భారీ తగ్గింపు అంటూ తరచూ విమాన సంస్థల ఆఫర్లు
- రూ.11 కే, రూ.12 కే టికెట్ అని ఊదరగొడుతూ ప్రచారం
- వాస్తవంగా ధర తగ్గించేది బేస్ చార్జీలపైనే
- పన్నులు, ఫీజులు, సెస్సులు, ఇతర చార్జీలు మామూలే
- ఆ కాస్త తగ్గింపు కోసమూ సవాలక్ష షరతులు
- ‘యాడ్– ఆన్’సేవల పేరిట భారీగా వడ్డింపులు
- ఇంటర్‌నెట్ చార్జీలంటూ మరో దోపిడీ
- ఆఫ్ సీజన్‌లో.. అదీ నెల ముందే బుక్ చేసుకోవాలి
- ఇలా బుక్ చేసుకుంటే ఎప్పుడైనా తక్కువ ధరే
విమాన టికెట్ ధర 11 రూపాయలే.. ఇది ఓ సంస్థ ఆఫర్. మా దగ్గర టికెట్ కొంటే 12 రూపాయలు మాత్రమే. ఇది మరో ఎయిర్ లైన్స్ ప్రకటన. ఇలాంటి ఆఫర్లకు విస్తృత ప్రచారం కల్పిస్తూ.. విమాన టికెట్లు ఉచితంగా ఇచ్చేస్తున్నారన్న స్థాయిలో పలు మీడియా సంస్థలు ఊదరగొట్టేశాయి కూడా. మరి ఈ ఆఫర్లతో ప్రయాణికులకు ఒరిగిందేమిటి? నిజంగానే 11 రూపాయలకో, 12 రూపాయలకో టికెట్లు దొరికాయా? కావాల్సిన రూట్లలో నిజంగానే చౌక టికెట్లున్నాయా? ఒకవైపు ప్రయాణం సరే! మరి రెండోవైపు సంగతేమిటి? అసలు మామూలు సమయాల్లోకన్నా ఎంత చౌకగా టికెట్లు దొరికాయి? ఇవన్నీ పరిశీలిస్తే ఇలాంటి ఆఫర్లన్నీ ఉత్తవేనని స్పష్టమవుతోంది. మరి ఇలాంటి ఆఫర్ల గుట్టు విప్పడంతోపాటు అసలు విమాన టికెట్లు చౌకగా పొందాలంటే ఏం చేయాలనే అంశంపై ఈ వారం ఫోకస్..
– సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర ఎంత? ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. టికెట్ ధర ప్రధానంగా మనం తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది. వారం రోజుల ముందు బుక్ చేస్తే.. అన్నీ (టికెట్ ధర, పన్నులు, ఇతరత్రా) కలిపి టికెట్ ధర రూ.2,500–3,000 మధ్య ఉండొచ్చు. అదే ఓ నెల తరవాత ప్రయాణిద్దామని ముందే బుక్ చేసుకుంటే రూ.1,500– 2,000 మధ్య ధరకే టికెట్ లభించొచ్చు. అదే రేపే ప్రయాణించాల్సి వచ్చి ఇవ్వాళ టికెట్ బుక్ చేసుకుంటే.. రూ.4,000 నుంచి రూ.9,000 వరకు ఎంతైనా చెల్లించాల్సి రావొచ్చు. ఇదీ విమాన టికెట్ల ధర తీరు. మరి ఆఫర్ల సమయంలోనూ దాదాపు ఇవే ధరలు వర్తిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇతర చార్జీలు, పన్నులే అధికం..
ఏ విమానయాన సంస్థ ఎంత ఆఫరు ప్రకటించినా.. అది వర్తించేది కేవలం బేస్‌చార్జీలకే. నిజానికి విమాన టికెట్ల ధరలో ఇతర చార్జీలు, పన్నుల శాతమే ఎక్కువ. ఉదాహరణకు రూ.2,500 టికెట్‌లో బేస్‌చార్జీ కేవలం రూ.1,000 వరకే ఉంటుంది. అదే రూ.1,200 టికెట్‌లో అయితే ఈ బేస్‌చార్జీ కేవలం రూ.300గానే ఉంటుంది. మిగిలినవన్నీ పన్నులు, సెస్సులు, విమానాశ్రయాలు వసూలు చేసే యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలు, క్యూట్ ఫీజు వంటివే. ఇవి ఏ ఆఫర్ సమయంలోనైనా తప్పనిసరిగా ఉంటాయి. ఇక బేస్‌చార్జీని తగ్గించే విమానయాన సంస్థలు.. ఒక్కోసారి ఆ తగ్గించిన మొత్తాన్ని ఎయిర్‌లైన్స్ ఫీజు పేరిట వసూలు చేస్తుండటం గమనార్హం.
‘యాడ్–ఆన్’ఎప్పుడూ మోతే!
చౌక విమానయాన సంçస్థలన్నీ ఈ మధ్య టికెట్లపై అదనంగా వసూలు చేయడంలో కొత్త మార్గాలు అవలంబిస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే రకరకాల సేవలను చూపిస్తూ.. అవి కావాలనుకుంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి.
► ఆహార పానీయాలు నేరుగా విమానంలో కొనుక్కుంటే ధర ఎక్కువే. అదే ముందే బుక్ చేసుకుంటే కాస్త తక్కువ. ఈ తక్కువ కూడా విమానంలోని చార్జీలతో పోలిస్తే మాత్రమే!
► టికెట్ తీసుకున్నాక ఎలాగూ ఓ సీటిస్తారు. కానీ మంచి సీటు కావాలంటే ముందే అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ విండో దగ్గర, మొదటి రెండు వరసల్లో కాళ్లు చాపుకోవటానికి కాస్త ఎక్కువ స్థలమున్న చోట్లు.. ఇలాంటి వాటికి రూ.300–600 మధ్య అదనంగా వసూలు చేస్తున్నాయి.
► తీసుకున్న టికెట్ తేదీని మార్చుకోవాలన్నా, రద్దు చేసుకుంటే కాస్త ఎక్కువ డబ్బులు రిఫండ్ రావాలన్నా.. అందుకోసం ముందే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
► బ్యాగేజీకు కూడా చార్జీలు అదనమే. తీసుకెళ్లే లగేజీ బరువును బట్టి రూ.500–1,500 మధ్య వసూలు చేస్తున్నాయి.
► మరీ చిత్రమైన సేవ కూడా ఒకటి ఉంది. విమానాశ్రయంలో టికెట్ కోసం లైన్‌లో నిల్చోకుండా నేరుగా వెళ్లిపోవాలనుకుంటే.. ‘ఫాస్ట్ ఫార్వర్డ్’సేవలు ఉంటాయి. దీనికి రూ.400 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ను ఎంచుకున్న కొద్దిమంది కూడా అక్కడ లైన్లో ఉంటారు సుమా!!
► ఒకవేళ విమానం ఆలస్యం కావటమో, మీరు కాస్త ముందుగా విమానాశ్రయానికి చేరుకోవటమో జరిగితే.. అక్కడ కాస్త విశ్రాంతిగా లాంజ్‌లో కూర్చోవటానికి రూ.600 వరకూ ముందే చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆ సేవల్ని ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకున్నా ఒకసారి చెల్లిస్తే అంతే.
► ఇక విమానం ఆలస్యమైనా, రద్దయినా, బ్యాగేజీ పోయినా, ఇతరత్రా ప్రమాదాలేవైనా జరిగినా ఆదుకోవటానికంటూ ట్రావెల్ బీమా ఉంటుంది. దానికీ అదనపు చార్జీలు చెల్లించాల్సిందే.
ఇదీ విమానయాన సంస్థల ఆఫర్ల కథ. ఇన్ని కూడికలు, తీసివేతలు చేశాక నిజంగా ఆఫర్లో మిగిలేదెంత? మామూలు సమయాలకన్నా ఈ సమయంలోనే బుక్ చేస్తే లాభమెంత? పరిశీలిస్తే వాస్తవమేమిటో తెలిసిపోతుంది. గంటలోపు ప్రయాణానికి రూ.2,500 ధర మించకూడదని చెప్పే రెగ్యులేటర్లు ఇలాంటివి ఎందుకు చూడటం లేదన్న సందేహమూ రాకమానదు.
బాబోయ్ కన్వీనియెన్స్ చార్జీలు
కన్వీనియెన్స్ చార్జీలు, ఇంటర్‌నెట్ చార్జీలు... ఇలా ఏ పేరుతో పిలిచినా టికెట్ల బుకింగ్ సమయంలో చివరన ఈ చార్జీల మోత తప్పదు. నిజానికి ఇప్పుడు విమాన టికెట్లను బుక్ చేయాలంటే ఎవరైనా ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించాల్సిందే. ట్రావెల్ ఏజెంట్ల దగ్గరకు వెళితే వారు చేసేది కూడా అదే. ఎక్కడో ఉన్న విమానయాన సంస్థల కౌంటర్లకు వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలని ఎవరూ చూడటం లేదు కూడా. కానీ ఇంటర్‌నెట్ ద్వారా బుక్ చేసేటపుడు విమానయాన సంస్థల చార్జీలు, పన్నులు ఒక ఎత్తయితే... చివరగా జతయ్యే ఇంటర్‌నెట్ చార్జీలు మరో ఎత్తు. నేరుగా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ నుంచో, వాలెట్ నుంచో, డెబిట్‌కార్డు నుంచో చెల్లిస్తే ప్రతి ప్రయాణికుడికి రూ.150 చొప్పున వడ్డిస్తున్నారు. అదే క్రెడిట్ కార్డు అయితే మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి ఇంటర్‌నెట్ చార్జీలనేవి ఒక టికెట్‌కు ఇంత చొప్పున వసూలు చేస్తే బాగానే ఉంటుందనుకోవచ్చు. కానీ ఒకేసారి ఆరుగురికి టికెట్ బుక్ చేస్తే.. ప్రతి ప్రయాణికుడికి రూ.150 చొప్పున రూ.900 బాదేయటం దారుణమని చెప్పవచ్చు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం మొత్తుకుంటుంటే... మరోవైపు డిజిటల్ చెల్లింపులకు ఈ స్థాయిలో వసూళ్లు చేయటం విమానయాన సంస్థలకే చెల్లింది.
చౌక టికెట్లు దొరికేదెలా?
ఆఫర్ ఉన్నా లేకున్నా విమాన టికెట్లు కాస్త చౌకగా పొందాలంటే కొన్ని మార్గాలున్నాయి. ఆఫీసుల తరఫున కాకుండా వ్యక్తిగతంగా తరచూ ప్రయాణాలు చేసేవారు చాలామంది వాటిని పాటిస్తుంటారు. అవేంటో ఒకసారి చూద్దాం..
ముందే బుక్ చేసుకోవాలి
టికెట్లు ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత మంచిది. కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లు పొందొచ్చు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో డిమాండ్ ఎక్కువ గనుక ఆ రోజుల్లో ధరల తగ్గింపులకు అవకాశాలు తక్కువ.
వ్యాలెట్ ద్వారా చెల్లిస్తే డిస్కౌంట్!
గో–ఐబిబో, యాత్రా, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ సంస్థలన్నీ ఇపుడు వర్చువల్ వ్యాలెట్లను నిర్వహిస్తున్నాయి. వీటి లో నగదును లోడ్ చేసుకుని.. వాటి ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే కొంత క్యాష్‌బ్యాక్ ఇస్తున్నాయి. అలా ఆయా వ్యాలెట్ల లోకి వచ్చిన క్యాష్‌బ్యాక్‌ను మరో టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక్సిగో అయితే యాప్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని సిట్రస్ వ్యాలెట్‌కు బదిలీ చేస్తోంది. పేటీఎం, మొబిక్విక్ వంటివి తమ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ ఇస్తున్నాయి.
సమయాన్ని బట్టి చార్జీలు!
అర్ధరాత్రి దాటాకో, లేకపోతే తెల్లవారు జామునో ప్రయాణించటానికి ఇబ్బంది లేకపోతే తక్కువ ధరకు విమాన టికెట్లను పొందే అవకాశాలుంటాయి. అత్యవసరంగా ఫలానా సమయానికి చేరుకోవాలని అనుకునేవారికి ఇది కుదరకపోవచ్చు. మిగతా వారికి ధర తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
బ్యాంకు కార్డులూ డిస్కౌంట్ ఇస్తాయి
పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై తరచూ ఆఫర్లు ఇస్తుంటాయి. మీ దగ్గరున్న కార్డుపై వచ్చే ఆఫర్ల గురించి కాస్త గూగుల్‌లో సెర్చ్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు. మేక్ మై ట్రిప్, యాత్రా డాట్‌కామ్ వంటి పోర్టళ్లలోనూ ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. వాటికి మీరు అర్హులైతే సదరు డిస్కౌంట్ కోడ్‌ను టికెట్ బుక్ చేసే సమయంలో వినియోగించుకోవాలి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అయితే జెట్ ఎయిర్‌వేస్‌తో కలసి విమానయాన ప్రయాణికులకు ప్రత్యేక క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. తరచూ ప్రయాణించేవారు.. విమానయాన సంస్థలతో కలసి బ్యాంకులు అందించే ప్రత్యేక క్రెడిట్ కార్డులు తీసుకుంటే లాభమన్నది నిపుణుల మాట.
మొబైల్ యాప్‌లూ ఉన్నాయి
వెబ్‌సైట్ల నుంచి కాకుండా ఎక్కువ సంస్థలు యాప్స్ ద్వారా చేసే బుకింగ్‌లపై తరచు ఆఫర్లు ఇస్తున్నాయి. కనీసం 5 నుంచి 10 శాతం తగ్గింపు అయినా పొందడానికి వీలుంటుంది. ఇంకా రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆహార పదార్థాలపై తగ్గింపులకు అవకాశం ఉంటుంది.
నేరుగా ఎయిర్‌లైన్ సైట్ల నుంచి..
టికెట్ల బుకింగ్‌కు మధ్యవర్తులుగా ఉన్న పేటీఎం, మేక్‌మై ట్రిప్, ఇక్సిగో, ఎక్స్‌పీడియా, గోఐబిబో, యాత్రా వంటి సంస్థల నుంచి ఆఫర్లు లేవనుకుంటే ఎయిర్‌లైన్ సంస్థల వెబ్‌సైట్లు పరిశీలించాలి. మధ్యవర్తిత్వ సేవలందించే సంస్థలకు టికెట్ల బుకింగ్‌పై విమానయాన సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా వాటి సైట్ల నుంచి బుక్ చేసుకుంటున్నందున కొంత తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది.
డైనమిక్ ప్రైసింగ్... జాగ్రత్త!
డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ల ధరలను పెంచే విధానాన్ని ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్నాయి. ఓ వ్యక్తి ఫలానా తేదీ, ఫలానా సమయానికి టికెట్ల బుకింగ్ కోసం నాలుగైదు వెబ్‌సైట్లలో సెర్చ్ చేశారనుకోండి. ఆ వివరాలు కుకీల ద్వారా ఆయా సంస్థలకు తెలిసిపోతాయి. దీంతో బుకింగ్‌కు వచ్చే సరికి ధర పెరిగిపో తుంది. అందుకే వీలయితే వెబ్‌సైట్ ద్వారా సెర్చ్ చేసేటపుడు ఇన్‌కాగ్నిటో (రహస్య) మోడ్‌లో ఉండి సెర్చ్ చేయండి.
టికెట్లన్నీ ఒకే సంస్థ ద్వారా కాకుండా..
ప్రయాణం, తిరుగు ప్రయాణం టికెట్లను ఒకే సంస్థ ద్వారా బుక్ చేసుకుంటే చాలా సందర్భాల్లో తగ్గింపు ప్రయోజనాలుండవు. పైగా రెండు వైపులా టికెట్లను ఒకే లావాదేవీగా బుక్ చేసుకుంటే తగ్గింపు పరిమితి కూడా ఉంటుంది. అందువల్ల ఆఫర్లున్న రెండు సంస్థలను ఎంచుకుని చెరోవైపు చొప్పున బుక్ చేసుకుంటే లాభం.
► పలు సంస్థలు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు టికెట్లపై 8–10 శాతం తగ్గింపు ఇస్తున్నాయి. స్పైస్‌జెట్ విద్యార్థులకు బేస్ ధరపై 8 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇలాంటివి కొన్ని రూట్లలో, కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
► మీరు కావాలనుకున్న విమాన టికెట్ రేటు బాగా ఎక్కువగా ఉందనుకోండి. ఆ ధరలు తగ్గినప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి గూగుల్ అలర్ట్స్ ఉపయోగపడుతుంది. ధర మారినప్పుడల్లా ఆ వివరాలు ఈమెయిల్‌కు వచ్చేస్తాయి.
► ఆఫర్ల వివరాలు తెలుసుకోవాలంటే ఎయిర్‌ఫేర్ న్యూస్‌లెటర్‌కు సబ్‌స్క్రయిబ్ చేయాలి. దానివల్ల ఎప్పటికప్పుడు ఆఫర్ల వివరాలు మీకు తెలుస్తుంటాయి.
► గోఐబిబో, యాత్రా వంటి సంస్థలు ఎలాంటి నగదు చెల్లించకుండా టికెట్లను ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్నిస్తున్నాయి. ముందు సీట్‌ను బ్లాక్ చేసుకుని తర్వాత చెల్లించే సదుపాయం ఉంది.
ఎంపిక చేసిన రూట్లే ఎందుకు?
విమానయాన సంస్థలు ఏ ఆఫర్ ఇచ్చినా అన్ని మార్గాలకూ ఇవ్వవు. పెద్దగా రద్దీ, డిమాండ్ లేని కొన్ని ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తింపజేస్తాయి. అంటే మనకు కావాల్సిన రూట్లలో ఈ ఆఫర్ టికెట్లు దొరికే అవకాశం తక్కువ. అయితే మనకు కావాల్సిన రూట్లలో దొరికితే టికెట్ తీసుకుని వెళ్లొచ్చు. కానీ కొన్ని సంస్థలు ఒకవైపు ప్రయాణానికే టికెట్ ఆఫర్‌ను వర్తింపజేస్తున్నాయి. అంటే వెళ్లినవారు ఎలాగూ తిరిగి రావాలి గనక... రెండోవైపు టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ అన్నమాట.
ఎంపిక చేసిన తేదీల్లోనే..
సహజంగా విమాన సంస్థలు రద్దీ లేని సమయాల్లోనే ఆఫర్లు ఇస్తుంటాయి. ఉదాహరణకు 10 రోజుల కింద స్‌పైస్‌జెట్, ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించినా.. ఆ ఆఫర్ వర్తించేది మాత్రం జూన్ 26 తరవాతేనని పేర్కొన్నాయి. కానీ టికెట్ల బుకింగ్ మాత్రం మే నెలాఖరులోగానే చేసుకోవాలి. అంటే ప్రయాణ సమయానికి వేసవి సెలవులన్నీ అయిపోతాయి. అప్పుడు ప్రయాణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి... అన్ సీజన్లో తమ విమానాలు నిండుగా ఉండటానికి విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. అంతేగాకుండా ఈ ఆఫర్ల కింద బుక్ చేసుకునే సమయానికి, ప్రయాణించే సమయానికి మధ్య దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈ లెక్కన మామూలు సమయాల్లోనూ మనం నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే.. రెండు మూడు వందల తేడాతో దాదాపు ఇదే ధరకు టికెట్లు దొరుకుతాయన్నది వాస్తవం. అలాచేస్తే టికెట్ దొరికిందని ప్రయాణం పెట్టుకోకుండా.. మనకు కావాల్సినపుడు ప్రయాణం చేసినట్లవుతుంది.
షరతులు... షరా మామూలే!
ఆఫర్ల సమయంలో తీసుకునే టికెట్లపై కొన్ని షరతులు తప్పనిసరి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
► ఈ టికెట్లను రద్దు చేసుకోవడంగానీ, తేదీ మార్చుకోవటం కానీ చేయలేం. ఆ సమయంలో మనకు వేరే ఏదైనా అత్యవసరమైన పని ఉండి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. మొత్తం టికెట్ డబ్బులకు నీళ్లొదులుకోవాల్సిందే. అయితే ఆఫర్ల సమయంలోనే కాదు. మామూలు సమయాల్లో కూడా కాస్త తక్కువ ధరకు లభించే టికెట్లన్నీ ఈ షరతుకు లోబడే ఉంటాయి. అయితే టికెట్ రద్దు చేసుకుంటే.. ప్రయాణ తేదీలోగా ఒకవేళ ఆ టికెట్ భర్తీ కాకపోతే విమానయాన సంస్థలు చార్జీలను మాత్రమే నష్టపోతాయి. కానీ పన్నులు, యూడీఎఫ్, సెస్సులు వంటి వాటిని కూడా రిఫండ్ చేయరు. ఇదొక రకమైన దోపిడీయే.
► ఈ ఆఫర్లలో లగేజీ/బ్యాగేజీలకు కూడా పరిమితులుంటాయి. చాలా ఆఫర్లు హ్యాండ్ బ్యాగేజ్‌కు మాత్రమే వర్తిస్తున్నాయి. కాస్త లగేజీ పట్టుకెళ్లినా.. దానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిందే.