=కలచివేసిన ఉదయ్‌కిరణ్ ఉదంతం
=వెండితెర మాటున చీకటి కోణాలు
=సక్సెస్ అయితే ఓకే.. లేదంటే షాక్
=రంగుల కలలు కల్లలై విషాదాంతాలు
సాక్షి, సిటీబ్యూరో: సినీ నటుడు ఉదయ్‌కిరణ్ అర్ధంతరంగా తనువు చాలించిన వైనం దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని వెస్లీ కాలేజీలో చదువుకున్న ఆయనకు నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. సోమవారం ఉదయం అటు ఉస్మానియా మార్చరీ వద్ద, ఇటు నివాసం ఉన్న శ్రీనగర్ కాలనీ లోనూ, మృతదేహాన్ని ఉంచిన నిమ్స్ వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఉదయ్‌కిరణ్ తక్కువ కాలంలోనే ‘తార’స్థాయికి ఎదిగి, అంతలోనే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన తీరు అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.
వెలుగులు విరజిమ్మే వెండితెర మాటున దాగిన మరో కోణాన్ని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఊహించని విధంగా తారస్థాయికి చేర్చిన స్టార్‌డమ్.. ఒక ట్రెండు కుదుపులతో కుదేలైన కెరీర్.. దీంతో దారుణమైన క్షోభ నటులను ఎలా వెంటాడుతుందో అనేందుకు ఉదయ్‌కిరణ్ ఉదంతమే నిదర్శనం. సినిమాల్లో నటించినా, సాంకేతిక ఇతర విభాగంలో పని చేసినా.. అందులో సక్సెస్ అయితే స్టార్ స్టేటస్ వచ్చిపడుతోంది.
దీంతోపాటే విలాసవంతమైన జీవితం, ప్రత్యేకమైన ఇమేజ్, హంగూ ఆర్బాటాలు, పేజ్-3 పార్టీలు.. ఇలా ఖరీదైన జీవనశైలి అలవడుతోంది. మరో లోకంలో విహరింపచేస్తున్న ఈ తరహా ఇమేజ్ నుంచి బయటకు రావడం కష్టమే. ఇదిలాగే కొనసాగినంత కాలం ఏ సమస్యా లేదు.. ఎటొచ్చీ సినీ రంగంలో సక్సెస్ రేట్‌లో తేడా వస్తే ఒక్కసారిగా వర్ధమాన తారల కలలన్నీ కల్లలవుతున్నాయి. తీవ్ర డిప్రెషన్‌కు లోనై అందులోంచి బయటపడలేక పోతున్నారు. ఫలితంగా విషాదంతో తమ వెండితెర జీవితానికి వీడ్కోలు పలుకుతున్నారు.
ఇమేజ్ నుంచి బయటపడలేక..
సినీ ప్రపంచంలో ఓసారి ఓ వెలుగు వెలిగిన వారెవరైనా ఫేమ్‌కు బానిసలుగా మారతారు. అది లేకుంటే బతకలేమన్న స్థితికి వచ్చేస్తారు. అందుకోసం దేనికైనా సిద్ధపడతారు. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉందనే వాదన బలంగా ఉంది. వీరి ‘ఆశీర్వాదం’ ఉంటేనే ఆ రంగంలో రాణించడం, లేదంటే అవకాశాల కోసం వెతుక్కోవడం పరిపాటిగా మారింది. ఈ కారణాలతోనూ పలువురు నటులు సర్వం కోల్పోయి తీవ్రమైన నిరాశకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అయితే అర్ధంతరంగా తనువు చాలించడం.. లేదంటే పెడదార్లు పట్టడం చేస్తున్నారు. అవకాశాల కోసం విసిగి వేసారి ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇష్టం దర్శకుడు రాజ్ ఆదిత్య, తాజాగా సినీ హీరో ఉదయ్‌కిరణ్ అర్ధంతరంగా తనువు చాలించిన తీరు అభిమానుల్ని కలచివేసింది.
పరిస్థితులు తల్లకిందులైతే..
వృత్తి నిబద్ధత, నిరాడంబరత, క్రమశిక్షణ... ఇవన్నీ ఒకప్పుడు సినీ రంగ ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ఇది రంగుల ప్రపంచంలోని ఒక కోణం. మరో కోణం చూస్తే... పరిశ్రమలో మనుగడ నీటి మీద బుడగలా మారింది. క్లిక్ అయితే స్టార్‌డమ్, ఇబ్బడి ముబ్బడి సంపాదన.. ఈక్రమంలో తీసుకునే నిర్ణయమే విషాదాలకు కారణమవుతోంది. కొందరు కుటుంబ పోషణతో పాటు బతుకు బండిని ఈడ్చడం సైతం భారంగా మారి, ఆ రంగాన్ని పూర్తిగా వదిలి బయటకు రాలేక జీవితానికి తెర వేసుకుంటుంటే, ఇంకొందరు పెడదారులు పడుతున్నారు.
ఉదాహరణలెన్నో...
నియంత్రణ పదార్థాల జాబితాలో ఉన్న ఎఫిడ్రిన్‌ను అక్రమ రవాణా చేస్తూ సినీ నిర్మాత కామిని వెంకటేశ్వరరావు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు.
కురియన్ టోనీ జాకబ్ అసిస్టెంట్ కెమెరామన్‌గా జీవితం ప్రారంభించి 2006లో హఠాత్తుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తాడు. ‘ఆప్తుడు’ చిత్రానికి పెట్టుబడి పెట్టి నిండా మునిగాడు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహించడం ప్రారంభించి పోలీసులకు చిక్కాడు.
తలనొప్పి మందుల తయారీకి వినియోగించే రసాయనమైన నారాథ్రెఫ్టాన్‌ను బ్రౌన్‌షుగర్‌గా నమ్మించి విక్రయించడానికి ప్రయత్నించిన సినీ నిర్మాత హేమంత్ రామకృష్ణతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ‘యువత’ అనే చిత్రాన్ని నిర్మించి దాదాపు రూ.1.5 కోట్లు నష్టపోయి ఈ బాట పట్టాడు.
పబ్ కల్చర్‌తో విలాసాలకు అలవాటు పడి కొకైన్‌కు బానిసగా మారిన సినీ నటుడు రఘు, భరత్‌లు నైజీరియన్ నుంచి ఆ డ్రగ్ కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఓ వ్యభిచార ముఠాలోని వర్ధమాన తారలు, నిర్వాహకులు సినిమా అవకాశాలు లేకో, నష్టాలతో ఈ బాటలోకి వచ్చిన వారే.
ఇష్టం చిత్ర దర్శకుడు రాజ్ ఆదిత్య సైతం తీవ్ర మానసిక వేదనతోనే సికింద్రాబాద్‌లోని హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
మనసంతా వ్యధే!
Published Tue, Jan 7 2014 4:01 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement