
1.10 కోట్లతో పరారైన సీఐ అరెస్ట్
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో ఓ పోలీస్, కాంగ్రెస్ నేత కలిసి భారీ మోసానికి పాల్పడ్డ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో ఓ పోలీస్, కాంగ్రెస్ నేత కలిసి భారీ మోసానికి పాల్పడ్డ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు సీఎం క్యాంపు కార్యాలయం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం విజయవాడలో అరెస్ట్ చేశారు. కేవలం రూ.18 వేలకే తులం బంగారమని వ్యాపారిని నమ్మించి వీరు బంజారాహిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్ కేంద్రంగా దందా చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కాంగ్రెస్ నేత తిరుమలేష్ నాయుడు కీలక పాత్రధారిగా ఈ మోసాలు జరుగుతున్నాయి. బంగారం ఇస్తామని చెప్పిన తిరుమలేష్.. వ్యాపారి అగర్వాల్ వద్ద నుంచి రూ.30 లక్షల నగదు, రేవంత్ అనే వ్యక్తి నుంచి రూ.50 లక్షలు, మరో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.30 లక్షల డీల్ కుదుర్చుకున్నారు.
అదే సమయంలో సీఐ రాజశేఖర్‌తో కలిసి తిరుమలేష్ నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారు. వ్యాపారులు రాగానే ప్లాన్ ప్రకారం ఇద్దరు కానిస్టేబుళ్లతో సీఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాడు. డబ్బు తెచ్చిన వ్యక్తుల వద్ద నుంచి మొత్తం సొమ్ము రూ.1.10 కోట్లు తీసుకుని సీఐ రాజశేఖర్ పరారయ్యాడు. తాము మోసపోయినట్లు గ్రహించిన అగర్వాల్, రేవంత్ ఈ ఘటనపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు తిరుమలేష్ నాయుడును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సీఐ రాజశేఖర్‌ను ఆదివారం పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.