రాగితో ఊబకాయానికి చెక్
సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గేందుకు చాలా మంది ఊబకాయులు తిండి తినడం బాగా తగ్గించేస్తుంటారు. దీంతో బరువు తగ్గడం మాటెలా ఉన్నా... ముందు నీరసం, ఆ తరువాత రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే తినడం పెద్దగా తగ్గించకుండానే.. రాగి (కాపర్) శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం ద్వారా తీసుకునే రాగి శరీరంలోని కొవ్వును కరిగించే విషయంలో బాగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
శరీరంలో రక్తకణాలు తయారయ్యేందుకు, శరీరం ఇనుమును శోషించుకునేందుకు, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు, అనుసంధాన కణజాలం (కనెక్టివ్ టిష్యూ) అభివృద్ధికి రాగి తోడ్పడుతుందని ఇప్పటికే వెల్లడైందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ చాంగ్ వెల్లడించారు. ఈ పరిశోధన కోసం ఊబకాయంతో ఉండి, ‘విల్సన్స్ డిసీజ్’ పరిస్థితి ఉన్న ఎలుకలను శాస్త్రవేత్తల బృందం ఎంచుకుంది. అవసరానికి మించి అందిన రాగి (కాపర్) ని శరీరం బయటకు విసర్జించలేకపోవడం, తద్వారా కాలేయం సహా పలు అవయవాల్లో రాగి ఎక్కువగా చేరుకోవడమే విల్సన్స్ డిసీజ్. రాగి ఎక్కువగా ఉన్న ఈ ఎలుకలు ఊబకాయంతో ఉన్నా.. వాటిల్లో కొవ్వు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి కొవ్వు కణాల్లో రాగి తక్కువగా ఉంది. కొవ్వును కరిగించే మందుల ప్రభావం విల్సన్ డిసీజ్ ఉన్న ఎలుకల్లో తక్కువగా ఉందని గుర్తించారు. అప్పటికే కొవ్వు కణాలను రాగి నియంత్రిస్తుండడమే దీనికి కారణమని తేల్చారు. దీనిని బట్టి కొవ్వు కణాలను కరిగించడంలో రాగి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు అంచనాకు వచ్చామని క్రిస్ చాంగ్ తెలిపారు. అయితే అధిక మోతాదులో రాగిని తీసుకోవడం శరీరంలోని లోహాల సమతౌల్యాన్ని దెబ్బతీయవచ్చని స్పష్టం చేశారు.
►జాతీయ పౌష్టికాహార సంస్థ అంచనాల ప్రకారం సాధారణ వ్యక్తులకు ప్రతిరోజు రెండు మిల్లీగ్రాముల రాగి అవసరం. అంతకు మించకూడదు.
►రాగి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు నువ్వులు, జీడిపప్పు, కాబూలీ శనగలు, పీతలు, ఎండ్రకాయలు.