భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి గతంలో ముస్లింలకే ఉండేది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నించింది. మైనారిటీల పట్ల వాజ్‌పేయి సానుకూలత ప్రదర్శించినా ఫలితం లేకుండా పోయింది. 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. ముస్లిం ఓటర్ల సహాయాన్ని పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు. ముస్లిం ఓటు తన శక్తిని కోల్పోయింది.
ఫలితంగా పాలనావ్యవస్థలో ముస్లిలకు చోటు కరువైంది. అయితే దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసి, విడదీసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు.భారతీయ జనతా పార్టీ ఒక విషయంలో నిత్యం మధనపడుతూనే ఉండేది. అదేమిటంటే, భారతదేశంలో తమకు దక్కాల్సిన రాజకీయ ప్రాముఖ్యతను దేశీయ ముస్లింలు దూరం చేస్తున్నారన్నదే బీజేపీ బాధ. గతంలో ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు నా మాజీ సహోద్యోగి, బీజేపీలో కీలక మేధావి అయిన బల్బీర్ పుంజ్‌తో నేను చేసిన సంభాషణల్లో పదే పదే ఇదే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ’భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి ముస్లింలకే ఉంది’ అని పుంజ్ తరచుగా చెప్పేవారు.
మా మధ్య ఈ సంభాషణ 1999లో చోటు చేసుకుంది. లోక్‌సభలో రెండోసారి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు ఇది జరిగింది. లౌకికపార్టీలన్నీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఐక్యమైన ఫలితమది. 1996లో కూడా వాజ్‌పేయి తొలి ఎన్డీఏ ప్రభుత్వం 13 రోజుల్లోనే కుప్పగూలిపోయిందన్నది తెలిసిందే. రెండోధఫా ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ముగిసిపోయింది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. లౌకిక వాద విలువలకే ముస్లింలు ప్రాధాన్యత నిచ్చేవారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అప్పట్లో కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం 145– 138గా ఉండేది.
బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నిం చింది. మైనారిటీలకు అత్యంత స్నేహపూరితమైన ముఖంగా వాజ్‌పేయి బీజేపీ తరపున నిలబడేవారు. మరోవైపున అడ్వాణీ సైతం ముస్లిం–లెఫ్ట్ పేరిట ముస్లిం మేధావులను పెంచి పోషించారు. జిన్నాను ప్రశంసించడానికి ముస్లిం పండుగల్లో పాల్గొనడం, ఏపీజే అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి భవన్‌కి ఎంపిక చేయడం వరకు ముస్లిం ఓటు దుర్గాన్ని బద్దలు చేసేందుకు వాజ్‌పేయి, అడ్వాణీ ప్రయత్నిం చారు. కానీ ఆ సంప్రదాయం లేని బీజేపీ విఫలమైంది. బీజేపీ దీన్నే భారత్‌ను ఎవరు పాలించాలి అనే అంశాన్ని తేల్చిపడేసే ముస్లిం వీటోగా పేర్కొంటూ వచ్చింది.
బీజేపీ అధికారం దేశవ్యాప్తంగా పతనమైన యూపీఏ దశాబ్దంలో బీజేపీ వైఖరి మరింత పెరిగింది. తర్వాత 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ముందుకొచ్చారు. ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. భారతీయ ముస్లిం ఓటర్ల సహాయాన్ని పెద్దగా పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు.
భారత రాజకీయాల్లో కొత్త ముద్ర ఏర్పడింది.
ముస్లింలను, క్రైస్తవులను వదిలిపెట్టి 80 శాతం ఓటర్లతో కూడిన యుద్ధరంగంలోనే పోరాడాల్సి ఉందని ఇప్పుడు తాము గ్రహించామని పలువురు బీజేపీ నేతలు భావించసాగారు. ఈ వాస్తవాన్ని ఒకసారి వీరు అంగీకరించాక పార్టీ ముందున్న సవాల్ సులువైనదిగా మారింది. ‘హిందూ ఓటులో 50 శాతాన్ని కొల్లగొడితే చాలు.. మనం సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని ఏలగలం’. ఈ వాస్తవాన్ని వారు 2019లో కూడా నిరూపించారు.
భారత రాజకీయాల్లో అసాధారణమైన పరివర్తన ఏదైనా ఉందా అంటే, 20 కోట్లమందితో కూడిన అతిపెద్ద ముస్లిం జనాభా ఓట్లకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోవడమే. విశ్వసనీయమైన ప్రతి ఎగ్జిట్ పోల్ చేసిన జనాభాపరమైన విశ్లేషణ దీన్నే వ్యక్తపరుస్తూ వచ్చింది. ఇదే బీజేపీ సెక్యులర్ ప్రత్యర్థులకు షాక్ కలిగించింది. అదే సమయంలో ముస్లింలను కూడా సమాధానాల కోసం అన్వేషించేలా చేసింది. ఈ 20 కోట్లమంది ముస్లింల హృదయాలను మీరు తరిచి చూసినట్లయితే నా ఓటు తన శక్తిని కోల్పోయింది అనే చిత్రణే మీకు కనబడుతుంది. కావచ్చు కానీ అధికార చట్రంలో నాకు చెందాల్సిన సరైన స్థానం కూడా తనకు దూరం కావలసిందేనా అనే వేదన మిగిలింది.
ఆరో ఏడు పాలన సాగిస్తున్న మోదీ మంత్రివర్గంలో ఒక్క ముక్తర్ అబ్బాస్ నఖ్వి మాత్రమే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్నారు. ఈయన ఒక్కరే కేంద్రంలో ముస్లిం మంత్రిగా ఉంటున్నారు. పైగా దేశ చరిత్రలో ఇప్పుడు ఒక ఆసాధారణమైన మలుపులో మనమున్నాం. కీలక రాజ్యాంగ పదవులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, సాయుధ బలగాల సేనాధిపతులు, భద్రత, నిఘా సంస్థల అధిపతులు, ఎలెక్షన్ కమిషన్, న్యాయవ్యవస్థ విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లింకూడా కనిపించని వాతావరణంలో మనం ఉంటున్నాం.పైగా దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా ముస్లిం ముఖ్యమంత్రి నేడు కనిపించరు. ఇక ముస్లిం వ్యక్తే ముఖ్యమంత్రిగా పాలించే జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ఒక రాష్ట్రంగా కూడా లేదు. కీలక మంత్రిత్వ శాఖల్లో ఒక్క కార్యదర్శి పదవిలోనూ ముస్లిం కనబడరు. మరింత లోతుగా వెళ్లి చూస్తే.. 2015–17 మధ్యకాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నసీమ్ జైదీ ఒక రాజ్యాంగ పదవిని అధిష్టించిన చివరి ముస్లింగా చరిత్రకెక్కారు. హమీద్ అన్సారీ ఉన్నారనుకోండి. భారత్‌లోని 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నజ్మా హెప్తుల్లా, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే ఇద్దరు ముస్లింలు మాత్రమే గవర్నర్లుగా ఉన్నారు.
నేటి భారత్‌లో ఇది ఎక్కడ ముగుస్తుందో చెప్పలేం. బీజేపీ సబ్ కా సాత్, సబ్‌కా వికాస్‌పై జరుగుతున్న వాదనలు మనకు తెలుసు. తర్వాత దేశంలో ప్రధానంగా ఎలాంటి మత కల్లోలాలు లేవు. మోదీ ప్రభుత్వంలో ఐఏఎస్ తదితర విభాగాల్లో ముస్లిం అభ్యర్థుల సంఖ్య కనీసంగా మాత్రమే పెరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే మైనారిటీ స్కాలర్‌షిప్‌లు ప్రస్తుతం కాస్త పెరిగాయి. నిజమైన సమానత్వాన్ని ప్రబోధిస్తున్న దేశంలో 15 శాతం జనాభాకు తనదైన స్థానం దక్కాల్సి ఉంది. అధికారం, పాలన విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. 2014 తర్వాత బీజేపీ నుంచి దీనికి వచ్చే సమాధానం ఒక్కటే. ‘మమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మాకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మీరు చెబుతుంటారు తర్వాత అధికారంలో భాగం కావాలంటారు. ఎలా సాధ్యం?’
రాజ్యాంగపరమైన సమానత్వాన్ని ఇది ప్రశ్నిస్తోంది. మీకు ఓటుంది, స్కాలర్షిప్‌లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలున్నాయి. కానీ అధికారంలో వాటాకోసం మీ వోటింగ్ ఎంపికలపై మీరు పునరాలోచించుకోవాల్సి ఉందేమో మరి. దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లింల జనాభా చెల్లాచెదురుగా ఉంటున్నారు. లోక్‌సభలో 27 మంది ముస్లింలు మాత్రమే ఉంటున్న వాస్తవం దీన్ని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయిల్ వంటి జాత్యహంకార రిపబ్లిక్‌లో అతిపెద్ద మైనారిటీగా ఉంటున్న ముస్లింలకు ఇతర అవకాశాలున్నప్పటికీ, పాలనా యంత్రాగంలో చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు కానీ హిందూ రిపబ్లిక్ కాని భారత్‌లో ముస్లింల పరిస్థితి ఇలాగే ఉండటమే పెద్ద విషాదం. ప్రపంచంలో 40 శాతం పైగా ముస్లింలు భారతీయ ఉపఖండంలోనే జీవిస్తున్నారు.
కానీ ఈ ప్రాంతంనుంచి కొన్ని వందల సంఖ్యకు మించి ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరలేదు. ఇక భారతీయ ముస్లింలలో ఐసిస్‌లో చేరినవారి సంఖ్య వందకు మించలేదు. ఇదెలా సాధ్యం? అంటే భారత్, పాక్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లింలలో జాతీయవాదం వేళ్లూనుకుని ఉంది. వారికి సొంత జాతీయగీతం, క్రికెట్ టీమ్ ఉంది. గెలిపించడానికి, ఓడించడానికి రాజకీయనేతలు కూడా ఉన్నారు. ఇస్లాం రాజ్యం అనే ఊహ మన ముస్లింలను ఆకర్షించలేదు. పైగా ఉపఖండంలోని ముస్లింలు మతానికి మాత్రమే కాకుండా భాష, జాతి, సంస్కృతి, రాజకీయ సిద్ధాంతం వంటి ఇతర అంశాల ప్రభావానికి కూడా గురై ఉంటున్నారు.
ఈ ప్రాంతానికి సంబంధించిన అతి గొప్ప శక్తి ఇదే. 2014 తర్వాత ముస్లిం మైనారిటీ ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని భారత్ ఏమాత్రం కోరుకోవడం లేదు. వారి మౌనం అర్ధాంగీకారం కాదు. భారతీయ ముస్లింలు మధ్యతరగతిగా పరివర్తన చెందారు. వీరిలోంచి విద్యావంతులైన, వృత్తినైపుణ్యం కలిగిన కులీనవర్గం ఆవిర్బవించింది. వారసత్వ పార్టీ, వామపక్ష–ఉర్దూ కులీన వర్గాలకు చెందిన పాత వ్యవస్థను వారిప్పుడు అనుసరించడం లేదు.
ఓటింగ్ ప్రాధాన్యతల రీత్యా ముస్లింలను శిక్షించడం వల్ల ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నట్లు సంతోషం కలిగించవచ్చు. కానీ అది స్వీయ ఓటమికే దారి తీస్తుంది. దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment