బీ టెక్ తర్వాత నిర్వహణ నైపుణ్యాలకు.. ఎంబీఏ | Bee-tech skills to the management .. MBA | Sakshi
Sakshi News home page

బీ టెక్ తర్వాత నిర్వహణ నైపుణ్యాలకు.. ఎంబీఏ

Published Sat, Oct 25 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

బీ టెక్ తర్వాత నిర్వహణ  నైపుణ్యాలకు.. ఎంబీఏ

బీ టెక్ తర్వాత నిర్వహణ నైపుణ్యాలకు.. ఎంబీఏ

బీఈ/బీటెక్ పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు దృష్టి సారించేది ఎంటెక్ లేదా ఎంబీఏ వైపే. వీటిలో ఎంటెక్.. సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో విద్యార్థులను మరింత నిష్ణాతులుగా మారుస్తుంది. ఎంబీఏ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలకు తోడుగా నిర్వహణ  నైపుణ్యాలు అందిస్తుంది. భావి కెరీర్‌లో రాణించాలన్నా.. అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలన్నా.. టెక్నికల్ స్కిల్స్‌తోపాటే మేనేజీరియల్ స్కిల్స్ తప్పనిసరి. ఈ కారణంగానే ఎంబీఏ కోర్సులో చేరే బీటెక్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. సిటీలో ఎన్నో విద్యా సంస్థలు ఎంబీఏ/పీజీడీఎం కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలా? చేస్తే ఎలాంటి అవకాశాలుంటాయి? వంటి అంశాలపై నిపుణుల  విశ్లేషణ..
 
బీటెక్ ఒక్కటే సరిపోదు

ఇంజనీరింగ్‌లో ఏ కోర్సును ఎంచుకున్నా నేర్చుకునే సామర్థ్యాన్ని, క్లిష్ట సమయాల్లో అనుసరించాల్సిన తీరును ఆకళింపు చేసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా విద్యార్థి ఇంజనీరింగ్ సంబంధిత అంశాల్లో పట్టు సాధిస్తాడు. కానీ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పొందలేడు. బీటెక్/బీఈ పూర్తిచేసిన వారిలో ఎక్కువమంది సాంకేతిక నైపుణ్యాలను ఒంటబట్టించుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే వారు ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలతోపాటు తప్పనిసరిగా నిర్వహణ  నైపుణ్యాలు (మేనేజీరియల్ స్కిల్స్) అవసరమవుతున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థి మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా చదివితే మంచి ప్రొఫెషనల్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రోల్ ప్లేయింగ్, మేనేజ్‌మెంట్ మెథడ్స్, కేస్ స్టడీస్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్, ప్రజంటేషన్స్ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థి ఆల్‌రౌండర్‌గా రాణించేందుకు దోహదపడే మేనేజ్‌మెంట్ కోర్సులేవి? అంటే.. ఎంబీఏ/పీజీడీఎం... అనే సమాధానం వస్తుంది.
 
 ఎంటెక్/ఎంబీఏ

సాంకేతిక రంగంలో అత్యుత్తమంగా రాణించాలనుకుంటే ఎంటెక్ చేయాలి. ఒకవే ళ అలా కాకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనే పట్టుదల ఉంటే ఎంబీఏను ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లో చాలామంది మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నా వద్దనుకుని.. సొంత స్టార్టప్స్ వైపు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలంటే ఎంబీఏ తప్పనిసరి. బీటెక్ గ్రాడ్యుయేట్స్‌తో పోల్చుకుంటే ఎంబీఏ పూర్తిచేసినవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పరంగానే కాకుండా మంచి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి.
 
 అనుబంధ కోర్సులతో అదనపు లాభం

 ఎంబీఏలో అనుబంధ కోర్సులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆరోగ్య రక్షణ(హెల్త్ కేర్), పర్యాటకం (టూరిజం), ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ), రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్, బ్యాంకింగ్- బీమా (బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్), రిటైల్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, టెలికాం మేనేజ్‌మెంట్‌లను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రస్తుతం మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
 
 స్పెషలైజేషన్ చేయాలంటే ?

 మార్కెటింగ్, మానవ వనరులు (హెచ్‌ఆర్), ఫైనాన్స్, ఆపరేషన్స్, సమాచారం-సాంకేతిక పరిజ్ఞానం (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ), సిస్టమ్స్ ప్రధానమైనవి. కోర్సును ఎంపిక చేసుకునే ముందు స్వీయ అవగాహన ముఖ్యం. స్పష్టత లేకపోతే అధ్యాపకులు, అనుభవజ్ఞులు, మిత్రుల సలహా తీసుకోవాలి. తద్వారా సరైన నిర్ణయం దిశగా అడుగులేయాలి. మార్కెటింగ్‌ను ఎంచుకోవాలనుకుంటే..ప్రజలతో మాట్లాడటం, వారితో మమేకమయ్యే నైపుణ్యాలుతప్పనిసరి. మార్కెటింగ్ పరిశోధన, ఈ-మార్కెటింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ప్రజా సంబంధాలు, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్, నేరుగా విక్రయించడం, మార్కెటింగ్ విశ్లేషణ, సేల్స్ ప్రమోషన్ అండ్ అడ్వర్‌టైజింగ్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ప్రతి సంస్థకు పదుల సంఖ్యలో సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది. ఇక సంస్థల నిబంధనలు, యాజమాన్య నిర్వహణపై ఆసక్తి ఉంటే హ్యూమన్ రిసోర్సెస్‌లో స్పెషలైజేషన్ చేయడం ఉత్తమం. ఇందులోని మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూట్‌మెంట్, హెడ్ హంటింగ్, నియామకాలు, శిక్షణ, అభివృద్ధి, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, వివాదాల పరిష్కారం, విశ్లేషణ లాంటి పలు విభాగాల్లో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. అయితే మార్కెటింగ్‌తో పోల్చుకుంటే హెచ్‌ఆర్‌లో అవకాశాలు కొద్దిగా తక్కువే.
 
 ఫైనాన్స్ ఎంచుకుంటే


 ఆర్థిక వ్యవహారాల్లో ఆసక్తి ఉంటే ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేయడం మంచిది. ప్రతి సంస్థకు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ట్రెజరీ ఆపరేషన్స్, వ్యాల్యూయేషన్ , ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్, కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్.. వంటివాటిలో అవకాశాలు అందుకోవచ్చు. అయితే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్‌లకు ఈ రంగంలో ఉద్యోగాలు అధికం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ).. గత రెండు దశాబ్దాలుగా ఎంతో ఆదరణ పొందుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులోనే స్పెషలైజేషన్ చేస్తున్నారు. కారణం దీన్ని పూర్తి చేసిన వెంటనే మంచి ఉద్యోగ అవకాశాలు లభించడమే. క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, వెబ్ అప్లికేషన్స్, బిజినెస్ కంప్యూటింగ్, సాఫ్ట్ కంప్యూటింగ్ వంటివి ఐటీలో ఉంటాయి. అయితే దీనిని ఎంచుకునే ముందు సిలబస్, దాని పరిధి ఏమిటో క్షుణ్నంగా తెలుసుకొని అడుగువేయాలి. ఐటీలో పట్టు సాధిస్తే కోరినంత ప్యాకేజీతో కొలువును సొంతం చేసుకోవచ్చు. ఔట్‌సోర్సింగ్ ద్వారా విదేశాల నుంచి కొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు. ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్.. ఆపరేషన్స్ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ చేసినవారికితయారీ రంగానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కూడా లాజిస్టిక్స్‌లో ఓ భాగం. ఎంబీఏలో లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది.
 
 సీఈఓ కావొచ్చు


 స్పెషలైజేషన్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఎంచుకున్న అంశంలో ఎంతవరకు రాణించగల అవకాశం ఉందో తెలుసుకోవాలి. ప్రతి స్పెషలైజేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి మీ శక్తి సామర్థ్యాలు, వ్యక్తిత్వం సరిపోతాయా? నలుగురినీ ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు మీలో ఉన్నాయా? సరిచూసుకోవాలి. అంతర్గత నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులపై మంచి పట్టు సాధిస్తే.. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటే 10-15 ఏళ్లలో మీరు పనిచేస్తున్న కంపెనీకి సీఈఓ కూడా కావచ్చు. అయితే ఎంబీఏ ఎక్కడ చేశారు? ఆ సంస్థ స్థాయి, గుర్తింపు వంటి అంశాలు కూడా ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. అత్యుత్తమ ఎంబీఏ కళాశాలలేవో తెలుసుకోవడానికి వివిధ పత్రికలు, మేగజీన్‌‌స సర్వేలు నిర్వహిస్తుంటాయి. వీటి ఆధారంగా ఏ కళాశాలను ఎంచుకోవాలనేదానిపై అవగాహనకు రావచ్చు.

 ఎంబీఏ/పీజీడీఎంను అందించే విద్యా సంస్థలు

‘‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం)/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీఎం) అనేవి ఎంబీఏను పోలిన కోర్సులు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు ఈ కోర్సును అందిస్తున్నాయి. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్/బృంద చర్చలు/అకడమిక్ రికార్డ్/వర్క్ ఎక్స్‌పీరియన్స్/పర్సనల్ ఇంట ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు కూడా ఎంబీఏను ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లలో మేనేజ్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిర్దేశిత మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి సంస్థను బట్టి క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్/ఐసెట్/ఏటీఎంఏ స్కోర్ ఆధారంగా ప్రవే శం కల్పిస్తున్నాయి. ఇక విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చే యాలంటే గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) లో మంచి ర్యాంకు సాధించాలి. అయితే విదేశీ వర్సిటీలు అభ్యర్థుల రెండు, మూడేళ్ల పని అనుభవానికి ప్రాధాన్యతనిస్తున్నాయి.            

 - ప్రొఫెసర్. ఎ.రామచంద్ర ఆర్యశ్రీ, మాజీ డెరైక్టర్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, జేఎన్‌టీయూహెచ్
 
 భావనలు, అన్వయ సామర్థ్యాలు
 ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్‌లో రాణించాలంటే ఇంజనీరింగ్ సూత్రాల అన్వయ సామర్థ్యం, నైపుణ్యాల నిర్వహణ, కింది స్థాయిలో పనిచేసేవారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రస్తుతం కావాల్సినవి ఏమిటో తెలుసుకోవడం వంటివి చాలా ముఖ్యం. భావనలు (కాన్సెప్ట్స్), అన్వయ సామర్థ్యాలు ఇంజనీరింగ్ డిగ్రీలోఉంటాయి. కానీ సంస్థాగత నైపుణ్యాలు, ప్రాజెక్టుల రూపకల్పనలో కిందిస్థాయి వారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టు నిర్వహణ లాంటి విషయాలు మేనేజ్‌మెంట్ డిగ్రీ అయిన ఎంబీఏలో ఉంటాయి. అందుకే బిజినెస్ స్కూళ్లలో ఎక్కువగా కేస్ స్టడీస్ అధ్యయనం చేయడంతోపాటు సంక్షోభం తలెత్తిన సందర్భంలో వాటిని ఎదుర్కొనే మార్గాలను బోధిస్తారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement