
ఒకే పరీక్ష.. రెండు కటాఫ్ తేదీలా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతలుగా నోటిఫికేషన్ల కారణంగా గ్రూప్-2 జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి తంటా వచ్చి పడింది. ఒకే పరీక్ష రాయనున్నా.. గరిష్ట వయోపరిమితికి మాత్రం రెండు కటాఫ్ తేదీలు వర్తించనున్నాయి. దీంతో ప్రధాన (2015 డిసెంబర్ 30న జారీ చేసిన) నోటిఫికేషన్‌కు అర్హులైన వేల మంది జనరల్ అభ్యర్థులు ఈనెల 1న జారీ చేసిన అనుబంధ నోటిఫికేషన్‌కు అనర్హులవుతున్నారు. దీంతో తమకు అనుబంధ నోటిఫికేషన్‌లోని 593 పోస్టులకు కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండింటికి ఒకేసారి, ఒకే పరీక్ష నిర్వహిస్తున్నందున... గరిష్ట వయోపరిమితి కటాఫ్ తేదీని ప్రధాన నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా 2015 జూలై 1వ తేదీనే వర్తింపజేయాలని కోరుతున్నారు.
వయో పరిమితి తంటాలు..
439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో జనరల్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 2015 జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా, ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు మాత్రం 28 ఏళ్లుగా పేర్కొంది. రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా వీటికి అదనంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో 5.65 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టులు తక్కువగా ఉండటం, భారీగా దరఖాస్తులు రావడంతో పోస్టుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఆ పరీక్షలను వాయిదా వేయించింది. ఈ మేరకు ఇటీవల మరో 593 పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఈ రెండు నోటిఫికేషన్లలోని 1,032 పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో ఒకేసారి పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మొదటి నోటిఫికేషన్‌లోని పోస్టులకు వయోపరిమితి లెక్కింపు గడువు 2015 జూలై 1 కాగా.. అనుబంధ నోటిఫికేషన్ పోస్టులకు మాత్రం వయో పరిమితి లెక్కింపు గడువు 2016 జూలై 1 కావడం గమనార్హం. దీంతో 2015 జూలై 2వ తేదీ తర్వాత గరిష్ట వయో పరిమితి పరిధి దాటిన వేలాది మంది అభ్యర్థులు అదనపు పోస్టులకు అనర్హులవుతున్నారు. గరిష్ట వయో పరిమితి కటాఫ్ తేదీని అనుబంధ నోటిఫికేషన్‌కు కూడా 2015 జూలై 1వ తేదీగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.