‘మేడిగడ్డ’కు రూ.5,813 కోట్లు
మూడు బ్యారేజీల నిర్మాణానికి నిధుల కేటాయింపు..ఉత్తర్వులు జారీ
మహారాష్ట్రతో పక్షంలోగా ఒప్పందం!
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద చేపట్టనున్న మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీలకు రూ.5,813 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో మేడిగడ్డ బ్యారేజీకి రూ. 2,591 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,785 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి రూ. 1,437 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ బ్యారేజీలను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నిధులతో కేవలం బ్యారేజీలు, గేట్ల నిర్మాణం మాత్రమే చేపట్టనున్నారు. పంప్‌హౌస్, మోటార్లు వంటి సివిల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ పనులకు సంబంధించి విడిగా అంచనాలు తయారు కానున్నాయి. వీటి నిర్మాణానికి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిన అధికారులు ప్రస్తుతం తుది అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మూడు బ్యారేజీలను మూడు ప్యాకేజీలుగా పరిగణిస్తూ అధికారులు విడివిడిగా వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. కాగా, మేడిగడ్డపై మహారాష్ట్ర ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన వెంటనే ఒప్పందాలపై ఇరు రాష్ట్రాలు సంతకాలు చేయనున్నాయి. ఈ ప్రక్రియ మరో 10-15 రోజుల్లోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.