
రగడ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరే షన్ సర్వసభ్య సమావేశం ఆద్యంతం నిరసనల తో హోరెత్తింది. సభ్యుల ఆందోళన, నినాదాల తో సమావేశం హాలు దద్దరిల్లింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యుల మేయర్ పోడియం ముట్టడి, మేయర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నినాదాలతో సభ హోరెత్తింది. గ్రేటర్‌లో 35 శివారు గ్రామాలను విలీనం చేయడాన్ని సమావేశం వ్యతిరేకించింది. గత సమావేశంలో 15 గ్రామాల విలీనాన్ని కౌన్సిల్ వ్యతిరేకించినా.. లెక్కచేయకుండా వాటితో సహా మొత్తం 35 గ్రామపంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ జీవోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖం డించింది.
సోమవారం ఉదయం సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల సభ్యులు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. సభ్యులంతా ముక్తకం ఠంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరాభివృద్ధిని గాలికి వది లారని, కొత్తగా గ్రామాల విలీనం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపడతారని సభ్యులు నిలదీశారు. నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని ప్రశ్నించారు. విలీనం సందర్భంగా జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకప్యాకేజీ కింద ఎన్ని నిధులిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
విలీనం వల్ల కొత్తగా అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజె క్టులకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ‘స్టేటస్ కో’కు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కోరారు. ప్రత్యేక నిధులు.. తదితర అంశాల్లో స్పష్టత ఇస్తూ శ్వేతపత్రం విడుదల చేసేంతదాకా.. జీహెచ్‌ఎంసీ నిధులతో సదరు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని తీర్మానించారు. గ్రామాల విలీనం వల్ల జీహెచ్‌ఎంసీపై మోయలేని అదనపు భారం పడుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
విలీనగ్రామాల ప్రజలపై అదనపు భారాలు పడటం తప్ప సదుపాయాలు సమకూరవన్నారు. ఈ విలీనం వల్ల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం రెండో దశ ద్వారా వచ్చే నిధులు, స్లమ్ ఫ్రీ సిటీ కోసం వచ్చే రాజీవ్ ఆవాస్ యోజన నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ పథకాలు మెట్రోపాలిటన్ నగరాలకు వర్తించనందున ఆ నిధులందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లందరం కలిసి సీఎం దగ్గరకు వెళ్లి విలీనాన్ని రద్దు చేయాల్సిందిగా కోరదామన్నారు.