
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకునికి తొలి పూజలు నిర్వహించారు. సప్త ముఖ కాళ సర్ప రూపంలో ఈ ఏడాది మహా గణపతి భక్తులకు దర్శనమిచ్చారు. నయన మనోహరంగా శిల్పి రాజేంద్రన్ దీన్ని రూపొందించారు. స్వామి వారికి జరిగిన తొలి పూజ కార్యక్రమంలో పరిపూర్ణనంద స్వామి, ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహా రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి 50 కిలోల లడ్డును శిల్పి రాజేంద్రన్ సమర్పించారు. ఈ సారి 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పులో స్వామి వారు ఖైరతాబాద్‌లో కొలువుదీరారు.
ఏడు తలలు, 14 చేతులు, తలలపై 7 సర్పాలతో స్వామి వారు కనువిందు చేస్తున్నారు. మహాగణపతికి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెప్పింది.