బెడిసికొట్టిన‘ పులి క్రాసింగ్’
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో కదంబా పులిని క్రాసింగ్ కోసం తెచ్చిన ఎన్‌క్లోజర్ ఇతర వన్యప్రాణుల కోసం నిర్మించిందని జూ పార్కు క్యూరేటర్ గోపిరవి పేర్కొన్నారు. కిందిస్థాయి అధికారులు ఐదు సంవత్సరాల వయస్సున్న పులితో సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూ ఉన్నతాధికారులు బాధ్యులైన వారికి మెమోలను జారీ చేశారు. క్రాసింగ్ కోసం వినియోగించిన ఎన్‌క్లోజర్ వద్ద ఎలాంటి చర్యలు, కనీస నిబంధనలను పాటించలేదు. పులుల కోసం నిబంధనల ప్రకారం అయితే 18 ఫీట్ల ఎత్తు ఎన్‌క్లోజర్ నిర్మించాలి. కానీ కొత్తగా నిర్మించిన ఎన్‌క్లోజర్ ఎత్తు 12 ఫీట్లని జూ అధికారులు పేర్కొంటున్నా... వాస్తవంగా 10 ఫీట్లే ఉన్నట్లు సమాచారం. జూ లోని ఎన్‌క్లోజర్లను కాంట్రాక్టర్ కాకుండా జూ అధికారులే నిర్మిస్తుండటం గమనార్హం.
జూలో డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అసిస్టెంట్ క్యూరేటర్ ఇప్పటికే లక్షలాది రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. కదంబా బయటికి దూకిన ఎన్‌క్లోజర్‌ను గత సంవత్సరం నుంచి నిర్మిస్తున్నారు. చిన్న చిన్న మృగాల కూనల కోసం నిర్మించిన ఈ ఎన్‌క్లోజర్‌లో 5 ఫీట్ల ఎత్తున్న పులితో క్రాసింగ్ చేయిస్తే ఎదురయ్యే పరిస్థితులను కూడా సంబంధిత అధికారులు పరిశీలించకుండా క్రాసింగ్‌కు మొగ్గు చూపారు. పులులతో సత్సంబంధాలు కలిగిన యానిమల్ కీపర్లను వేరే చోటుకు మార్చి అనుభవం లేని యానిమల్ కీపర్లను పులుల ఎన్‌క్లోజర్‌ల వద్ద అసిస్టెంట్ క్యూరేటర్ వేయించుకున్నట్లు సమాచారం.
జూలో ఓ వర్గానికి అసిస్టెంట్ క్యూరేటర్ వత్తాసు పలుకుతూ... మరో వర్గానికి వేధింపులు గురి చేస్తున్నారని గతంలో ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు కొందరు విధులను మానేశారు. తాజాగా శనివారం పులితో క్రాసింగ్ చేయించి పేరు తెచ్చుకోవాలని అసిస్టెంట్ క్యూరేటర్ చూడటం కొసమెరుపు. ఈ ఘటనతో అధికారుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.