యువతిపై అసభ్యకర వ్యాఖ్య చేసిన ఇరువురు కటకటాల పాలయ్యారు.
-
నిర్భయ చట్టం కింద ఇరువురికి ఏడు నెలల జైలు
విజయనగరం లీగల్: యువతిపై అసభ్యకర వ్యాఖ్య చేసిన ఇరువురు కటకటాల పాలయ్యారు. విజయనగరం జిల్లాలో నిర్భయ చట్టం కింద నమోదైన ఈకేసు తీర్పు శుక్రవారం వెలువడింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...విజయనగరం పట్టణానికి చెందిన ఓ యువతి తనతల్లిదండ్రులతో గత ఏడాది జూలై 30న జ్యూయలరీ షాపునకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడున్న గొలగాన శ్రీను, వారాడ సతీష్‌లు ఆ యువతిని చూసి అసభ్యంగా వ్యాఖ్య చేశారు. ఆమె తల్లిదండ్రులు వారిని నిలదీయగా ఏమైపోయింది ఇప్పుడు అంటూ తగాదాకు దిగారు. దీంతో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. విచారణ అనంతరం శ్రీను, సతీష్‌లకు ఏడు నెలల జైలుశిక్షతో పాటు చెరో వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి కె.వి.రమణాజీరావు తీర్పు చెప్పారు. 2012లో ఢిల్లీలో జరిగిన సంఘటన తరువాత లైంగిక వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ‘పోక్సా’ (లైంగిక వేధింపుల నుంచి బాలబాలికలకు రక్షణ కల్పించే చట్టం) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టం ప్రకారమే జిల్లాలో తొలితీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పీపీ మల్లికార్జున్ వాధించారు.