హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లడం అనైతికమని, నేతలు ఏం ఆశించి అధికార పార్టీలోకి వెళ్లారో చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తోందని ఆయన విమర్శించారు.
అధికారంలో ఉన్న తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు తగదని రాఘవులు హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసు, కాల్మనీ కేసులు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్మనీ కేసులో టీడీపీ నేతలు దొంగల్లా దొరికారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో ఒకే దగ్గర నిధులు కెటాయించడం సరికాదని రాఘవులు తెలిపారు.