
‘భగీరథ’ తొలిదశ ఆగస్టుకు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు మొదటి దశ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. తొమ్మిది నియోజకవర్గాల్లో ఏప్రిల్ 30లోగా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించాలని తొలుత సర్కారు భావించినా వీలు కాలేదు. ఆ తర్వాత వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా.. ఆచరణలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆగస్టు 31 నాటికైనా మొదటిదశ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం తాజాగా డెడ్‌లైన్ విధించినట్లు తెలిసింది. ఒకట్రెండు నియోజక వర్గాల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహిం చినా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆశించిన మేరకు నీటి లభ్యత లేకపోవడంతో ఇప్పటికిప్పుడు మొదటిదశను ప్రారంభించాలనే ప్రతి పాదనను ప్రభుత్వం విరమించుకుంది.
మరోవైపు యంత్రాంగమంతా సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌పైనే దృష్టి సారించడంతో మిగతా నియోజకవర్గాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌కు సరఫరా చేసే నీటిని మధ్య లో ట్యాపింగ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తే నగరంలో మంచినీటి సమస్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మొదటి దశను ప్రారంభించడంపై సర్కారు వెనుకడు గు వేసినట్లు సమాచారం. సకాలంలో వర్షా లు కురిస్తే హైదరాబాద్‌లో తాగునీటి ఇబ్బం దులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలిదశలో ఈ నియోజకవర్గాలకు..
మిషన్ భగీరథ తొలిదశ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పైప్‌లైన్ల నుంచి మూడు పాయింట్ల వద్ద నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. కొండపాక ట్యాపింగ్ పాయింట్ నుంచి వరంగల్ జిల్లా జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు... ప్రజ్ఞాపూర్ ట్యాపింగ్ పాయింట్ నుంచి గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాలకు... ఘన్‌పూర్ పాయింట్ నుంచి భువనగిరి, ఆలేరు, మేడ్చల్ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించారు. కూలీలు దొరక్క పనుల్లో జాప్యం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.