పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 14 నుంచి ఒకేషనల్, 17 నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 14 నుంచి ఒకేషనల్, 17 నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ప్రారంభం కానున్న వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు పది సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 162 మంది విద్యార్థులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ పరీక్షలకు హాజరుకానున్నారు.
యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ: నగరంలోని ట్రాఫిక్‌రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. నిర్థేశిత సమయం 9.35కి నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హైదారాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ స్పష్టం చేశారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే విద్యార్థులను కూడా లోపలికి అనుమతించబోమని తెలిపారు. పరీక్షహాల్‌లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్‌లు అనుమతించమని తెలిపారు. అత్యవసరమైతే డ్యూటీలో ఉన్న పోలీసుల వద్ద ఉన్న ఫోన్‌లను వాడుకోవచ్చని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాలు, ఇతర సమస్యలపై 040-65537350 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
వెయ్యి ప్రత్యేక బస్సులు: పదో తరగతి పరీక్షల కోసం ఆయా రూట్లలో 1000 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపించి బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఉదయం ఏడు గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు, తిరిగి మధ్యాహ్నం ఇళ్లకు చేరేందుకు కూడా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులపై ఎస్‌ఎస్‌సీ ఎగ్జామినేషన్స్ అనే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం 9959226160/ 9959226154 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఆటంకం లేకుండా కరెంటు సరఫరా: పరీక్ష సమయంలో అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్తితుల్లోనూ కరెంట్ సరఫరా నిలిపివేయవద్దని ఆయా సర్కిళ్ల ఇంజనీర్లకు డిస్కం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో రాత్రిపూట విద్యార్థులు చదుకునే అవకాశం ఉండటంతో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.