బాలాజీకి హైకోర్టులో ఊరట
Published Wed, Apr 20 2016 4:00 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
సీబీఐ కోర్టులో విచారణ నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న హబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస బాలాజీకి ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో ఆయనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేసింది. అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునూ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని, అప్పటివరకు సీబీఐ కోర్టులో విచారణ ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ శ్రీనివాస బాలాజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లేపాక్షి నాలెడ్‌జ హబ్‌లో పిటిషనర్ కేవలం ఉద్యోగి మాత్రమేనన్నారు. కంపెనీ లావాదేవీలతో బాలాజీకి సంబంధం లేదని, ఈ విషయాన్ని సీబీఐ చార్జిషీటే చెబుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement