శిరీష మృతికి కారణాలు తెలియదు: సతీష్ చంద్ర
హైదరాబాద్ : తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష భర్త సతీష్ చంద్ర అన్నారు. భార్య మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది.
మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్‌జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రావణ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అయితే శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలతో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు శిరీష మరణపై ఆమె తల్లి రామలక్ష్మి స్పందించారు. తన కూతురు చచ్చిపోయేంత పిరికిది కాదన్నారు. తన కూతుర్ని కావాలని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. శిరీష హ్యాండ్ బ్యాగ్ తెగిపోయి ఉందనిచ ముఖంపై గాయాలు కనిపిస్తున్నాయన్నారు. తన కుమార్తె పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రామలక్ష్మి ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కూతురు చావుకు వల్లభనేని రాజ్‌కుమార్ అలియాస్ రాజీవ్, అతని ప్రియురాలు తేజస్వి, శ్రావణ్ లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు.