కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు | i will fight for u says Rahul gandhi | Sakshi
Sakshi News home page

కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు

Published Sat, Aug 1 2015 12:05 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు - Sakshi

కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
* ఆరెస్సెస్ పథకంలో భాగంగా కాషాయీకరణ చేస్తున్నారు..
* ఎఫ్‌టీఐఐ చైర్మన్ గజేంద్రను తొలగించాలని డిమాండుకు మద్దతు

పుణే: ఆరెస్సెస్ పథకంలో భాగంగానే భారత చలనచిత్ర, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ (ఎఫ్‌టీఐఐ)కు చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్‌ను నియమించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ ప్రోద్బలంతోనే కేంద్రం కీలకమైన విద్యా, పరిపాలన, న్యాయ వ్యవస్థల పునాదులను దెబ్బతీస్తోందని, వీటిని కాషాయీకరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

శుక్రవారం ఆయన ఎఫ్‌టీఐఐ క్యాంపస్‌ను సందర్శించి గజేంద్ర చౌహాన్‌ను తొలగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. చౌహాన్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. కీలకమైన వ్యవస్థల్లో ఆరెస్సెస్ భావజాలంగల వ్యక్తులను నింపుతున్నారని, అదేమని ప్రశ్నిస్తే జాతివ్యతిరేకులని, హిందూ వ్యతిరేకులంటూ ఎదురుదాడి చేస్తున్నారని రాహుల్ అన్నారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా, వారిని అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తమ వాదన కూడా వినాలని విద్యార్థులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమాజానికి రాబోయే రోజుల్లో సందేశాత్మక చిత్రాలు అందించే విద్యార్థులను అణచివేయడం సరికాదని అన్నారు.

గజేంద్ర చౌహాన్ తమకు వద్దని విద్యార్థులు చెబుతుంటే ఆయనను బలవంతంగా ఎందుకు రుద్దుతారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏదైనా సమస్య వస్తే చర్చలద్వారా దానిని పరిష్కరించేవారిమని, ఇప్పుడు ప్రధాని మోదీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్ని ప్రశ్నించకూడదంటున్నారని రాహుల్ అన్నారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని ఆయన విద్యార్థులకు హామీనిచ్చారు.

బీజేపీ సభ్యుడు, టీవీ నటుడైన చౌహాన్‌ను ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మహాభారత్ టీవీ సీరియల్‌లో చౌహాన్ ధర్మరాజు పాత్రను పోషించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ తదితరులు చౌహాన్‌ను తొలగించాలన్న డిమాండ్‌కు మద్దతు పలికారు. కాగా, రాహుల్ రాక సందర్భంగా క్యాంపస్ బయట బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement