మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతిమంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వేళ ప్రతిపక్షాలు చూపించిన ఐకమత్య సంరంభం నాకు నోట మాట రాకుండా చేసింది. గడచిన నాలుగేళ్ల నుంచి నేను ఒకే విషయం చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఇప్పటిదాకా భారత గణతంత్ర మౌలిక విలువల మీద దొంగచాటు దాడికి పాల్పడుతూనే ఉంది. అయినప్పటికి మోదీ వ్యతిరేకులు ఒకే తాటి మీదకు వచ్చి ప్రతిఘటించే ముహూర్తం కానరాకపోవడమే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మోదీని అధికారం నుంచి దించడం అనే ఏకసూత్ర ప్రణాళిక మాత్రం న్యాయబద్ధమైనది కాలేదు. అంతేకాదు, అలాంటి ఆలోచన ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఎక్కువే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర పరిణామాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని దారులు చూపించాయి.
ఆ ఎన్నికల ఫలితాలు ఒక వాస్తవాన్ని కూడా నిర్ధారించాయి. ఈ వాస్తవం గడిచిన ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ రాజకీయ విశ్లేషకుడైనా ఊహించేదే కూడా. మోదీ, షా ద్వయం బలీయమైనది, అదే సమయంలో అని తర సాధ్యమైనది. కాంగ్రెస్ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలను కూడా ఫలి తాలు తారుమారు చేశాయి. సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్రతిహత రాజకీయ విన్యాసాల ముందు సొంత శక్తి మీద నిలువలేదన్న వాస్తవాన్ని కూడా ఆ ఫలితాలు వెల్లడించాయి. అలాగే ఆ ఫలితాలు ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కూడా సూచిస్తున్నట్టయితే, ఎన్నికల అనంతరం జరిగిన మాయోపాయాలు, యడ్యూరప్పను పదవీచ్యుతుడిని చేయడానికి జేడీ(ఎస్), కాంగ్రెస్ పోషించిన చురుకైన పాత్ర వంటివి చూస్తే అందుకు, అంటే ఐక్యతకు అవకాశం, ఆచరణ మెండుగానే ఉన్నట్టు నిర్ధారణయింది కూడా.
ఆ విధంగా చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికలు 1971,1977, 1989 నాటి ఎన్నికల నమూనాలో జరిగే అవకాశం ఉంది. అప్పుడు అన్ని ప్రతిపక్షాలు కలసి బలీయమైన అధికార పక్షాన్ని ఓడించడానికి ఏకమైనట్టు కనిపిస్తుంది. తేడా ఒక్కటే. పూర్వం అవన్నీ కాంగ్రెస్ వ్యతిరేక కూటములు. ఇప్పుడు మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి. ఈ పరిణామం ఆశ్చర్యపడవలసినదేమీ కాదు. మోదీ బుడగ తనకు తాను ఎప్పుడు బద్దలవుతుందా అని గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షం ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ క్షణం రాలేదు. మోడీత్వకు వ్యతిరేకంగా విపక్షం చేయవలసినవన్నీ చేసింది. అవి కూడా ఫలితాలను ఇవ్వలేదు సరికదా, వికటిం చాయి. క్షేత్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలిగే ఒక ప్రతిపక్ష కూటమిని అందించడంలో మోదీ వ్యతిరేకులు విఫలమయ్యారు. ఇక చేసేదిలేక విపక్షాలు విస్తృత మోదీ వ్యతిరేక కూటమి నిర్మాణమే తుది లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఆఖరిపోరాటం ఆరంభించారు. కానీ కర్ణాటకలో సంభవించిన పరి ణామాలు ఈ కూటమి ఏర్పాటుకు కొత్త షరతులను ముందుకు తెచ్చాయి. చిత్రం ఏమిటంటే ఆ షరతులను నిర్దేశించేది కాంగ్రెస్ కాదు, ప్రాంతీయ పార్టీలు.
బీజేపీయేతర పార్టీల ఓట్లలో చీలిక రాకుండా జాగ్రత్త పడడం వల్ల ఆ లబ్ధి చేకూరుతున్నది. ఇది గోరఖ్‌పూర్, ఫూల్పూరు ఎన్నికలలో రుజువైంది. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ బలం కలిగి ఉన్నాయో అక్కడ ఇది వర్తిస్తుంది. ఓట్లు చీలకపోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు, విపక్షాలు జాతీయ స్థాయిలో హవాను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలకు ఉన్న ఈ సానుకూలతలను చాలా సందర్భాలలో అతిశయోక్తిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఐక్యత అనే ఆలోచన అవసరం రాదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో ఇది నిజం. అక్కడ కాంగ్రెస్–బీజేపీల మధ్య ద్విముఖ పోటీయే ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో కలసే మరో ప్రతి పక్షం ఏదీ లేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరొక రకమైన పరిస్థితి. ఆ రాష్ట్రాలలో ఎక్కడా కూడా తొలి రెండు స్థానాలలో ఉన్న అగ్రగామి పక్షంగా బీజేపీ లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలన్న నినాదానికి అర్థమే లేదు. బెంగాల్‌లో బీజేపీని నిలువరించడానికి మమతా బెనర్జీకి మరొక రాజకీయ పార్టీ సాయమేదీ అవసరం ఉండదు.
ప్రతిపక్షాల ఓట్లు చీలకపోవడం గురించి కూడా అతిశయోక్తులు వినిపిస్తూ ఉంటాయి. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల మాదిరిగానే బీజేపీయేతర పార్టీల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదు. మొన్నటి కర్ణాటక ఎన్నికలలో కొన్ని ప్రాంతాలలో జేడీ(ఎస్), కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్నచోట ప్రతిపక్షానికి కొత్తగా లభించే లబ్ధి ఏదీ ఉండదు. కొన్ని చోట్ల బీజేపీయేతర పార్టీల ఓట్లే అయినప్పటికీ అవి బదలాయించడానికి అవకాశం ఉన్నవి కావు. ఉత్తరప్రదేశ్, బెంగాల్‌లో కాంగ్రెస్ పరి స్థితి ఇదే. కాబట్టి కాగితాల మీద కనిపిస్తున్న బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం వాస్తవికంగా ఆకృతి దాల్చడం లేదు. ఇంకొక అంశం– ప్రతిపక్షాల ఐక్యత వల్ల వచ్చే ప్రయోజనాలు అన్ని సందర్భాలలోను నిలకడగా ఉండవు. టీఆర్‌ఎస్, టీడీపీ, డీఎంకే, జేకేఎన్‌సీ, బీజేడీ, ఐఎన్‌ఎల్‌డీల విషయంలోను, ఇంకా చెప్పాలంటే బీఎస్పీ విషయంలో కూడా ఇదే వాస్తవం. ఈ పార్టీలు మొదట బీజేపీ వ్యతిరేక కూట మిలో భాగస్వాములు కావచ్చు. కానీ వాటి గత చరి త్రను చూస్తే ఎన్నికల అనంతర అవగాహనలలో భాగంగా వారు బీజేపీవైపు మొగ్గు చూపబోరని ఎవరూ చెప్పలేరు.
బీజేపీ వ్యతిరేక విస్తృత కూటమి గురించి మాట్లాడుతున్న సందర్భంలో రెండు వాస్తవాలను గుర్తించడంలో వైఫల్యం కనిపిస్తుంది. అవి– దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నవారు నిజానికి భవిష్యత్తులో బీజేపీ పునాది విస్తరించడానికి ఉపయోగపడేవారే అవుతారు. ప్రధాన ప్రతిపక్షాల ఐక్యత (బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ; ఒడిశాలో ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్, తెలంగాణ, ఆంధ్రా) ఒక శూన్యాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఈ పార్టీలలో ఏదైనా తమను అనాథగా వదిలేసిందని ఓటర్లు భావించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇలా విపక్షాలు వదిలిన శూన్యాన్ని భవిష్యత్తులో బీజేపీయే సొంతం చేసుకుంటుంది. అలాగే మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతి మంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు.
ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాల పట్ల నేను అసంతృప్తిగా ఉండడానికి వెనుక కారణం కొన్ని లాభనష్టాలు మాత్రమే కాదు. నాకున్న సమస్య ఏమిటంటే– నేడు ఉన్న ఈ పాలనను ఎందుకు తిరస్కరించాలి అన్న విషయాన్ని వారు మరచిపోయారు. అంతేకాదు, జనం కూడా మరచిపోయేటట్టు చేస్తున్నారు. కూటమిగా ఏర్పడుతున్న ఈ బీజేపీయేతర పార్టీలలో ఏ ఒక్కటీ కూడా గణతంత్ర భారత పునాదులకు ఎదురవుతున్న సవాళ్లను ప్రతిఘటించడానికి సంసిద్ధంగా లేదు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడే కూటమికి ఈ నాలుగు లక్షణాలు ఉండాలి. ఒకటి– సానుకూల జాతీయవాద సంప్రదాయాన్ని పునరుద్ధరించే దృష్టి ఉండాలి. దేశంలో ఉన్న భిన్న సంస్కృతులూ సంప్రదాయాల మధ్య అంతస్సూత్రంగా వ్యవహరించాలి. ఈ తరం యువతకూ భవిష్యత్తుకూ మధ్య వారధిలా పనిచేయాలి. రెండు– స్వతంత్ర భారతంలో ఎన్నికల యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించిన వ్యవస్థతో పోరాడే జాతీయ స్థాయి రాజకీయ సంస్థ అవసరం. మూడు– కొత్త రాజకీయాలను దర్శించే వ్యూహాత్మక ప్రణాళిక ఉండాలి. నాలుగు–దేశంలో కొత్త ఆశలు నింపగలరని నమ్మకం కలిగించే వ్యక్తులు అందులో ఉండాలి. దురదృష్టం ఏమిటంటే మోదీకి వ్యతిరేకమంటూ ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిలో ఏ ఒక్క పార్టీకి ఇలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రతిపక్ష కూటమి ఐక్యత వల్ల కొంత లబ్ధి జరగవచ్చు. అంతేకాని అవి మోదీ పాలనకు ప్రత్యామ్నాయం మాత్రం కాలేవు. ఇంకా చెప్పాలంటే మోదీ పాలనకు స్వస్తి పలికినప్పటికీ ఈ కూటమి స్వల్పకాలిక ప్రయోజనం కూడా సాధించలేకపోవచ్చునేమో కూడా. పోనీ స్వల్ప కాలిక ప్రయోజనమే సాధించినప్పటికీ అది మన గణతంత్ర రాజ్య ప్రయోజనాలను ఫణంగా పెట్టి సాధించినదే.
యోగేంద్ర యాదవ్ , వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు, మొబైల్ : 98688 88986
Comments
Please login to add a commentAdd a comment