
ఔటర్ పై ప్రమాదం.. కాలిబూడిదైన కారు
ఔటర్ రింగు రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తి మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించి వెంటనే బయటకు రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ రాజేంద్రనగర్ ఎగ్జిట్ సమీపంలో చోటుచేసుకుంది.
ఆ వివరాలిలా ఉన్నాయి... జీఎంఆర్ సంస్థలో పనిచేస్తున్న రవిశంకర్ అనే వ్యక్తి గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. పరిస్థితి గమనించిన అందులోని వ్యక్తి కారు నుంచి దిగాడు. ఆపై కొంత సమయంలోనే కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ప్రమాదానికి గురై దగ్దమైన కారు నెంబర్ ఏపీ 28 బీపీ 8805 అని సమాచారం.