
విజయరామారావుకు చంద్రబాబు ఫోన్ కాల్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నుంచి వరుసబెట్టి సీనియర్ నేతలంతా పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేపట్టారు. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావుకు ఆయన శనివారం ఫోన్ చేశారు. పార్టీ మారడంపై తొందరపడవద్దని చంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. అయితే ఆలోచించి తన నిర్ణయం చెబుతానని విజయరామారావు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం విజయరామారావును ఆయన నివాసంలో కలవనున్నారు.
కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీ మారారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.