'హరితహారం పెద్ద కుంభకోణం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకం ఓ పెద్ద కుంభకోణమని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. గురువారం హైదరాబాద్లో భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... హరితహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మంచి కానీ... ఈ కార్యక్రమం అమలులో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతీ పథకంలో ఓ కుంభకోణం ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. ఏ ఒక్క హామీని ఆయన పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. కేజీ టు పీజీ, మైనార్టీ రిజర్వేషన్ల ఊసే లేదని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దోపిడీ, వంచన లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని డిమాండ్ చేశారు.
123 జీవోలో కేవలం భూమి కొనుగోలు గురించి మాత్రమే ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు దాని అనుబంధ సంఘాలను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అందుకోసం 30 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోచ్చామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాలోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.