
పెళ్లి వేళకు వరుడు మరో యువతితో ప్రత్యక్షం!
కుషాయిగూడ(హైదరాబాద్): వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి నిర్ణయించి పెళ్లి పత్రికలు కూడా అచ్చువేశారు. ఆదివారం ఉదయం 10.33 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి కొడుకు ముఖం చాటేశాడు. అంతటితో ఆగకుండా తన మేన మరదలను వివాహం చేసుకొని పోలీసుల రక్షణ కోరుతూ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. విషయం తెలిసిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
కాపామహ్మదీయ కాలనీకి చెందిన ఓ యువతి, మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కాప్రా శ్రీరాంనగర్‌కు చెందిన మంద మహేశ్ (22) పరస్పరం ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో ఏడాది క్రితమే నిశ్చితార్థం అయింది. ఈ క్రమంలో ఆదివారం 10.33 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు కానీ, పెళ్లి వేళకు మహేశ్ ముఖం చాటేశాడు. చౌదర్‌పల్లికి చెందిన తన మేనకోడలిని ఆదివారం అదే ముహుర్తానికి యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. సాయంత్రం పోలీసులు రక్షణ కోరుతూ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది ఆ జంట. విషయం తెలిసిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
కాగా, నమ్మించి మోసం చేసినందుకు మంద మహేశ్‌తో పాటుగా అతని అక్క, బావ మాధవి, శ్రీనివాస్, మేనమామలు యాదయ్య, బాలయ్యలపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు.