వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అడవి ప్రాంతంలో లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసర్ శిలాజాల ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను గత మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న కవి, అధ్యాపకుడు రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో నమ్మలేని శిలాజాలు బయటపడ్డాయి.
గత కొన్ని రోజులుగా బుట్టాయగూడెంలో పరిశోధనలు చేస్తున్న రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి భద్రాచలం వెళ్లేదారిలో గోదావరి నది అనేక పాయలుగా చీలి దారి మార్చుకొని ప్రవహించడం వల్ల భూగర్భంలోని వృక్ష శిలాజాలు బయటకి వస్తున్నాయి.
గ్రామ శివారు భూముల్లో అనేక శిలాజాలు ఉన్నట్లు గుర్తించాం. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసర్ ఎముకల వంటి శిలాజాలను గుర్తించాం. వీటిని స్థానికులు రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు. దేవతల, రాక్షసుల యుద్ధంలో రాక్షసులు చనిపోయారని, ఈ శిలాజాలను వారి బొక్కలుగా భావిస్తున్నారు.
ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును సేకరించాం. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని ఆయన వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళితే మరిన్ని శిలాజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో డైనోసర్ శిలాజాలు కూడా లభించవచ్చని ఆయన అన్నారు.