ఇకపైనా దూకుడే!
శుక్రవారం సభలో పార్టీ తీరుపై చంద్రబాబు సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాల్లో దూకుడుగానే వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రైతుల ఆత్మహత్యల అంశంపై శుక్రవారం సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ అధినేత చంద్రబాబు భవిష్యత్తులోనూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకులకు సూచించినట్లు తెలిసింది. విద్యుత్, రైతుల ఆత్మహత్యలతో పాటు టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఇతర పక్షాలతో కలిసి టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగాలని బాబు హితబోధ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సోమవారం కూడా సభా కా ర్యక్రమాలను అడ్డుకునే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావును ముందు పెట్టి రేవంత్ ద్వారా సర్కారుపై దాడికి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోం ది. సభలో చర్చ జరిగితే టీడీపీ రంగుబయట పడుతుందని అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే విమర్శిస్తున్న నేపథ్యంలో చర్చ జరిగేటప్పుడే ఇతర పక్షాలతో కలసి ఎదురుదాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపా రు. సీఎం కేసీఆర్, హరీశ్ ప్రాతిని ధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో రైతు ల ఆత్మహత్యలను సభ ముందుకు తీసుకొచ్చి ఇరుకునపెట్టే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు.
కాగా.. శుక్రవారం తాము సస్పెన్షన్‌కు గురైనప్పుడు మిత్రపక్షం బీజేపీ కలిసిరాకపోవడంపై పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే సీఎల్‌పీ నేత జానారెడ్డి మద్దతు కూడగట్టే పనిని రేవంత్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. సభలో శుక్రవారం వ్యవహరించిన తీరుపై రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే... ‘మా దూకుడు ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం కొంత మందిని మేనేజ్ చేయడం ద్వారా తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. అది జరగనివ్వం. అందుకు తగ్గ ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి. అవన్నీ బయటపెడతా’ అని వ్యాఖ్యానించారు.