సాక్షి, గుంటూరు: మండలంలోని ఊడిజర్లలో సుమారు 450 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయతే.. గ్రామంలో 480 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉండటం గమనార్హం. నిర్మాణ బాధ్యతను అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ చేజిక్కించుకుని అధికారులతో కుమ్మక్కయ్యాడు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు మార్చుకోవడం ఒక ఎత్తయితే, అసంపూర్ణంగా ఉన్న మరుగుదొడ్లకూ బిల్లులు చేయడం విశేషం. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉండటం గర్హనీయం. ఇలా గ్రామంలో రూ.30 లక్షల వరకూ అక్రమం జరిగినట్లు తేలింది. మండల కేంద్రంతో పాటు కొండ్రముట్ల, వనికుంట, కొండాయపాలెం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకేఇంటిలో ఏడు నిర్మాణాలకు బిల్లులు..
గ్రామస్తుడు యాతకుంట పుల్లారెడ్డి పేరుపై ఒక మరుగుదొడ్డి నిర్మించగా ఆయన భార్య అరుణ పేరుపై కూడా మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. యాతకుంట వెంకటేశ్వరరెడ్డి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించనప్పటికీ రెండు పేర్లతో బిల్లులు మార్చారని తెలుస్తోంది. గ్రామానికి చెందిన శాగంరెడ్డి సైదమ్మ, వెంకాయ్మ, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డితో పాటు అదేఇంట్లో మరోఇద్దరి పేర్లతో ఐదు మరుగుదొడ్లు నిర్మించినట్లుగా చూపి బిల్లులు పొందినట్లు రికార్డుల్లో నమోదైంది. గ్రామానికి చెందిన పాలూరి శ్రీనివాసరెడ్డి, రమణమ్మ, పాలమ్మ పేరుతో ఒకే ఇంటికి మూడు బిల్లులు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. యర్రంశెట్టి శేషమ్మ, పుల్లయ్య, వెంకటరామయ్య, తిరుమలయ్యతో పాటు మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఒక్క మరుగుదొడ్డి నిర్మించి ఏడు మరుగుదొడ్లకు బిల్లులు పొందినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే పంచాయతీ పరిధిలో సుమారు 200 మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మార్చుకున్నట్లు తేలింది.
లబ్ధిదారులకు తెలియకుండా బిల్లులు..
కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారులకు కూడా తెలియకుండా వారి పేరుతో బిల్లులు తయారు చేసుకుని నేరుగా కాంట్రాక్టరు ఖాతాకే నగదు జమ చేయించుకున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ చేపడితే భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment