కాపు జాతిని అవమానపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : కాపు జాతిని అవమానపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపుల అభ్యున్నతి కోసం వేసిన మంజునాథ్ కమిషన్ ఏమైందో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. నాలుగు మాసాలు గడిచిన కాపు రిజర్వేషన్లపై అతి గతీ లేదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...కనీసం వంద కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు.
కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రన్న పేరు పెట్టి కాపు జాతిని అవమానపరుస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఆయన అభద్రతా భావనతో ఉన్నారని, అందుకే బతికుండగానే అన్ని పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రన్న కాపు భవనాలు అంటూ పేర్లు పెట్టుకోవటం శోచనీయమన్నారు. ఇప్పటివరకూ కాపులకు ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.