ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
► గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్
► కొత్త సచివాలయ నిర్మాణం దృష్ట్యా తరలింపు
► పత్యామ్నాయ ఆవాసం కల్పిస్తామంటూ సీఎస్ లేఖ
► తాత్కాలిక సచివాలయంగా బూర్గుల భవన్?
► శాఖల తరలింపునకు మరిన్ని భవనాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణంపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించారు. కొత్త సచివాలయాన్ని ప్రస్తుతమున్న చోటే నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. సచివాలయ నిర్మాణంతో పాటు భూ సేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పైనా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన సౌలభ్యానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితరాలపైనా చర్చ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి నవంబర్‌లో పునాది రాయి వేయాలని సీఎం భావిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కార్యాలయాలన్నిటినీ తాత్కాలికంగా మరో చోటికి తరలించటం అనివార్యమైంది. ఇదే ప్రాంగణంలో ఏపీకి చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి.
కొత్త నిర్మాణానికి వీలుగా వాటిని సైతం ఖాళీ చేయించాలని, వాటికి తాత్కాలికంగా మరో చోట వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే ఇది విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ముందస్తుగా విషయాన్ని గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని ప్రతిపాదిస్తూతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతమున్న జీవోలకు బదులు చట్టం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది.
ప్రత్యామ్నాయ భవనాల పరిశీలన
సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం సచివాలయానికి దగ్గరగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను పరిశీలించారు. సీఎం కార్యాలయంతో పాటు కీలక విభాగాలను ఇందులోకి మార్చే అవకాశాలను సమీక్షించారు. దీంతోపాటు అరణ్య భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయం, జలసౌధ, హిమాయత్‌నగర్‌లోని గృహ నిర్మాణ శాఖ భవన్‌లోకి సంబంధిత శాఖలను తరలించాలని నిర్ణయించారు. మిగతా శాఖల కార్యాలయాలను బీఆర్‌కే భవన్‌లోని ఏయే బ్లాక్‌లకు తరలించాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు.