అవిశ్వాసంపై ఈరోజే చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సోమవారమే అసెంబ్లీలో చర్చించనున్నారు. ఏడు గంటల పాటు ఈ తీర్మానంపై చర్చ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం విధాన ప్రకటనలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు మీడియా పాయింట్‌లో ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చించాలన్న అంశాన్ని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను అధికార పక్షం ఘోరంగా విఫలమైందంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు. దీనికి తగినంత మంది సభ్యుల మద్దతు లభించడంతో చర్చను చేపట్టేందుకు అనుమతి లభించినట్లయింది. బీఏసీ సమావేశంలో ఈ అంశం గురించి చర్చించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం జరిగిన బీఏసీ భేటీలో.. అవిశ్వాసంపై సోమవారమే చర్చించాలని నిర్ణయించారు.