
జర్నలిస్టుల హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి
ఇటీవల ఉత్తర భారతదేశంలో జరుగుతున్న జర్నలిస్టుల హత్యలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని ఐజేయూ
కవాడిగూడ: ఇటీవల ఉత్తర భారతదేశంలో జరుగుతున్న జర్నలిస్టుల హత్యలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హత్యలను నివారించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గురువారం ఐజేయూ, టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో నిరసన ధర్నా జరిగింది. ఈసందర్భంగా హాజరైన దేవులపల్లి అమర్ మాట్లాడుతూ తాజాగా వెలుగు చూస్తున్న వ్యాపమ్ కుంభకోణంలో నిందితులు, సాక్షులు, జర్నలిస్టులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనుయాయులు షాజాపూర్‌లో జితేందర్‌సింగ్‌ను పగపట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా జితేందర్ సింగ్ తన మరణ వాంగ్మూలంలో కూడా వివరించినట్లు తెలిపారు. ఎంపీలో దీక్షిత్ అనే జర్నలిస్టును హత్య చేశారన్నారు. వీటితో పాటు అస్సోం, ఉత్తరాఖండ్‌లలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఐజేయూ నేత నరేందర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.సత్యనారాయణ, హెచ్‌యూజే హైదరాబాద్ అధ్యక్షులు కోటిరెడ్డి, ఎ.రాజేష్, శంకర్‌గౌడ్, ఐలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.