశ ప్రధాని, బీజేపీ జాతీయ అధినేత గుజరాతీలే. ఆ పరిమాణం గల మరే రాష్ట్రమూ ఇంతవరకూ అలాంటి ఉన్నతిని చూడలేదు. అలాంటి రాష్ట్రంలోనే ఈ విపరిణామాలన్నీ జరిగాయి.

ప్రధాన ఓటర్లలోనే అసంతృప్తి
అందువల్లనే అది జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని నెరపగల రాష్ట్రం అయింది. తాను ప్రధాని అయ్యాక నాలుగవ ఏట గుజరాత్‌లో గెలుపు తమదేననే ధీమా మోదీకి కలగకపోతే, తన పార్టీ ఆ మాత్రం చేయలేకపోతే ఆయనకు అంత ఆగ్రహం కలగడం సరైనదే. అంతకన్నా మరింత లోతైన సమస్య ఏమిటో కూడా ఆయనకు తెలుసు. మొత్తంగా చూస్తే, అంతా సజా వుగానే ఉన్నదనే సెంటిమెంటును కలిగించగల దానికంటే తక్కువ స్థాయిల్లోనే  ఆర్థిక వృద్ధి స్థిరంగా నిలచి ఉంటోంది. నిరుద్యోగులు కానున్న యువతీ యువకులు కూడా రైతుల్లాగే ఆగ్రహంతో ఉన్నారు. స్తబ్ధుగా నిలిచి పోయిన ఆర్థిక వ్యవస్థను హడావుడిగా బాగు చేయగల చిట్కా ఏదీ లేదు. వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా వృద్ధికి ఊపును తెద్దామని ఆశపడితే, అది కాస్తా బెడిసికొట్టి ప్రతికూలంగా మారింది. బాండ్లపై వచ్చే రాబడి ఇప్పటికి 12 వారాలుగా పెరుగుతూ పోతోంది. అంటే తక్కువ వడ్డీ రేట్లతో వృద్ధికి ఊపును కలిగించే అవకాశం దాటి పోయిందని అర్థం. ఇప్పుడిక వృద్ధి పుంజుకోవడం మొద లైనా, ఈ అంసతృప్తిని చల్లార్చడానికి సరిపడేటన్ని ఉద్యోగాలను కల్పించడా నికి సమయం బాగా మించి పోయింది. అసంతృప్తితో ఉన్న ఈ యువతనే మోదీ తన ప్రధాన ఓటర్లుగా భావిస్తున్నారు.

మతం పేరిట ఐక్యం చేయాల్సిందే
వచ్చే ఏడాది ఆయన ఆందోళనకరమైన ఈ సమస్యలతో అత్యవసర ప్రాతి పదికపై వ్యవహరించాలని ప్రయత్నిస్తారు. ఆ కృషే ఆయన రాజకీయాలను మలుస్తుంది. కొత్త కుల సమీకరణలను ఇలా వాడుకోవడం, గుజరాత్‌పై తన పట్టు సడలిపోవడమే చివరకు తనకు సవాలుగా పరిణమిస్తాయని కూడా ఆయనకు తెలుసు. ఈ పాక్షిక సాఫల్యతను సాధించిన ఈ ఎత్తుగడనే ప్రతి చోటా ఆయన ప్రత్యర్థులు ప్రయోగిస్తారు. కాబట్టి ఇప్పుడిక రాజకీయాలను నిర్వచించే వి గుజరాత్‌ ఎన్నికలే తప్ప, దానికి మూడింతలు పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు కావు. గుజరాత్‌ అంటేనే పూర్తిగా మోదీ, షాలకు సంబంధించిన వ్యవహారమైనా అక్కడ  పోటాపోటీగా పోరాడాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అప్రతిష్టపాలైన, అధికారంలో ఉన్న ప్రత్యర్థులతో త్రిముఖ పోటీలో బరిలోకి దిగింది. పైగా గుజరాత్‌ వారి సొంత రాష్ట్రం.  

దీనిపై ఆధారపడే మోదీ 2019 ఎన్నికలు సమీపించేసరికి నిర్ణయాలను తీసుకుంటారు. ఆలోగా పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. కుల ప్రాతిప దికపై చీలిపోయి ఉన్నవారిని మీరు మతపరంగా తిరిగి ఒక్కటి చేయగలరా? అనేదే మన ఎన్నికల రాజకీయాల్లోని కేంద్ర సమస్య. గుజరాత్‌లో కాంగ్రెస్‌ జిగ్నేశ్, అల్పేశ్, హార్దిక్‌లతో కలసి సాధించిన కుల సమీకరణలతో దాదాపు విజయవంతమైంది. కాబట్టి, హిందుత్వ అనే కలిపివుంచే అంశంతో ఓటర్లను మరింతగా కేంద్రీకరింపజేయాలి.

ఆ మూడు ముక్కల తోనే ఆట
మూడు తలాక్‌ల బిల్లు ఈ దిశగా వేసిన తొలి ఎత్తు. దీనికి ప్రతిగా రాహుల్‌ గాంధీ దేవాలయాలను సందర్శించవచ్చునేమోగానీ ఈ బిల్లును వ్యతిరేకించి మైనారిటీలను సంతృప్తిపరస్తున్నారనే ఆరోపణను ఎదుర్కొనకుండా తప్పిం చుకోవాలంటే గొప్ప రాజకీయ మేథస్సు కావాలి. కర్నాటకలో టిప్పు సమస్య ఇలాంటి ఎత్తుగడ అవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అలాంటి వాటిని మరిన్నిటిని కనిపెడతారు లేదా తామే కొత్తగా సృష్టిస్తారు.

‘వికాస్‌’ (అభివృద్ధి) నినాదంగా ఉంటే ఉద్యోగాలను కల్పించడానికి కృషి చేయాలని లేదా ఆ ప్రాతిపదికపైనే ఓట్లను రాబట్టుకోవాలని ఈపాటికి బీజేపీకి అర్థమై ఉంటుంది. అవినీతి వ్యతిరేక పోరాటం ఇంకా ఎన్నికల్లో ఉప యోగపడగలిగేదిగానే ఉంది. కాబట్టి చర్చను దానిపైకి మళ్లించవచ్చు. ప్రము ఖులుగా పేరున్నవారిపై మరిన్ని దాడులు జరగవచ్చు, కొన్ని పెద్ద కార్పొరేట్‌ దివాలాలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. అయితే 2–జీ స్పెక్ట్రమ్‌ నిందితులను వదిలిపెట్టేయడంతో అవినీతి వ్యతిరేక పోరాటయో ధునిగా మోదీ ప్రతిష్ట తగ్గింది. ఇప్పుడు ఆదర్శ్‌ కేసును కూడా న్యాయప రంగా నీరుగార్చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా అవినీతి మకిలి అంటని వారుగా ఆయనకు, ఆయన పార్టీకి ఉన్న ప్రతిష్ట అలాగే ఉంది. ఇటీవల వెలువడ్డ ఆరోపణలు నిలిచేవి కావు. ‘‘అదానీ–అంబానీ సర్కార్‌’’ హేళనలు ట్వీట్లుగా పునరావృతమౌతాయే తప్ప ఓట్లను రాల్చవు. కాబట్టి అవినీతి వ్యతిరేక దాడులు తిరిగి మొదలు కాకపోవచ్చు కూడా.

అవినీతి మంచి సమస్యే. కానీ రాజకీయాల్లో నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపేవి మాత్రం మతం, జాతీయవాదం. బోలెడంత జాతీయవాదాన్ని మనం చూడొచ్చు. సంక్షోభ పరిస్థితుల్లో దేశం ప్రభుత్వం వెనుక ఐక్యం అవు తుంది. దాని వైఫల్యాలు లేదా అసమర్థత లెక్కలోకి రావు. కార్గిల్‌ యుద్ధం, 26/11 ముంబై ఉగ్రదాడుల తదుపరి కొన్ని నెలల్లోపల జరిగిన ఎన్నికల్లో వాజపేయి,మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వాలు పెద్ద మెజారిటీలను సాధించడం ఇటీవలి ఉదాహరణలు. తార్కికంగా చెప్పాలంటే, పాకిస్తాన్‌తో నెలకొన్న సంక్షోభ పరిస్థితి ఇంకా పెరగడాన్ని మీరు చూడవచ్చు.  కాకపోతే ఓ సంక్లిష్ట సమస్య కూడా ఉంది. చైనా బుర్రలో ఏముందో, మంచు కరిగాక డోక్లాంలో అది ఏ ఎత్తుగడ వేయనున్నదో ఎవరికీ తెలియదు. సంక్షోభాన్ని అదుపు చేస్తూ, పరిమితం చేయగలుగుతున్నంత వరకూ, అది తీవ్ర పోరుగా పరి ణమించనంత వరకు ప్రభుత్వంలో ఉన్నవారికి మంచిదే. లేకపోతే చివరకు విజయం సాధించామని చెప్పుకోగలగాలి. కాబట్టి, దూకుడైన జాతీయవా దాన్ని ప్రయోగించడాన్ని, మనకున్న వ్యూహాత్మకమైన పరిమితులను సమ తూకం చేసుకురావడం మోదీ ప్రభుత్వానికి సవాలే అవుతుంది.

బీజేపీ అనుసరించనున్న రాజకీయాలకు మతం, జాతీయవాదం, అవి నీతి అనేవి మూడూ చోదకÔ¶ క్తులుగా ఉంటాయి. అయితే వృద్ధి, ఉద్యోగాలు, మంచి రోజులు అనే నినాదాలు అప్పుడప్పుడూ కొన్నిసార్లు వినిపిస్తాయి. అయితే అవి కేవలం తర్వాత పుట్టుకొచ్చిన యోచనలుగానే ఉంటాయి. కళ్లల్లో నీరుబికిన మోదీ మొహం చిత్తరువును చూస్తే మాకు అనిపించినది అదే. దాన్ని బట్టే ఆయన మిగతా పదవీకాలాన్ని నిర్వచించాం.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement