చంద్రబాబు లక్ష్యం నెరవేరదు: అంబటి
హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సీపీ అడ్డుపడుతోందని ప్రతిపక్షంపై చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు నోరు విప్పితే పచ్చి అబద్ధాలే అని, ఆయనకు లక్షల కోట్లు సంపాదించాలన్న పిచ్చి పట్టిందని అంబటి విమర్శించారు.
తాము అభివృద్ధికి అడ్డుకాదని, అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతికి మాత్రమే అడ్డుపడుతున్నామని అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమా అని చంద్రబాబు అంటున్నారని, దమ్ముంటే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీ అవసరమో కాదో ప్రజలే చెబుతారన్నారు. తాము ఏకపక్షంగా ఎన్నికయ్యామని చెప్పుకోవటం సిగ్గుచేటు అని అంబటి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ ఉంటే టీడీపీకి పుట్టగతులు ఉండవని బాబుకు భయం పట్టుకుందన్నారు.
చంద్రబాబు మాత్రం కేసుల్లో స్టేలు తెచ్చుకుంటారని, అదే ప్రభుత్వంపై ఎవరైనా స్టే తెచ్చుకుంటే ఉన్మాదుల్లా వ్యవహరిస్తారని అంబటి అన్నారు. తెలంగాణలో నయీం ట్యాక్స్లా ఏపీలో లోకేవ్ ట్యాక్స్ నడుస్తోందని అంబటి ఎద్దేవా చేశారు. లోకేశ్ అంటేనే అవినీతి అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లక్ష్యం తన కొడుకు లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడమే అని, అయితే ఆయన లక్ష్యం నెరవేరదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంబటి మండిపడ్డారు. నిజాల్ని కప్పిపుచ్చి తాను సమర్థుడినని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.