అంగన్‌వాడీ, ఆశాలు అనర్హులు
‘ఒంటరి మహిళ భృతి’ సందేహాలపై
స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థిక భృతిని పొందేందుకు అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీక రణ, పరిశీలన సందర్భంగా వ్యక్తమవుతున్న సందేహాలకు సెర్ప్ అధికారులు స్పష్టత ఇచ్చారు. వీరందరికీ వార్షికాదాయం నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, గతంలో జారీచేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నం 17) మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు (హోంగార్డులు సహా) ఆర్థిక భృతిని పొందేందుకు అర్హులు కారని పేర్కొన్నారు.
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఒంటరి మహిళలుగా ఆర్థిక భృతిని పొందేందుకు అనర్హులని, తక్కువ వేతనంతో పనిచేస్తున్న సీనియర్ మేట్‌లు మాత్రమే అర్హులని తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ.. తదితర (గౌరవ వేతనం పొందుతున్న) ప్రజాప్రతి నిధులు అర్హులు కారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన పిల్లలున్న మహిళల కుటుంబ ఆదాయం పరిమితికి లోపు ఉన్నట్లయితే ఆర్థిక భృతి పొందేందుకు అర్హులే. అభయ హస్తం పింఛన్ పొందుతున్న ఒంటరి మహిళలు, దాన్ని కాదనుకుని ఆర్థిక భృతి పొందే విషయంలో మాత్రం సెర్ప్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.