హైదరాబాద్ జిల్లా హౌసింగ్ విభాగం పీడీపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌసింగ్ పీడీ ఎస్.కృష్ణయ్యను...
- ఇళ్లు మంజూరు చేస్తానని దళారులతో కుమ్మక్కు
- ‘అవామీ’ సొసైటీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా హౌసింగ్ విభాగం పీడీపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌసింగ్ పీడీ ఎస్.కృష్ణయ్యను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి బాధ్యతలను హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రకాశంకు అప్పగించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లు కావాలని ‘అవామీ హౌసింగ్ సొసైటీ’ అనే సంస్థ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో దరఖాస్తు పెట్టించింది. హౌసింగ్ విభాగానికి షేక్‌పేట్, ఖైరతాబాద్ మండలాల్లో 1,450 దరఖాస్తులు అందాయి.
ఇందులో 300మందికే ఇళ్ల మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఒక్కొక్క దరఖాస్తుదారుడి నుంచి రూ.20 వేల చొప్పున అవామీ సొసైటీ ప్రతినిధి ఒకరు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇల్లు మంజూరు కాని వారంతా ఒత్తిడి చేయడంతో.. కనీసం 600 మందికైనా ఇళ్లు ఇప్పించేలా హౌసింగ్ పీడీతో రూ.60లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ‘అవామీ హౌసింగ్ సొసైటీ’ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.