
ఆస్తులున్నా.. ‘లెక్కే’లేదు
- ‘గ్రేటర్’ నిర్లక్ష్యం
- ఆస్తుల వివరాలు లేవు
- సిబ్బంది ఇష్టారాజ్యం
- కార్పొరేషన్‌కు టోపీ
‘నాక్కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉంది...’ ఆ మధ్య హిట్టైన సిన్మాలో హీరో పాపులర్ డైలాగ్ ఇది. సరదాకే అన్నా తిక్కకూ ఓ లెక్క ఉందన్నది ఆ హీరో వాదన. ఘనత వహించిన మన జీహెచ్‌ఎంసీ వద్ద అసలు దేనికీ లెక్కే లేదు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, చెరువులు, పార్కులు, హోర్డింగ్‌లు, శ్మశానవాటికలు.. వెరసి తమకెన్ని ఆస్తులున్నాయో తెలీదు. ఈ దుస్థితిపై ఎవరన్నా ఏమన్నా అంటారన్న భయం అంతకన్నా లేదు. ఉన్నదేమైనా ఉందంటే.. అది లెక్కలేనితనమే.
సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు అవసరమైన రహదారులు, పారిశుధ్యం తదితర సేవలెన్నో అందించడంతోపాటు ఇంటి నిర్మాణం జరపాలన్నా, వ్యాపార సంస్థలకు లెసైన్సులివ్వాలన్నా, ఐదంతస్తుల్లోపు ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎన్‌ఓసీ ఇవ్వాలన్నా జీహెచ్‌ఎంసీకే అధికారం ఉంది. అంతేకాదు.. తనకున్న ఎన్నో షాపింగ్ కాంప్లెక్సుల్లోని ఎన్నో దుకాణాల్ని ఎందరికో అద్దెలకిచ్చింది. ఇన్ని ఆస్తులు, బాధ్యతలున్న జీహెచ్‌ఎంసీ వద్ద వాటికి సంబంధించిన వివరాలన్నీ ఉండాలి. కానీ.. కార్పొరేషన్‌లో ఏ ఒక్కదానికీ లెక్కాపత్రం ఏమీ లేదు. ఆటస్థలాలు ఎన్ని కబ్జా అయ్యాయో తెలియదు! పార్కు స్థలాలు ఎన్ని పరాధీనమయ్యాయో రికార్డుల్లేవు.
ఏయే శ్మశానవాటికల్లో ఎవరు తిష్ట వేశారో లెక్కల్లేవు! ఎన్ని మార్కెట్లలో ఎవరుంటున్నారో.. ఏ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎవరికి దుకాణాలు కేటాయించారో.. వాటిల్లో ఎవరుంటున్నారో సమాచారం లేదు!! లీజు పొందిన స్థలాలు, భవనాల్లో ఎందరు లీజు సొమ్ము చెల్లిస్తున్నారో.. ఎవరెంత చెల్లించారో కూడా తెలియదంటే తెలియదు. ఎన్ని బహిరంగ ప్రదేశాలున్నాయో.. ఎన్ని భవనాలకు అనుమతులిచ్చారో.. ఎన్ని అక్రమ భవనాలు వెలిశాయో కూడా వివరాలు లేవు. నగరంలో తాను వేసిన రోడ్లు ఎన్ని ఉన్నాయో.. వేటిని ఎవరు పర్యవేక్షించాలో కనీస సమాచారం కూడా ఇంతవరకూ లేదు. ఆస్తిపన్ను వసూళ్లు తదితరమైన వాటిదీ అదే దారి! ఇలా చెప్పుకుంటూ పోతే.. జీహెచ్‌ఎంసీకి తెలియని జాబితా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తీరు !
సిబ్బంది ఇష్టారాజ్యం
ఆస్తులకు సంబంధించి.. రావాల్సిన ఫీజులు, పన్నులకు సంబంధించి సరైన లెక్కలంటూ ఉంటే లోపాలెక్కడున్నాయో తెలుసుకోవచ్చు.
వివరాలే లేనప్పుడు ఎవరెంత దోచుకున్నా గుర్తించడం తరం కాదు. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్నదదే.
రికార్డులు లేని పరిస్థితిని ఆసరా చేసుకున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా సొంత వసూళ్లకు పాల్పడుతున్నారు.
దీనికితోడు అధికారుల అంతులేని నిర్లక్ష్యమూ ఇబ్బందికరంగా మారింది.
ఆయా ప్రాంతాల్లోని అక్రమాలపై ప్రజలు సమాచారమిస్తున్నా చర్యలు లేవు.
కబ్జాపాలవుతున్న చెరువులు, పార్కులపై సమాచారమిచ్చినా పట్టించుకోరు.
దొంగ రసీదులతో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు.
ముడుపులు పుచ్చుకొని ప్లింత్ ఏరియాను తక్కువ చూపుతూ జీహెచ్‌ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు.
ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలో ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలను తక్కువ విస్తీర్ణంలో చూపుతూ ప్రైవేటు వ్యక్తులకు సాయపడుతున్నారు.
అందుకుగాను వారిచ్చే ముడుపులతో లాభపడుతున్నారు.
జీహెచ్‌ఎంసీలోని కొన్ని విభాగాలను పరిశీలించినా దాని పనితీరు ఎలా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఎన్ని విద్యాసంస్థలకు, ఎన్ని ప్రార్థనా మందిరాలకు ఆస్తిపన్నులో మినహాయింపు ఉందో తెలపాల్సిందిగా కోరినా.. ఏ సర్కిల్/జోన్‌లో ఎన్ని భవనాలకు అనుమతిచ్చారో తెలపాలని ఆర్టీఐల ద్వారా కోరినా సమాధానం లేదు.
చెరువుల లెక్కల్లేవు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో.. వాటిల్లో వేటి ఎఫ్‌టీఎల్ ఎంతో.. ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో కచ్చితమైన సమాచారం లేదు.
తొలుత 178 చెరువులున్నాయన్నారు. అనంతరం వాటిని 168గా తగ్గించి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో 126కు మించి కనిపించడం లేవని చెబుతున్నారు.
చెరువుల భూములు కబ్జా కాకుండా ఎఫ్‌టీఎల్ నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, ఆ పని పూర్తికాకముందే ఆయా చెరువులకు ఫెన్సింగ్ పేరిట రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే అడ్డగోలుగా పనులు చేస్తున్నారు.
ప్రకటనలపైనా పట్టింపు లేదు
గ్రేటర్‌లోని ప్రకటనల ఆదాయం మొత్తం జీహెచ్‌ఎంసీకే చెందాల్సి ఉండగా.. నగరంలో ఎన్ని హోర్డింగులున్నాయో వివరాల్లేవు.
ఆదాయం వచ్చే ప్రకటనల్లో ముఖ్యమైనవి.. హోర్డింగులు, నియాన్/ గ్లో సైన్‌బోర్డులు, ఆర్చిలు, గోడలపై పెయింటింగ్‌లు, ఫ్లెక్సీబోర్డులు, గ్లాస్ పోస్టర్లు, షాప్ షట్టర్లు, లాలీపాప్స్, బస్‌షెల్టర్లు, బెలూన్లు.
వీటిద్వారా ఏటా రూ. 100 కోట్ల మేర ఆదాయం రావాలి.
కానీ చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో రూ.25 కోట్లు కూడా వసూలు కావడం లేదు.
ఏదీ ఫైర్‌సేఫ్టీ ?
ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే జీహెచ్‌ఎంసీ.. తర్వాత ఆ విషయం మరచిపోతుంది.
ఫైర్‌సేఫ్టీ లేని సంస్థల లెసైన్సులు రద్దు చేస్తామని మూడేళ్లుగా చెబుతున్నప్పటికీ ఫైర్‌సేఫ్టీ లేని సంస్థలు నగరవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో సమాచారమే లేదు.
ఆయా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హూంకరింపులు తప్ప.. ఆపై చర్యలు లేవు.
ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ టింబర్‌డిపోలు ఏర్పాటైనట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, పాఠశాలల సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆస్పత్రుల సమాచారం కోసం ‘అప్నా’కు, సినీ సంస్థలకు సంబంధించిన సమాచారం కోసం ఫిల్మ్‌చాంబర్‌కు లేఖలు రాశారు.
2009 నుంచి ఈ విభాగం పని ప్రారంభించినప్పటికీ , కావాల్సిన సమాచారాన్నే ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది.
ఏవీ లేవు..
టౌన్‌ప్లానింగ్
ఎన్ని భవనాలకు అనుమతులున్నాయో డేటా బేస్ లేదు. ఎన్ని సెల్ టవర్లున్నాయో లెక్క లేదు.
శిథిల భవనాలు
సిటీలైట్ హోటల్ ప్రమాదం జరిగినప్పుడు శిథిల భవనాలపై నిద్ర లేచారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు కాకముందు ఎప్పుడో చేసిన గణాంకాలతో 558 శిథిల భవనాలున్నాయన్నారు. సిటీలైట్ ప్రమాదం తర్వాత 737 ఉన్నట్లు చెప్పారు. అంతకన్నా ఎక్కువే ఉంటాయనేది అంచనా. గుర్తించిన శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు.
ఇంజనీరింగ్
ఏ డివిజన్‌లో ఎన్ని కి.మీ.ల మేర రోడ్లున్నాయో.. వాటిమరమ్మతులను పర్యవేక్షించే ఇంజనీర్లెవరో తెలియదు. ఏ రోడ్డును ఎప్పుడు నిర్మించారో తెలియదు. అవి ఎప్పటిదాకా మన్నికగా ఉండాలో తెలియదు. ఏ రోడ్డు కింద ఏ పైపులున్నాయో తెలియదు. గోతులేర్పడ్టప్పుడు మాత్రం హడావుడి చే యడం.. ఆపై మరచిపోవడం పరిపాటిగా మారింది. ఫ్లై ఓవర్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారమూ లేదు.
ఆరోగ్యం, పారిశుధ్యం
ఏయే మార్గాల్లో ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నారో ఇప్పటిదాకా తెలియదు. ఇటీవలే.. ఇందులో సంస్కరణలు ప్రారంభించారు. కొనసాగిస్తారో, అర్ధాంతరంగా ఆపేస్తారో తెలియదు.
ఎస్టేట్స్
ఎస్టేట్స్ విభాగమంటూ ఒకటి ఉన్నప్పటికీ.. ఎన్ని ఆస్తులున్నాయో.. లీజుదార్లెందరో.. అద్దెలెన్ని వస్తున్నాయో, ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో తెలియదు. సాక్షాత్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే.. కార్పొరేషన్‌తో సంబంధం లేనివారు యూనియన్ల పేరిట, అసోసియేషన్ల పేరిట కార్యాలయాలను ఆయాచితంగా వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు.
ట్రేడ్ లెసైన్సులు
ఆదాయ వనురుల్లో ఒకటైన ట్రేడ్ లెసైన్సులకు సంబంధించిన డేటాబేస్ లేకపోవడంతో లెసైన్సులే లేని వ్యాపారసంస్థలెన్నో తెలియదు. లెసైన్సులు పొందాక సక్రమంగా ఫీజులు చెల్లించని వారెందరో.. వారి నుంచి ఎంతమొత్తం రావాలో వివరాల్లేవు. ఏ దుకాణం నుంచి ఎంత ఫీజు వసూలు కావాలో రికార్డుల్లేవు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యం సాగుతోంది.
ఎలక్ట్రికల్ విభాగం
ఏ వీధిలోఎన్ని విద్యుత్ దీపాలు ఎప్పుడు వేసిందీ లెక్కలుండవు. కొత్త బల్బులు వేసినప్పుడు పాత బల్బులనేం చేస్తున్నారో తెలియదు. ఇక ఆయా ప్యాకేజీల్లో ఉండాల్సినంతమంది కార్మికులు విధుల్లో ఉంటున్నదీ లేనిదీ తెలియదు. అంతా అయోమయం.
రవాణా విభాగం
ఇందులో అక్రమాలకు అంతు లేదు. కార్మికుల నుంచి ఇంధనం దాకా, అద్దె వాహనాల నుంచి స్పేర్‌పార్ట్స్ దాకా అంతా అక్రమాలే.
అన్నింటికీ విద్యార్థులే..
ప్రకటనల హోర్డింగుల్ని గుర్తించడం జీహెచ్‌ఎంసీ సిబ్బంది వల్ల కాకపోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు వాటికి సంబంధించిన సర్వే బాధ్యతలు అప్పగించారు. ఫైర్‌సేఫ్టీ లేని భవనాలను గుర్తించే పనినీ, ఇంటినెంబర్లకు సంబంధించిన సర్వే పనిని సైతం వారికే అప్పగించారు. ఏ విభాగంలోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సర్వే వంటి ఏ పని చేయాలన్నా పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్పగించడమో.. ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో చేస్తున్నారు. వాటి ద్వారానైనా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారా అంటే అదీ లేదు. అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ట్రేడ్ లెసైన్సుల కోసం వాణిజ్య సంస్థల సర్వే, ఆస్తిపన్ను వసూళ్లకు భవనాల సర్వేను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అవి ఎంతవరకు పూర్తయిందో తెలియదు.