28న హర్తాళ్‌ను విజయవంతం చేయండి
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన పిలుపు
- దేశవ్యాప్తంగా లెఫ్ట్, ఇతర ప్రతిపక్షాల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు
- పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే..
- కానీ దీని వల్ల కుచేలురు బలవుతున్నారు
- వారి ఇబ్బందుల్ని తొలగించేలా కేంద్రం చర్యలు లేవు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కలుగుతున్న కష్టనష్టాలపై కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 28న దేశవ్యాప్తంగా వామపక్షాలతోపాటు ఇతర ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుల్ని వీధుల్లో నిలబెట్టిన కేంద్రప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రజలు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు పలుకుతోందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, రవాణా వంటివి స్తంభించేలా ప్రజలు హర్తాళ్‌లో పాల్గొనాలని భూమన విజ్ఞప్తి చేశారు.
శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలుంటాయని ఆశించినా కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. దీనికితోడు మరిన్ని చర్యలను ప్రభుత్వం ప్రకటించడంతో.. మూలిగే నక్కమీద తాటిపండులా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పేదవాళ్లపై ఈ నిర్ణయం ఉరుములేని పిడుగులా పడిందన్నారు. దేశంలో ఎక్కడా నగదు లభించట్లేదని, బ్యాంకుల్లో పరిస్థితులు దారుణంగా మారాయని, ఏటీఎంలు మూతపడ్డాయని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల బాధలు మరింతగా పెరిగాయన్నారు.
ప్రజల కష్టాల్ని పట్టించుకోవడంలో వైఎస్సార్‌సీపీ ముందుంటుంది..
ప్రజల కష్టనష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అగ్రగామిగా ముందుంటుందని భూమన అన్నారు. ‘‘రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటం ద్వారా నల్లధనాన్ని, నకిలీ ధనాన్ని, ఉగ్రవాద మూలాల్ని తుదముట్టించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వైఎస్సార్‌సీపీ ఎప్పట్నుంచో మద్దతిస్తోంది. అరుుతే ఈ నిర్ణయంతో కుచేలురు బలవుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈనెల 9నుంచే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడడం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 23న ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. కానీ 18 రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పులు కనిపించట్లేదు. ప్రధాని నిర్ణయం సరైనదేనైనా అమలు సరిగా లేనప్పుడు ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ హర్తాళ్‌ను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది’’ అని భూమన తెలిపారు.
ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల వైఎస్సార్‌సీపీ సంతాపం..
మహానేత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలకు జెండాగా ఉన్నటువంటి ఫిడెల్ క్యాస్ట్రో మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేస్తోందని భూమన పేర్కొన్నారు. ఆయన మృతి విప్లవ ప్రపంచానికే తీరని లోటన్నారు. విప్లవ వీరులకు క్యాస్ట్రో చూపిన మార్గం ఆచరణీయమని కొనియాడారు.