కేంద్రీకృత రాజధాని సిద్ధాం తం నుండి వికేంద్రీకరణతో కూడిన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభివృద్ధి వైపు, మార్పుదిశగా ప్రస్తుత ప్రభుత్వం తొలి అడుగని భావించవచ్చు. కానీ ఈ మార్పు మంచిది కాదని, అవసరం లేదని, ప్రతిబంధకమని ప్రతిపక్ష రాజకీయ నాయకుల వాదన. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ ప్రక్రియ ఆధారంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళేందుకు ఉపకరిస్తాయని మేధావి వర్గం అభిప్రాయంగా చెప్పవచ్చును. ముఖ్యంగా వికేంద్రీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కాపాడుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం మన రాష్ట్రంలో భౌగోళిక పరంగా, సహజంగానే మూడు ప్రాంతాలుగా కనిపిస్తున్న కళింగాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విభిన్న సాంఘిక, సాంస్కృతిక, ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. దీని దృష్ట్యా, వికేంద్రీకరణ పాలన అనుకూలమైన నిర్ణయంగా భావించాలి.
కళింగాంధ్ర వెనుకబాటుతనం నిర్మూలన, కోస్తాంధ్ర ప్రాంతంలో వరద నివారణ, వ్యవసాయాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకై సాగునీటి సమగ్రాభివృద్ధి ముఖ్యాంశాలుగా గుర్తించి పరిపాలన పరంగా అభివృద్ధి చేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధించేం దుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో జరిగిన కేంద్రీకృత అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటు తనం వల్ల జరిగిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పట్టణాలు, మరియు కొన్ని జిల్లాలు మాత్రమే ఆర్థికాభివృద్ధి మిగతా ప్రాంతాలకంటే ఎక్కువ ఆర్థికాభివృద్ధి సాధించాయి. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అధికార వికేంద్రీకరణ దిశగా ఉంటుంది. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ, తద్వారా సమతుల్య అభివృద్ధి జరుగుతుందని మేధావుల అభిప్రాయం. అమరావతి ఒక్కచోటే అభివృద్ధి జరగడం వలన అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ తద్వారా ఒక ప్రాంతానికి కొంతమందికే ప్రయోజనంగా ఉంటుందని చెప్పక తప్పదు.
తక్కువ ప్రయత్నం వలన ఎక్కువ ప్రయోజనం పొందటం ఆర్థికశాస్త్రం యొక్క ఒక ముఖ్య సిద్ధాంతం. అంతేకాకుండా స్వల్ప కాలంలోనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరముందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికల రచన అంత ప్రయోజనం కాదని కీన్స్ అనే ఆర్థిక శాస్త్రవేత్త చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. అమరావతి అభివృద్ధి సాధించడానికి కనీసం 40 లేదా యాభైఏళ్లు పడుతుందని మేధావుల అంచనా. ఆ కాల వ్యవధిలో రాజకీయం, ఆర్థిక, సాంకేతిక మార్పులు విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఆర్థికశాస్త్రం యొక్క ఛాయిస్ ఆఫ్ సైన్స్ అనే సిద్ధాంతానికి కేంద్రబిందువుగా ఉన్న అభిప్రాయానికి ప్రతిరూపంగా ప్రస్తుత ప్రభుత్వం స్వల్ప కాలంలో అధిక ప్రయోజనం కలిగించే విధానాలను ఎంచుకొని, మూడు రాజధానుల సిద్ధాంతం అధిక ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుందని గట్టి నమ్మకం.
మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగ స్వామ్యం చేయవచ్చు. రాజధాని వికేంద్రీకరణ వలన అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. వాణి జ్యాభివృద్ధిలో వేగం పెరుగుతుంది. ఆర్థిక శాస్త్రం ప్రకారం కొనుగోలు శక్తి పెరగాలంటే ఆర్థికాభివృద్ధి పెరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అన్నిప్రాంతాల ఆర్థికాభివృద్ధి వలన అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి పెరు గుతుంది. దాని వలన వాణిజ్యం పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సత్వర ఆదాయ వనరుల అభివృద్ధి ఎంతైనా అవ సరం. మూడు రాజధాని నగరాలను సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా, వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా అనుకూలం ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తాయి. మూడు రాజధాని నగరాలకు సమాన నిధులిచ్చి, సాంస్కృతిక, సామాజిక అంశాలకు అనుగుణంగా వివిధ ప్రణాళికలను రచించి, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ,
అనంతపురం ‘ 94408 88066
ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment